Begin typing your search above and press return to search.

పవన్ కల్యాణ్ పై తమిళనాడులో క్రిమినల్ కేసు.. సెక్షన్స్ ఇవే!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ కు తమిళనాడులో లీగల్ షాక్ తగిలింది! ఇందులో భాగంగా.. తమిళనాడులోని అన్నానగర్ పోలీస్ స్టేషన్‌ లో పవన్ కళ్యాణ్‌ పై కేసు నమోదైంది

By:  Tupaki Desk   |   1 July 2025 8:22 PM IST
పవన్ కల్యాణ్  పై తమిళనాడులో క్రిమినల్  కేసు.. సెక్షన్స్  ఇవే!
X

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ కు తమిళనాడులో లీగల్ షాక్ తగిలింది! ఇందులో భాగంగా.. తమిళనాడులోని అన్నానగర్ పోలీస్ స్టేషన్‌ లో పవన్ కళ్యాణ్‌ పై కేసు నమోదైంది. గత నెలలో మధురైలో జరిగిన మురుగన్ భక్తుల సదస్సులో పాల్గొన్న సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. దీంతో ఈ విషయం వైరల్ గా మారింది.

అవును... జూన్ 22న మధురైలో మురుగన్ భక్తుల సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సమయంలో... ద్వేషపూరిత ప్రసంగాలు చేసి, మత విధ్వేషాలను ఉద్రిక్తతను రెచ్చగొట్టారని ఆరోపిస్తూ పవన్ కళ్యాణ్, అన్నామలై తో పాటు అనేక మంది నిర్వాహకులపైనా కేసు నమోదైంది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం... మధురై పీపుల్స్ ఫెడరేషన్ ఫర్ కమ్యూనల్ హార్మనీకి చెందిన న్యాయవాది వంజినాథన్ ఫిర్యాదు ఆధారంగా అన్నానగర్ పోలీస్ స్టేషన్‌ లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. ఈ క్రమంలో వీరిపై భారతీయ న్యాయ సంహిత లోని సెక్షన్లు 196(1)(ఏ), 299, 302, 353(1)(బి)(2) ల కింద కేసు నమోదు చేశారు.

ఈ సమావేశాల్లో చేసిన ప్రసంగాలు, తీర్మానాలు.. మతం, జాతి, ప్రాంతం ఆధారంగా సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించేవిగా, ఇతర వర్గాల మతపరమైన భావాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని.. ఆధ్యాత్మిక సమావేశం ముసుగులో సామరస్యాన్ని రెచ్చగొట్టే లక్ష్యంతో బహిరంగ వ్యాఖ్యలు చేశారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

కాగా... ఈ కార్యక్రమంలో హిందువులు ఒక కూటమిగా ఓటు వేయాలని కోరుతూ.. దేవాలయాలను ఆదాయ వనరులుగా పరిగణిస్తున్నందుకు డీఎంకే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పలు తీర్మానాలు ఆమోదించబడ్డాయి! ఈ సందర్భంగా ప్రసంగించిన పవన్... హిందువుల్ని ప్రశ్నించేవారికి అరేబియా నుంచి వచ్చిన మతాల్ని ప్రశ్నించే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు.

మురుగన్‌ భక్తులు ఒక్కచూపు చూస్తే.. తమ దేవుడ్ని దూషించే కూటమి కనిపించకుండా పోతుందని అన్నారు. ఇదే సమయంలో... సహజంగా నాస్తికులు దేవుడ్ని నమ్మరు.. కానీ, కొందరు హిందూ దేవుళ్లనే నమ్మం అంటున్నారని.. హిందూధర్మాన్ని తప్పితే ఇతర ధర్మాల్ని ఎత్తిచూపే ధైర్యం వారికి లేదని పవన్ వ్యాఖ్యానించారు.