Begin typing your search above and press return to search.

పవన్ మౌనం బద్ధలు.. పార్టీ నేతలపై ఫైర్

జనసేన అధినేత.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మౌనం బద్ధలైంది. గడిచిన కొద్దిరోజులుగా పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. పార్టీ ఎమ్మెల్యేల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

By:  Tupaki Desk   |   3 Feb 2026 9:40 AM IST
పవన్ మౌనం బద్ధలు.. పార్టీ నేతలపై ఫైర్
X

జనసేన అధినేత.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మౌనం బద్ధలైంది. గడిచిన కొద్దిరోజులుగా పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. పార్టీ ఎమ్మెల్యేల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతేనా.. పవర్ ఫుల్ క్లాస్ పీకటమే కాదు.. సూటిగా ప్రశ్నలు సంధించారు. అసత్యాల్ని ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలకు ఎందుకు కౌంటర్లు ఇవ్వరన్న ప్రశ్నను సంధించిన ఆయన.. తీరు మార్చుకోవాలన్న హెచ్చరికల్నిజారీ చేయటం గమనార్హం.

పార్టీ జనరల్ బాడీ సమావేశ వేదికగా పార్టీ నేతల్ని.. కార్యక్రమాల్ని.. ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై తనకున్న కోపాన్ని కక్కేశారు. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన తిరుమల లడ్డూ కల్తీపై పార్టీ ఎమ్మెల్యేలు స్పందించిన తీరును తక్షణమే మార్పులు చేసుకోవాలన్నారు. వైసీపీ నేతల విమర్శల ధాటిని తట్టుకొని.. వారికి అంతే ధీటుగా కౌంటర్లు వేయాలని ఆదేశించించటం గమనార్హం.

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఇంత జరుగుతున్నా ఏ ఒక్కరూ ఎందుకు మాట్లాడటం లేదన్న పవన్.. అన్నింటికీ తానే సమాధానం చెప్పాలా? అని సూటిగా ప్రశ్నించటం చూస్తే.. పార్టీ ఎమ్మెల్యేల తీరుపై ఆయన ఎంత ఆగ్రహంగా ఉన్నారో ఇట్టే అర్థమవుతుంది. అంతేకాదు.. ‘‘మీరు ఎమ్మెల్యేలుగా.. మంత్రులుగా ఎందుకు ఉన్నట్లు?’’ అంటూ కడిగేసేలా మాట్లాడిన తీరు తర్వాతైనా జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు తమ గొంతుల్ని సవరించుకుంటారా? లేదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ఓవైపు పార్టీ నేతలకు క్లాస్ పీకిన పవన్ కల్యాణ్ అదే సమయంలో వైసీపీ ఎత్తుగడలపై సూచనలు చేయటం గమనార్హం. వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతారని.. అప్రమత్తంగా ఉంటూ ఆ కుతంత్రాల్ని తిప్పి కొట్టాలన్న పవన్.. నేతల వ్యక్తిగత వ్యవహారాలు పార్టీకి నష్టం కలగకూడదన్నారు. సిద్దాంతపరంగా.. విషయాల మీదనే మాట్లాడాలని దిశానిర్దేశం చేశారు.

వైసీపీ నేతల ట్రాఫ్ లో చిక్కుకోవద్దన్న పవన్.. ‘‘మీపై.. మీ కుటుంబ సభ్యులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. జాగ్రత్త.. జనసేన నేతలు మాత్రం సిద్ధాంతపరంగా.. సబ్జెక్టు పరంగానే మాట్లాడాలి. విమర్శలకు విషయంతోనే సమాధానం చెబుదాం. మహిళల విషయంలో పార్టీ శ్రేణులు మరింత జాగ్రత్తగా ఉండాలి. మహిళలకు మీ చేయి తగిలినా రేప్ చేశారని వైసీపీ నేతలు ప్రచారం చేస్తారు’’ అంటూ పార్టీ నేతలతో పేర్కొన్నారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన తీర్మానాలను మంత్రి నాదెండ్ల భాస్కర్ వెల్లడించారు. ఇందులో రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ వివాదంపై చర్చించామని.. పార్టీ కమిటీ రిపోర్టు ఆధారంగా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేస్తూ తీర్మానాలు చేయటం ద్వారా విపక్ష విమర్శలకు చెక్ చెప్పినట్లుగా చెబుతున్నారు.