Begin typing your search above and press return to search.

బీజేపీ నాయకుడు పవన్ అని జనాలు అనుకుంటున్నారా ?

అయితే మిత్రపక్షంగా ఉంటూ వస్తున్న జనసేన బీజేపీల మధ్య బంధం గట్టిగానే బలపడింది. అదే సమయంలో బీజేపీకి అండగా పవన్ ఉంటూ వస్తున్నారు.

By:  Tupaki Desk   |   12 July 2025 11:00 PM IST
బీజేపీ నాయకుడు పవన్ అని జనాలు అనుకుంటున్నారా ?
X

పవన్ కళ్యాణ్ కి సొంత పార్టీ ఉంది. దాని పేరు జనసేన. అది 2014 మార్చిలో హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఇక పవన్ కళ్యాణ్ పార్టీకి ఒక గుర్తు ఉంది. ఆయన పార్టీకి రాజకీయ సిద్ధాంతం సైతం ఉంది. కానీ పవన్ ని జనసేన నాయకుడుగా జనాలు చూడడం లేదా. ఆ పార్టీ అధినేతగా ఉన్న పవన్ ని అలా చూడకుండా మరెలా చూస్తున్నారు అంటే బీజేపీ నేతగానేనట .

ఈ విషయం మీద పీసీసీ చీఫ్ షర్మిల తనదైన శైలిలో సెటైర్లు పేల్చారు. ఆమె పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆయన జనసేనలో ఉన్నారో లేక బీజేపీలో ఉన్నారో మాకైతే అర్థం కావడం లేదని అన్నారు. జనాలు కూడా ఇదే రకంగా కన్ఫ్యూజన్ లో ఉన్నారని ఆమె చెప్పడం విశేషం. ఆమెను మీడియా పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నించింది.

మాతృ భాష అమ్మ, హిందీ భాష పెద్దమ్మ అని హిందీ దివస్ లో పవన్ చేసిన వ్యాఖ్యలను షర్మిల దృష్టికి మీడియా తీసుకుని వెళ్ళింది. దాని మీద రియాక్ట్ అయిన షర్మిల పవన్ ఏ పార్టీలో ఉన్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. అంటే ఆయన జనసేన అధినేతగా ఉన్నా బీజేపీ అజెండాతో ముందుకు సాగుతున్నారన్నది ఆమె వ్యాఖ్యల భావనగా ఉందని అంటున్నారు

అయితే పవన్ హిందీ భాషకు సంబంధించిన ఇష్యూలోనే కాకుండా ఇంకా చాలా విషయాంలలో బీజేపీ ఫిలాసఫీనే తన ఫిలాసఫీగా చేసుకుని మాట్లాడుతున్నారని అంటున్నారు. హిందూత్వను అలాగే సనాతన ధర్మం అని పవన్ ఆ మధ్య నుంచి ఈ మధ్య కాలం దాకా చేస్తున్న వ్యాఖ్యలు అన్నీ బీజేపీ సిద్ధాంతాలు గానే ఉన్నాయని అంటున్నారు.

అయితే మిత్రపక్షంగా ఉంటూ వస్తున్న జనసేన బీజేపీల మధ్య బంధం గట్టిగానే బలపడింది. అదే సమయంలో బీజేపీకి అండగా పవన్ ఉంటూ వస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో విరివిగా పాల్గొనడమే కాకుండా దక్షిణాదిన బీజేపీకి నమ్మకమైన నేస్తంగా ఉన్నారు.

దాంతో పాటు పవన్ బీజేపీ విధానాలు సిద్ధాంతాలను కూడా ఇష్టపడుతున్నారు అని అంటున్నారు. అయితే పవన్ విషయంలో చూస్తే గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలతో పోల్చి చూస్తూ పాత వాటిని సోషల్ మీడియాలో పెట్టి మరీ ఆయన మీద విమర్శలు ఎక్కు పెడుతున్నారు. ఒకనాడు హిందీని దేశమంతా రుద్దుతున్నారు అని పవన్ విమర్శించిన పాత వీడియోలను కూడా బయటకు తెస్తున్నారు ఇపుడు మాత్రం హిందీని పెద్దమ్మ అని ఎలా అంటారని బీజేపీ వ్యతిరేకులు అంతా ఆయన మీద తీవ్ర వ్యాఖ్యలే చేస్తున్నారు.

మరో వైపు చూస్తే హిందూత్వ మీద పవన్ చేస్తున్న వ్యాఖ్యల పట్ల కామ్రేడ్స్ సైతం మండుతున్నారు. కాంగ్రెస్ కూడా పవన్ ని తప్పుపడుతోంది. అందులో భాగమే షర్మిల వ్యాఖ్యలుగా చూడాలని అంటున్నారు. కన్యాశుల్కంలో గిరీశం అన్నట్లుగా ఒపీనియన్స్ మార్చుకోవాల్సింది రాజకీయ నాయకులే. అందులో తప్పేముంది అన్న మాట ఉంది. మరి పవన్ గతంలో అలా అన్నారని ఇపుడు ఇలా అనకూడదని ఎక్కడ ఉందని ఆయన మద్దతుదారులు అంటున్నారు. ఏది ఏమైనా పవన్ బీజేపీకి బలమైన నమ్మకమైన ప్రియమైన మిత్రుడిగా ఉన్నారు అన్నది ఆయన రాజకీయ వ్యవహార శైలి అయితే తెలియచేస్తోంది అన్నది విశ్లేషకుల మాట.