పవన్‌తో బీజేపీకి మంచి కెమిస్ట్రీ... !
సాధారణంగా బీజేపీకి ఉన్న లక్షణం.. తన కూటమిలో ఉన్న పార్టీలతో ఎంత వరకు ఉండాలో అంత వరకే ఉండడం.
By: Tupaki Desk | 29 Nov 2024 6:30 PM GMTసాధారణంగా బీజేపీకి ఉన్న లక్షణం.. తన కూటమిలో ఉన్న పార్టీలతో ఎంత వరకు ఉండాలో అంత వరకే ఉండడం. ఎంత వరకు స్పందించాలో అంతవరకే స్పందించడం. ఎక్కడో ఒకరిద్దరి విషయంలో తప్ప.. బీజేపీ ఎప్పుడూ మిత్రపక్షాల విషయంలోనూ `నమ్మకం` అనేది పెట్టుకోదు. దీనికి కారణం.. ఆయా మిత్రపక్షాలు ఎప్పుడు ఎలాంటి యూటర్న్ తీసుకుంటాయో.. ఎప్పుడు ఎలాంటి పంథా అనుసరిస్తాయో.. తెలియకపోవడం.. పైగా మైనారిటీ ఓటు బ్యాంకు కోసం అర్రులు చాచడమే.
దీంతో బీజేపీ తన మిత్రపక్షాల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తుంది. అయితే.. అందరినీ కలుపుకొని పోయినట్టే కనిపిస్తుంది. కానీ, దీర్ఘకాలికంగా ఎక్కడా అలా కనిపించదు. అందుకే.. కాంగ్రెస్‌తో ఉన్న మిత్రపక్షాలతో పోల్చితే.. బీజేపీతో ఉన్న మిత్ర పక్షాలకు చాలాతక్కువ లైఫ్ ఉంటుంది. పైగా.. బీజేపీని కూడా చాలా ప్రాంతీయ పార్టీలు విశ్వసించవు. ఎందుకంటే.. ప్రాంతీయ పార్టీల మాటున తమ ఓటు బ్యాంకు పెంచుకునేందుకు కమల నాథులు ప్రయత్నించడమే.. వాదన ఉండడమే.
కానీ, ఈ రెండు వాదాలకు భిన్నంగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు, బీజేపీకి మధ్య బాగానే కెమిస్ట్రీ కుదిరిందని అంటున్నారు పరిశీలకులు. బీజేపీ వ్యూహాలకు అనుగుణంగా పవన్ కల్యాణ్ నడుచుకోవడమే కాదు.. అసలు `బీజేపీని మించి` అన్నట్టుగాతన వాయిస్‌ను వినిపిస్తుడడం.. ఇప్పుడు బీజేపీకి కలిసివస్తున్న అంశంగా మారింది. నిజానికి నిన్న మొన్నటి వరకు యూపీ సీఎం యోగి మాత్రం బీజేపీ సైద్ధాంతిక విధానాలపై బలమైన గళం వినిపించేవారు. మిగిలిన వారు అటు ఇటుగా ఉండేవారు.
కానీ, పవన్ విషయంలో బీజేపీ సంస్థాగత నాయకులకు మించిన పవర్ కనిపిస్తోంది. సనాతన ధర్మం పేరుతో ఆయన చేస్తున్న ప్రచారం.. దేశ సరిహద్దులకు వరకు పాకింది. అంతేకాదు.. వక్ఫ్‌బోర్డు ఉన్నట్టు గానే సనాతన ధర్మం కోసం బోర్డు ఉండాలన్నది ఆయన వారాహి డిక్లరేషన్‌లోనే ఉండడం.. బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ ప్రతినిధిపై జరిగిన దాడి, అనంతర పరిణామాలపై ఆయన స్పందించిన తీరు వంటివి బీజేపీకి, ముఖ్యంగా ఆర్ ఎస్ ఎస్‌కు కూడా పవన్‌ను కనెక్ట్ అయ్యేలా చేసిందంటే.. ఆశ్చర్యం వేస్తుంది. అందుకే.. బీజేపీకి పవన్‌కు మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉందని అంటున్నారు పరిశీలకులు.