Begin typing your search above and press return to search.

ఏపీ సీఎంగా పవన్ కళ్యాణ్?!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి హోదాలో చూడాలని జనసైనికులు భావిస్తుంటారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పవర్ షేరింగ్ ఇవ్వాలని కూడా ఎక్కువ మంది కోరుకున్నారు.

By:  Tupaki Desk   |   15 July 2025 10:51 AM IST
ఏపీ సీఎంగా పవన్ కళ్యాణ్?!
X

ఆంధ్రప్రదేశ్‌లో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకోబోతోంది. ఏపీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. మీరు చదివింది నిజమే. అయితే పవన్ కళ్యాణ్ కేవలం నాలుగు రోజుల పాటు మాత్రమే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, అది కూడా ఇంచార్జ్ హోదాలో ఉండనున్నారు. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా సీఎం సింగపూర్ టూర్ కొనసాగనుంది. ఈ పర్యటనలో మంత్రులు నారాయణ, నారా లోకేష్, టీజీ భరత్ ఉంటారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన కీలక అధికారులు సైతం ఈ బృందంతో కలిసి వెళ్తారు. ఈనెల 26 నుంచి 30 వరకు సీఎం బృందం అక్కడ పర్యటించనుంది. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి తిరిగి వచ్చేవరకు ఇంచార్జ్ హోదాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనసాగనున్నారు.

- జనసైనికుల ఆశ అదే

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి హోదాలో చూడాలని జనసైనికులు భావిస్తుంటారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పవర్ షేరింగ్ ఇవ్వాలని కూడా ఎక్కువ మంది కోరుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు సీనియారిటీ, ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా డిప్యూటీ సీఎం హోదాతో సరిపెట్టుకున్నారు. అయితే, జనసైనికుల్లో మాత్రం పవన్ సీఎం కావాలన్న ఆకాంక్ష తగ్గలేదు. పవన్ తో సమానంగా మంత్రి లోకేష్‌కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని టీడీపీ నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. అప్పట్లో జనసైనికులు కూడా పవన్ కళ్యాణ్‌కు సీఎం పోస్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ కూడా జరిగింది. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా స్పందించాల్సి వచ్చింది. పార్టీ శ్రేణులకు కంట్రోల్ చేశారు కూడా. పదవుల విషయంలో బహిరంగంగా మాట్లాడవద్దని ఆదేశించారు. టీడీపీ నాయకత్వం సైతం అప్పట్లో అప్రమత్తమై, తమ పార్టీ శ్రేణులకు అదే తరహా ఆదేశాలు ఇచ్చింది.

-నాలుగు రోజుల పాటు బాధ్యతలు

ప్రస్తుతం కూటమి సమన్వయంతో ముందుకు సాగుతోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య మంచి సంబంధాలే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ తరుణంలోనే భారీగా పెట్టుబడులను ఆహ్వానించాలని భావిస్తోంది. అందుకే ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలోని ఓ బృందం సింగపూర్ వెళ్తోంది. నాలుగు రోజులపాటు వారి పర్యటన కొనసాగనుంది. సీఎం సింగపూర్ వెళ్తున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్‌కు ఇంచార్జి సీఎంగా బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. అయితే, పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న జనసైనికులకు మాత్రం ఈ వార్త ఎంతో ఆనందాన్ని ఇస్తోంది.