పవన్ ఏఐ ఐడియా.. చంద్రబాబును మించిపోయిన డిప్యూటీ సీఎం!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును అనుసరిస్తూ ఆయనను మించిపోయేలా నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో తనదైన ముద్రవేస్తున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.
By: Tupaki Desk | 4 Nov 2025 10:10 PM ISTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును అనుసరిస్తూ ఆయనను మించిపోయేలా నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో తనదైన ముద్రవేస్తున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. చంద్రబాబు నుంచి పాలన మెలకువలు తెలుసుకునేందుకు గతంలో ఎక్కువ సమయం కేటాయించిన పవన్.. ఇప్పుడు పాలనలో సరికొత్త ప్రయోగాలకు దిగుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కువగా వాడే టెక్నాలజీని పవన్ కూడా తన శాఖల్లో సమర్థంగా వినియోగిస్తున్నారు. ప్రధానంగా అడవి ఏనుగుల సమస్య పరిష్కారానికి ఏఐ టెక్నాలజీ వాడాలని పవన్ నిర్ణయించడం, ఆ నిర్ణయంతో దశాబ్దాలుగా వేధిస్తున్న సమస్యకు సులువైన మార్గం కనుగొన్నట్లు అయిందని అంటున్నారు.
ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న పవన్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలతోపాటు అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. స్వతహాగా పర్యావరణ ప్రేమికుడు అయిన పవన్ అటవీ సంరక్షణకు వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇదే సమయంలో అడవులు, ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల సంక్షేమం, భద్రతకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని చిత్తూరు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలకు ప్రాణసంకటంగా మారిన అడవి ఏనుగుల సమస్యకు పవన్ సరికొత్త పరిష్కారం కనుగొన్నారు.
చిత్తూరుతోపాటు పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో గజరాజుల సమస్య కొన్నేళ్లుగా వేధిస్తోంది. సమీప అడవుల నుంచి గ్రామాల్లోకి వస్తున్న ఏనుగులు.. ప్రజల ప్రాణాలను హరించడంతోపాటు వందల ఎకరాల్లో పంటలను నాశనం చేస్తున్నాయి. గుంపులుగా గ్రామాల మీద దాడి చేస్తున్న ఏనుగులను నియంత్రించడం ప్రభుత్వాలకు సవాల్ గా మారింది. ఈ పరిస్థితుల్లో సంబంధిత మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్.. ఎవరూ చేయని విధంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి 4 శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను రాష్ట్రానికి తీసుకువచ్చారు. ఇవి ఏనుగుల గుంపు గ్రామాల మీద దాడికి దిగితే వాటిని తిరిగి అడవుల్లో పంపేందుకు ఉపయోగపడుతున్నాయి. అయితే విస్తారమైన అటవీ ప్రాంతం ఉండగా, నాలుగు ఏనుగులను అటు ఇటు తిప్పడం ఇబ్బందికరంగా మారింది. దీంతో డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు స్మార్టుగా ఆలోచించిన పవన్.. ఏఐ టెక్నాలజీతో ఏనుగులను నియంత్రించే విధానానికి శ్రీకారం చుట్టారు. ఈ టెక్నాలజీ ద్వారా ఏనుగులు గ్రామాల సమీపానికి వస్తే గన్ షాట్ శబ్దాలు చేయడం ద్వారా అవి వెనక్కి తగ్గుతున్నాయి. సోలార్ ప్యానెళ్ల ఆధారంగా పనిచేస్తున్న ఈ ఏఐ టెక్నాలజీ అద్భుతంగా పనిచేస్తోందని ఓ వీడియో ద్వారా వెల్లడైంది. ఓ ఏనుగు పంట పొలాల్లోకి దిగితే, దాని రాకను పసిగట్టిన ఏఐ కెమెరా తుపాకీ శబ్దాలను చేస్తుంది. పేలుడు శబ్దం విన్న ఏనుగు పారిపోతున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఉఫ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వినూత్న ఆలోచన అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అదే సమయంలో గ్రామస్థులు కూడా ఏనుగులు తరిమేందుకు ఈ పద్ధతి బాగుందని అభినందిస్తున్నారు. దీంతో ఈ పద్ధతిని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని పవన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అదేవిధంగా ఈ విధానాన్ని ఇతర రాష్ట్రాలు సైతం అడిగి తెలుసుకుంటున్నాయి. అడవి ఏనుగులతో ఏపీతోపాటు ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి.
