'అడవి బాట'.. వైసీపీ ఓటు బ్యాంకుకు చిల్లు.. !
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సోమవారం(ఏప్రిల్ 7) నుంచి ప్రారంభిస్తున్న వినూత్న కార్యక్రమం `అడవి బాట.`
By: Tupaki Desk | 7 April 2025 3:30 PM ISTజనసేన అధినేత పవన్ కల్యాణ్.. సోమవారం(ఏప్రిల్ 7) నుంచి ప్రారంభిస్తున్న వినూత్న కార్యక్రమం `అడవి బాట.` రాష్ట్రంలోని గిరిజన ప్రాబల్యం ఎక్కువగా ఉన్న తండాలు... ప్రాంతాల్లో.. ఆయన పర్యటిస్తా రు. ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయనున్నారు. రహదారుల నిర్మాణానికి, వంతెనల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టనున్నారు. తద్వారా డోలీ మోతలతో ఇబ్బందులు పడుతున్న సుదూర గిరిజన ప్రాంతాల్లో రహదారులు ఏర్పడనున్నాయి.
అదేసమయంలో గిరిజనులకు అభివృద్ధిని కూడా రుచిచూపించనున్నారు. ఇది ఆహ్వానించదగిన పరిణా మం. ఇప్పటి వరకు కొన్ని దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం కూడా.. పట్టించుకోలేదు. దీంతో గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ అభివృద్ది లేకుండా పోయింది. అయితే.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని గిరిజన ప్రాంతాలను డెవలప్ చేస్తోంది. 2021లో ప్రారంభించిన గిరిజన సమృద్ధి కార్యక్రమం ద్వారా రాష్ట్రాలకు నిధులు ఇస్తోంది. వైసీపీ హయాంలోనూ ఈ నిధులు వచ్చాయి.
కానీ.. అప్పట్లో ఈ నిధులను వేరే కార్యక్రమాలకు వినియోగించారు. ఇప్పుడు కేంద్రం ఇస్తున్న నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం గిరిజన అభివృద్ధికి నడుం బిగించింది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఈ క్రతువును భుజాన వేసుకున్నారు. అయితే.. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. టీడీపీ చేపట్టకుండా.. పవన్ కల్యాణ్ రంగంలోకి దిగడం వెనుక.. కీలకమైన వైసీపీ ఓటు బ్యాంకును ప్రభావితం చేయనున్నారన్న చర్చ తెరమీదికి వచ్చింది.
ఎస్సీ, ఎస్టీలలో వైసీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. 2019లో అన్ని ఎస్టీ నియోజకవర్గాల్లోనూ వైసీపీ విజయం దక్కించుకుంది. ఈ బలమైన ఓటు బ్యాంకు ఇప్పుడు చీల్చడమే లక్ష్యంగా పవన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. తానే స్వయంగా రంగంలోకి దిగడం ద్వారా.. తనకు ఉన్న సినిమా ఇమేజ్‌తోపాటు అభివృద్ధిని కూడా జోడిస్తే.. ఎస్టీలలో వైసీపీపై ఉన్న సానుభూతిని అంతం చేసి.. సదరు ఓటు బ్యాంకును జనసేన వైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారన్న చర్చ అయితే సాగుతోంది. మరి ఏం జరుగుతుందో వైసీపీ దీనిని ఎలా చూస్తుందో చూడాలి.
