పవన్ కల్యాణ్ తాజా ఉపవాసం ఎవరి కోసం? ఎందుకోసం?
తాజాగా.. ఆయన మరో ఉపవాసం చేయనున్నారు. ఈసారి 15 రోజుల పాటు ఉపవాసం చేస్తున్న విషయాన్ని ఆయన వెల్లడించలేదు.
By: Tupaki Desk | 20 Jun 2025 1:09 PM ISTఏపీ డిప్యూటీ సీఎంగా.. ఒక రాజకీయ పార్టీ అధినేతగా వ్యవహరిస్తున్న పవన్ కల్యాణ్.. అధ్యాత్మిక కార్యక్రమాల్లో తరచూ పాల్గొనటం చూస్తున్నదే. ఆయన అప్పుడప్పుడు దీక్షలు చేపట్టటం చేస్తుంటారు. ఇందులో భాగంగా ఉపవాసాలు చేస్తారు. తాజాగా.. ఆయన మరో ఉపవాసం చేయనున్నారు. ఈసారి 15 రోజుల పాటు ఉపవాసం చేస్తున్న విషయాన్ని ఆయన వెల్లడించలేదు. ఆశ్చర్యకరంగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయినార్ నాగేంద్ర వెల్లడించటం విశేషం.
హిందూ మున్నని తరఫు ఈ నెల 22న మదురైలో మురుగన్ భక్తుల మహానాడు జరగనుందని.. అందులో ముఖ్య అతిధిగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొననున్నట్లు నయినార్ నాగేంద్రన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి పవన్ కల్యాణ్ 15 రోజుల పాటు ఉపవాసం ఉంటున్నట్లుగా ఆయన చెప్పారు. పవన్ కల్యాణ్ మురుగన్ భక్తుడని.. ఇప్పటికే ఆయన ఆరు మురుగన్ పుణ్యక్షేత్రాల్ని సందర్శించిన విషయాన్ని ప్రస్తావించారు.
పవన్ కల్యాణ్ తో పాటు.. తామంతా కూడా పదిహేను రోజులుగా ఉపవాసం ఉంటున్నట్లుగా నాగేంద్రన్ చెప్పటం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా.. హిందూ మున్నని ఏర్పాటు చేస్తున్న మురుగన్ భక్తుల మహానాడు తమిళనాడులో రాజకీయ రచ్చగా మారింది. భక్తి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తుందని అధికార డీఎంకే మండిపడుతుండగా.. తాము నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్టాలిన్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటుందని బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు.
ఈ కార్యక్రమానికి అనుమతులు ఇవ్వాలంటూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించగా.. ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వటంతో పాటు.. తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏడాది వ్యవధిలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే.. బీజేపీ.. విజయ్ పార్టీ కలిసి పోటీ చేసేందుకు వీలుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ కాంబినేషన్ లో అయితే అధికారం పక్కా అని భావిస్తున్నారు.
తమిళులకు ప్రతి ఎన్నికల్లోనూ అధికారపక్షాన్ని ఓడించి.. విపక్షానికి అధికారాన్ని ఇవ్వటం అలవాటు. జయలలిత హయాంలో ఒకసారి.. అతి కొద్ది సందర్భాల్లో తప్పించి.. మిగిలిన సందర్భాల్లోనే ఇలాంటి తీరునే ప్రదర్శించారు తమిళనాడు ఓటర్లు. మత కార్యక్రమాల్ని తాము నిర్వహిస్తున్నట్లుగా డీఎంకే చేస్తున్న ఆరోపణల్ని బీజేపీ తిప్పి కొడుతోంది. గత ఏడాది మధురై వేదికగా తమిళనాడు ప్రభుత్వం మురుగన్ తిరువిళా పేరుతో నిర్వహించిన కార్యక్రమం సంగతి ఏమిటి? అని ప్రశ్నిస్తోంది.
మురుగన్ (కుమారస్వామి)కు తమిళనాడు ప్రజలు ఎంతటి అభిమానాన్ని ప్రదర్శిస్తారో తెలిసిందే. గత ఏడాది డీఎంకే ప్రభుత్వం నిర్వహించిన మురుగన్ తిరువిళా (కుమారస్వామి తిరునాళ్లు) కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున సానుకూల స్పందన లభించింది. హేతువాద సిద్ధాంతాలకు పెట్టింది పేరు అయిన డీఎంకేనే మురుగన్ తిరువిళా కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు.. ఈసారి తాము నిర్వహిస్తున్న కార్యక్రమానికి అనుమతులు ఇవ్వకుండా స్టాలిన్ ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటుందని ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ఏడాది కంటే తక్కువ వ్యవధికి వచ్చిన వేళలో చేపడుతున్న ఈ కార్యక్రమం రాజకీయ రగడకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. మురుగన్ భక్తుల మహానాడు పేరుతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుబ్రహ్మణ్యస్వామి భక్తులందరిని ఒకే వేదిక మీదకు తీసుకొచ్చే కార్యక్రమంలో పవన్ కల్యాణ్ హైలెట్ కావటం మరో ఆసక్తికర పరిణామంగా మారిందని చెప్పక తప్పదు.
