Begin typing your search above and press return to search.

పవన్ యాక్షన్ ప్లాన్.. సొంత నియోజకవర్గం నుంచే మార్పు మొదలు

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. తన నియోజకవర్గం పరిధిలోని ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై రూపొందించిన 100 రోజుల ప్రణాళికను అమలు చేసేందుకు రోడ్ మ్యాప్ రెడీ చేశారు

By:  Tupaki Desk   |   22 Nov 2025 9:22 AM IST
పవన్ యాక్షన్ ప్లాన్.. సొంత నియోజకవర్గం నుంచే మార్పు మొదలు
X

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. తన నియోజకవర్గం పరిధిలోని ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై రూపొందించిన 100 రోజుల ప్రణాళికను అమలు చేసేందుకు రోడ్ మ్యాప్ రెడీ చేశారు. తీర ప్రాంతంలో అంతరించిపోతున్న మత్స్య సంపదను రక్షించడంతోపాటు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల కల్పనపైనా దృష్టి సారించినట్లు పవన్ వెల్లడించారు. విశాఖ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, మత్స్య శాఖ సూచనల మేరకు రూపొందించిన ప్రత్యేక ప్రణాళికలను అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పవన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కోస్టల్ రీజైలెన్స్ పథకం ద్వారా ఉప్పాడ తీర ప్రాంత రక్షణకు రూ.2 కోట్లతో ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పవన్ వివరించారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా పవన్ లేఖ రాశారు.

100 రోజుల ప్రణాళక అమలులో భాగంగా మత్స్య సంపద పెంపొందించడం, వేట నైపుణ్యాన్ని పెంచడం, ప్రత్యేక రీఫ్ ల ఏర్పాటు, ప్రత్యామ్నయ ఆదాయ వనరుల సృష్టి తదితర అంశాలపై మత్స్యకారులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. మన మత్స్యకారులను తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు తీసుకువెళ్లి అక్కడ విజయవంతమైన కృత్రిమ రీఫ్ కల్చర్, కోస్టల్ టూరిజం యూనిట్ల సందర్శనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

సంప్రదాయ వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకారుల సమస్య పరిష్కారంపై దృష్టి సారించామని, రాష్ట్ర చరిత్రలో తొలిసారి సముద్రంలో చేపల సంఖ్యను పెంపొందించే చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

ఉప్పాడ, కాకినాడ తీర ప్రాంతాల్లో 50 వేల పండుగప్ప పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టామని, భవిష్యత్తులో ఉప్పు నీటిలో పెరిగే టైగర్ రొయ్య పిల్లలను కూడా తీర ప్రాంతాల్లో విడిచిపెట్టే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. తీర ప్రాంత మత్స్యకారులు ఇప్పటి వరకు 12 నాటికల్ మైళ్ల దూరం వరకు మాత్రమే వేటాడే అవకాశం ఉందని, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ పరిధిని 200 నాటికల్ మైళ్ల వరకు విస్తరించిందని పవన్ వెల్లడించారు. డీప్ సీ ఫిషింగ్ ద్వారా మత్స్యకార సోదరులు మంచి ధర లభించే టూనా చేపలను పట్టుకునేందుకు వీలు కలుగుతుందని పవన్ తెలిపారు.

కోనపాపపేటలో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం

ఉప్పాడ తీర ప్రాంత అభివృద్ధికి చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగా కోస్టల్ రీజైలెన్స్ స్కీమ్ కింద కోనపాపపేటకు రూ. 2 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో తుపాను లాంటి విపత్తుల నుంచి తీర ప్రాంత గ్రామాల ప్రజలకు రక్షణ కల్పించేందుకు వీలుగా మల్టీపర్పస్ కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నారు. ఈ కమ్యూనిటీ హాళ్లలో ఆర్.ఒ. వాటర్ ప్లాంట్లు, చేపలు ఎండబెట్టుకునేందుకు వీలుగా మూడు ఫిష్ డ్రైయింగ్ ఫ్లాట్ ఫామ్స్ నిర్మిస్తున్నారు. వేటకు వెళ్లిన మత్స్యకారులను సముద్రంలో ట్రాక్ చేసేందుకు వీలుగా జీపీఎస్ సిస్టం, మత్స్య సంపదను నిల్వ చేసుకునేందుకు ఐస్ బాక్సులు ఏర్పాటు చేయబోతున్నామని పవన్ వెల్లడించారు.

తీర ప్రాంతంలో టూరిజం హాట్ స్పాట్లు

తీర ప్రాంత మత్స్యకారులకు వేటతోపాటు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపైనా దృష్టి సారించినట్లు పవన్ తెలిపారు. మత్స్యకారుల్లోని అద్భుతమైన ఈత సామర్థ్యాన్ని వినియోగించుకుంటూ కేరళ తరహాలో తీర ప్రాంత పర్యటక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. స్పీడ్ బోటింగ్, స్కూబా డైవింగ్ తదితర జల క్రీడల్లో మత్స్యకార యువతకు శిక్షణ ఇప్పించడం ద్వారా మన రాష్ట్ర తీర ప్రాంతాలను టూరిజం హాట్ స్పాట్లుగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. కాకినాడ తీర ప్రాంతం నుంచి కొంత మంది మత్స్యకారులను కేరళ తీసుకువెళ్లి అక్కడ మత్స్యకారులు నిర్వహిస్తున్న ఎకో టూరిజం స్పాట్ల వద్ద శిక్షణ ఇప్పించనున్నట్లు తెలిపారు. చెన్నై హార్బర్ సమీపంలోని తిరువత్రియుర్ కుప్పం తీరంతో విజయవంతంగా నిర్వహిస్తున్న కృత్రిమ రీఫ్ కల్చర్ సందర్శనకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.