జగన్ మీద మళ్ళీ అలాగే పవన్...!
తెలంగాణాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో సాత్వికంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఏపీకి రాగానే ఫుల్ ఎమోషనల్ అయిపోయారు.
By: Tupaki Desk | 2 Dec 2023 3:34 AMతెలంగాణాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో సాత్వికంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఏపీకి రాగానే ఫుల్ ఎమోషనల్ అయిపోయారు. మంగళగిరి పార్టీ ఆఫీసులో ఆయన క్యాడర్ తో మాట్లాడుతూ జగన్ మీద ఫైర్ అయ్యారు. జగన్ ప్రజా కంటకుడు అంటూ నిప్పులే చెరిగారు. ఆయనలో విషం ఉందని కూడా మండిపడారు. జగన్ని పదేళ్ల పాటు రాజకీయాల్లోకి రానీయకుండా బహిష్కరిద్దామని కూడా క్యాడర్ కి పిలుపు ఇచ్చారు.
ఈ రోజు నుంచి సరిగ్గా వంద రోజుల వ్యవధిలో ఏపీలో ఎన్నికలు జరుగుతాయి. రోజుకు 0.5 శాతం వంతున వైసీపీ ఓటు బ్యాంక్ ని తగ్గిస్తే వైసీపీకి ఉన్న 50 శాతం ఓటు బ్యాంక్ పూర్తిగా పోతుందని రాజకీయ గణితాన్ని కూడా క్యాడర్ కి పాఠంగా పవన్ చెప్పారు. జగన్ పదే పదే ఇది కురుషేత్ర యుద్ధం అంటున్నరని ఆయన ఏమైనా అర్జునుడా లేక శ్రీ క్రిష్ణుడా అని పవన్ ప్రశ్నించారు.
జగన్ లక్ష కోట్లు దోచుకున్న వ్యక్తి అని కురుక్షేత్రం గురించి జగన్ లాంటి వారు మాట్లాడకూడదని పవన్ అంటున్నారు. వైసీపీకి ఒక సిద్ధాంతం లేదని జగన్ని సీఎం చేయడమే ఆ పార్టీ విధానం అని అందుకే వారి క్యాడర్ పని చేస్తోందని కూడా పవన్ ఎత్తి పొడిచారు.
జగన్ మహాత్ముడు కాడు మహనీయుడు అంతకంటే కాదు, వాజ్ పేయ్ కానే కాదని అన్నారు. ఏపీలో వైసీపీని తరిమికొట్టడానికే తాను టీడీపీతో పొత్తు పెట్టుకున్నాను అని మరో మారు పవన్ చెప్పుకున్నారు. తాను టీడీపీ వెనక నడవడం లేదని టీడీపీతో కలసి నడుస్తున్నామని అన్నారు.
జనసేన నుంచి కొందరు బయటకు వెళ్ళి వైసీపీలో చేరారు అని వారంతా జనసేనను విమర్శిస్తున్నారు అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి రోజున జనసేన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి తప్పకుండా వస్తుంది అపుడు వారు ముఖం ఎక్కడ పెట్టుకుంటారు అని పవన్ ప్రశ్నించారు. పార్టీలో ఉంటూ పార్టీ విధానాలను ఎవరు ప్రశ్నించినా సహించేది లేదని పవన్ స్పష్టం చేశారు.
వారంతా వైసీపీ కో వర్టులుగా భావిస్తామని కూడా హెచ్చరించారు. పార్టీ విధానాలను ప్రతీ ఒక్కరూ అనుసరించాలని అమలు చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన పాటు పడుతోందని పవన్ అంటున్నారు. తన వెనక ఎలాంటి నిధులు లేవని కేవలం 150 మందితో ఏర్పాటు చేసిన జనసేన ఈ రోజు లక్షలమంది సభ్యులతో బలోపేతం అయింది అంటే చిత్తశుద్ధితో చేసే రాజకీయాల వల్లనే అని పవన్ అన్నారు.
నాదెండ్ల మనోహర్ వంటి వారు పార్టీ కోసం అండగా నిలబడ్డారని ఇలాంటి వారు చాలు అని పవన్ అన్నారు. బీజేపీ కూడా కేవలం రెండు సీట్ల నుంచే ఇంతటి స్థాయికి ఎదిగిందని జనసేనకు మంచి భవిష్యత్తు ఉందని ఆయన అన్నారు. మొత్తానికి జగన్ మీద గట్టిగానే పవన్ సౌండ్ చేశారు.
దాని కంటే ముందు ఆయన తెలంగాణా ఎన్నికల సభలలోనూ జగన్ ప్రస్తావన తెచ్చారు. జగన్ మీద గట్టిగా మాట్లాడే పవన్ అదే లెవెల్ లో కేసీయార్ మీద విమర్శలు చేస్తే మంచి ఊపు జనసేనకు వచ్చేదని కానీ అక్కడ మాత్రం కాంగ్రెస్ బీయారెస్ ల మీద పెద్దగా విమర్శలే లేవని కూడా కామెంట్స్ వచ్చాయి. ఏది ఏమైనా ఏపీలో మంగళగిరిలో మాత్రం అసలైన పవన్ కళ్యాణ్ ఆవేశపూరితమైన స్పీచ్ లతో మళ్లీ మళ్లీ జగన్ మీదనే విరుచుకుపడుతూ అలరించారు అని అంటున్నారు.