Begin typing your search above and press return to search.

ట్రంప్ దేవుడైపోయాడు.. నీ అభిమానం మామూలుగా లేదుగా..

అయితే తాజాగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి ప్రముఖ పాస్టర్ పౌలా వైట్-కెయిన్ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చను మరో స్థాయికి తీసుకెళ్లాయి.

By:  A.N.Kumar   |   2 April 2026 12:08 PM IST
ట్రంప్ దేవుడైపోయాడు.. నీ అభిమానం మామూలుగా లేదుగా..
X

అమెరికా రాజకీయాల్లో మతం, రాజకీయాల కలయిక ఎప్పుడూ ఒక సున్నితమైన అంశమే. అయితే తాజాగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి ప్రముఖ పాస్టర్ పౌలా వైట్-కెయిన్ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చను మరో స్థాయికి తీసుకెళ్లాయి. వైట్ హౌస్‌లో జరిగిన ఈస్టర్ విందు వేదికగా ఆమె చేసిన ప్రసంగం ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా పెను సంచలనానికి, వివాదానికి దారితీసింది.

వివాదానికి నేపథ్యం.. ట్రంప్ vs ఏసుక్రీస్తు

పాస్టర్ పౌలా వైట్-కెయిన్ తన ప్రసంగంలో ట్రంప్‌ను నేరుగా ఏసుక్రీస్తుతో పోల్చడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనేక న్యాయపరమైన చిక్కులు, రాజకీయ ప్రత్యర్థుల నుండి వస్తున్న విమర్శలు.. మీడియా దాడులను ఆమె ప్రస్తావించారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ "నిజం కోసం నిలబడే నాయకులు ఎప్పుడూ కఠిన పరీక్షలను ఎదుర్కొంటారు. ఏసుక్రీస్తు తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు.. శిలువ వేయబడిన సందర్భానికి ట్రంప్ ప్రస్తుత పరిస్థితి దగ్గరగా ఉంది" అని పేర్కొన్నారు. ట్రంప్ పడుతున్న ఇబ్బందులను ఒక రకమైన "దైవిక త్యాగం"గా ఆమె చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఆయనపై వస్తున్న ఆరోపణలు కేవలం రాజకీయమైనవి కావని.. అవి ఆయన నాయకత్వాన్ని అణచివేయడానికి జరుగుతున్న కుట్రలని ఆమె అభివర్ణించారు.

మత పెద్దల ఆగ్రహం: "ఇది మత దూషణే"

ఈ వ్యాఖ్యలు వెలువడిన వెంటనే అమెరికాలోని క్రైస్తవ మత సంస్థలు.. వివిధ స్వచ్ఛంద సంస్థలు భగ్గుమన్నాయి. ఏసుక్రీస్తు పవిత్రతను, ఆధ్యాత్మికతను కేవలం ఓట్లు , అధికారమే పరమావధిగా భావించే రాజకీయ నాయకులతో పోల్చడం అపచారమని అనేకమంది మత గురువులు అభిప్రాయపడ్డారు. క్రీస్తు చూపిన మార్గం త్యాగం, ప్రేమతో కూడుకున్నదని, రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని అడ్డం పెట్టుకోవడం ప్రమాదకరమని వారు హెచ్చరించారు. "రాజకీయ నాయకులు ఎవరూ దేవుడితో సమానం కాదని, ఇటువంటి పోలికలు సామాన్య భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని" ప్రముఖ థియాలజియన్లు స్పష్టం చేశారు.

మద్దతుదారుల వాదన.. ఇది నాయకత్వ పటిమకు నిదర్శనం

మరోవైపు డొనాల్డ్ ట్రంప్ అనుచరులు, రిపబ్లికన్ పార్టీలోని ఒక వర్గం పౌలా వైట్ వ్యాఖ్యలను సమర్థిస్తోంది. ట్రంప్ అమెరికా ప్రజల కోసం తన వ్యక్తిగత జీవితాన్ని, సంపదను పణంగా పెట్టి పోరాడుతున్నారని వారు భావిస్తున్నారు. వ్యవస్థ మొత్తం ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు ఆయన చూపిస్తున్న తెగువ అసాధారణమైనదని, అందుకే ఆయనను ఒక దైవదూత వంటి నాయకుడిగా చూడటంలో తప్పులేదని వారు వాదిస్తున్నారు.

ఓటు బ్యాంకు వ్యూహమా?

రాజకీయ విశ్లేషకుల ప్రకారం.. ఈ వ్యాఖ్యల వెనుక లోతైన రాజకీయ వ్యూహం ఉంది. 2026 ఎన్నికల దిశగా అమెరికా అడుగులు వేస్తున్న తరుణంలో సంప్రదాయ క్రైస్తవ ఓటర్లను ఏకం చేయడం ట్రంప్‌కు చాలా అవసరం. మతాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం ద్వారా ఓటర్లలో ఒక బలమైన భావోద్వేగ అనుబంధాన్ని ఏర్పరచవచ్చు. తనను తాను ఒక బాధితుడిగా చిత్రీకరించుకోవడం ద్వారా సానుభూతిని పొందడం ట్రంప్ వ్యూహాల్లో ఒకటి.

మొత్తానికి పౌలా వైట్-కెయిన్ చేసిన ఈ వ్యాఖ్యలు అమెరికా సమాజంలో మతపరమైన విభజనను మరింత పెంచేలా ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో నాయకులను విమర్శించే హక్కు అందరికీ ఉంటుంది.. కానీ ఆ విమర్శలను లేదా మద్దతును దైవత్వంతో పోల్చడం అనేది నైతికంగా ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ వివాదం కేవలం ఒక వార్తగానే మిగిలిపోకుండా రాబోయే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అంశంగా మారుతుందనడంలో సందేహం లేదు. అమెరికా రాజకీయ యవనికపై ఈ "మత-రాజకీయ" డ్రామా ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.