Begin typing your search above and press return to search.

కొత్త రూల్స్.. దురుసుగా ప్రవర్తించే రోగికి వైద్యం నిరాకరించొచ్చు

రోగి-వైద్యుడు లేదా వైద్య సిబ్బంది, రోగి బంధువులు-వైద్యులు-ఆస్పత్రి వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తుతుంటాయి

By:  Tupaki Desk   |   11 Aug 2023 11:01 AM GMT
కొత్త రూల్స్.. దురుసుగా ప్రవర్తించే రోగికి వైద్యం నిరాకరించొచ్చు
X

ఆస్ప్రత్రుల్లో కొన్నిసార్లు అనూహ్య ఘటనలు జరుగుతుంటాయి. రోగి-వైద్యుడు లేదా వైద్య సిబ్బంది, రోగి బంధువులు-వైద్యులు-ఆస్పత్రి వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తుతుంటాయి. ఈ క్రమంలో ఆస్పత్రిపై దాడి, వైద్య సిబ్బందితో దురుసుగా వ్యవహరించిన ఉదంతాలు వెలుగు చూస్తుంటాయి. వాస్తవానికి ఇది సున్నితమైన సమస్య. ఎటువైపు న్యాయం ఉందో చెప్పలేని పరిస్థితి అది. అత్యంత సున్నితంగా వ్యవహరించాల్సిన సమయాల్లో విచక్షణ కోల్పోతే తదుపరి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇలాంటి వాటిని నివారించేందుకే జాతీయ వైద్య సంఘం రిజిస్టర్డ్ మెడికల్‌ ప్రాక్టిషనర్స్‌ (ఎన్‌ఎంసీఆర్‌ ఎంపీ) నిబంధనలను అమల్లోకి తెస్తున్నారు. జాతీయ వైద్య మండలి ఆ నిబంధనలను తాజాగా తెలిపింది. వీటిని గతంలోనే ప్రతిపాదించారు.

వైద్యులపై దాడి చేశారో..?

వైద్య వర్గాలపై దాడులను నిరోధించడమే లక్ష్యంగా తీసుకొచ్చినవే నేషనల్ మెడికల్ కమిషన్ రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టిషనర్స్‌ నిబంధనలు. వీటి ప్రకారం వైద్యులతో అనుచితంగా ప్రవర్తించే రోగులకు చికిత్స చేసేది లేదని చెప్పవచ్చు. కాగా, ఇప్పటికే కోడ్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎథిక్స్‌ పేరటి 2002లో తీసుకొచ్చిన నిబంధనలు ఉన్నాయి. వాటి స్థానంలోనే ఎన్‌ ఎంసీఆర్‌ ఎంపీని ప్రవేశపెట్టనున్నారు.

వైద్యం, ఫీజు గురించి చెప్పాలి..

రోగికి అందించే వైద్యం, ఫీజు వివరాలను వైద్యుడు రోగికి చెప్పాలి. చికిత్సకు ముందే రోగికి కన్సల్టేషన్‌ / చికిత్స ఫీజు గురించి తప్పక చెప్పాలి. అయితే, ఆ ప్రకారం ఫీజు చెల్లించకుంటే వైద్యుడు చికిత్స నిరాకరించొచ్చు. అత్యవసర సేవల విషయంలో మాత్రం ఈ నిబంధన వర్తించదు.

రికార్డుల్లో రాసి.. పంపేయొచ్చు

వైద్యం అందిస్తున్న క్రమంలో రోగి లేదా వారి బంధువులు దురుసుగా, హింసాత్మకంగా వ్యవహరిస్తే.. దాని గురించి రికార్డులో రాసి.. మిగతా చికిత్స వేరేచోట చేయించుకునేలా వైద్యులు చెప్పవచ్చు. మరో మెలిక ఏమంటే.. ప్రాణాపాయ పరిస్థితులు మినహా ఎవరికి చికిత్స అందించాలనేది పూర్తిగా వైద్యుల నిర్ణయమే. ఇందులోనూ రోగికి వైద్యం ప్రారంభించిన తర్వాత, వారి బంధువులకు సమాచారం అందించకుండా వైద్యుడు చికిత్స నిరాకరించకూడదు. చికిత్స చేస్తున్న వైద్యుడితో పాటు మరో వైద్యుడి అవసరం ఉంటే.. రోగి, అతడి కుటుంబ సభ్యులకు తప్పకుండా చెప్పాలి.

ఫార్మా సంస్థల బహుమతులు తీసుకోవద్దు..

వైద్య వర్గాలపై ఉన్న మరో ప్రధాన ఆరోపణ ఏమంటే ఫార్మా సంస్థల నుంచి బహుమతులు పొందుతూ ఔషధాలు రాసేటప్పుడు వాటికి అనుకూలంగా వ్యవహరిస్తారని. వారి విదేశీ పర్యటనలకు సైతం ఫార్మా సంస్థలు సాయం చేస్తాయనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఫార్మా సంస్థల నుంచి వైద్యులు బహమతులు కాదు కదా..? ప్రయాణ సౌకర్యాలు కూడా పొందకూడదని పేర్కొంది. అసలు ఫార్మా సంస్థలు నిర్వహించే విద్యా సంస్థల్లో వర్క్ షాప్ లు, సదస్సులకు హాజరుకాకూడదని స్పష్టం చేసింది.