Begin typing your search above and press return to search.

పాతపట్నం టీడీపీలో కొత్త ముసలం...!

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఇప్పటిదాకా రెండు సార్లు వైసీపీ గెలిచింది. ఆ పార్టీ నుంచి 2014లో కలమట వెంకట రమణమూర్తి గెలిచారు.

By:  Tupaki Desk   |   9 Jan 2024 3:44 AM GMT
పాతపట్నం టీడీపీలో కొత్త ముసలం...!
X

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఇప్పటిదాకా రెండు సార్లు వైసీపీ గెలిచింది. ఆ పార్టీ నుంచి 2014లో కలమట వెంకట రమణమూర్తి గెలిచారు. మూడేళ్ల తరువాత ఆయన పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారు. ఆయన తండ్రి కలమట మోహనరావు టీడీపీ నుంచి అనేక సార్లు గెలిచారు. అలా కలమట ఫ్యామిలీ తిరిగి సైకిలెక్కేసింది. ఆ మీదట 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి కలమట వెంకట రమణమూర్తి పోటీ చేస్తే ఓటమి

పాలు అయ్యారు.

వైసీపీ నుంచి రెడ్డి శాంతి ఆ ఎన్నికల్లో గెలిచారు. ఇక వైసీపీలో ఆమె గెలిచాక ఎక్కువగా లోకల్ గా ఉండకపోవడంతో పాటు పార్టీలో వర్గ పోరు వల్ల వైసీపీ ఒక వైపు ఇబ్బంది పడుతోంది. 2024లో కొత్త ముఖానికి టికెట్ ఇవ్వాలని వైసీపీ ఆలోచిస్తోంది. ఎందుకంటే వైసీపీకి పాతపట్నం కంచుకోట. అభ్యర్థులు ఎవరైనా 2014, 2019లలో ఆ పార్టీ వరస విజయాలు సాధించడమే దీనికి ఉదాహరణ.

ఇక తెలుగుదేశం పార్టీ విషయం తీసుకుంటే ఆ పార్టీ నుంచి మరోసారి పోటీకి కలమట వెంకట రమణ మూర్తి రెడీ అవుతున్నారు. అయితే ఆయనకు పోటీగా టీడీపీ నుంచి మరో బలమైన సామాజిక వర్గానికి చెందిన మామిడి గోవిందరావు రెడీ అయ్యారు. ఆయన కూడా అంగబలం అర్ధంబలం కలిగిన వారు. పైగా నియోజకవర్గానికి కొత్త ఫేస్ గా ఉంటున్నారు.

ఆయన తనకు టికెట్ ఖాయమని ప్రచారం చేసుకుంటున్నారు. ఇక ఆయన్ని మొదట్లో టీడీపీ జిల్లా నాయకత్వం ప్రోత్సహించింది అని అంటారు. ఇపుడు ఆయన నేరుగా చంద్రబాబు లోకేష్ లను కలసి తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారని అంటున్నారు అయితే కలమట వెంకటరమణ కుటుంబం పాతుకుపోయింది కాబట్టి మరోసారి వారికే టికెట్ అని ఆయన అనుచర వర్గం ధీమాగా ఉంది.

ఇక కలమటకు టికెట్ ఇస్తే ఎవరో కాదు తామే పోటీకి దిగి ఓడిస్తామని అని మామిడి గోవిందరావు వర్గీయులు చేస్తున్న ప్రచారంతో పసుపు పార్టీలో అలజడి రేగుతోంది. అసలే వైసీపీకి కంచుకోట లాంటి సీటు. పైగా గత రెండు సార్లూ ఓటమి ఎదురైంది. ఇపుడు ఇద్దరు బలమైన నేతల మధ్య పోటీ ఉంది. ఎవరికి టికెట్ నో చెప్పినా పార్టీలో ఇబ్బందులు తప్పవని అంటున్నారు

దాంతో ఎవరినీ కాదనలేక టీడీపీ ఆలోచనలో ఉందని అంటున్నారు. ఇక మామిడి గోవిందరావు కి టికెట్ ఇవ్వకపోతే ఏం చేస్తారు అన్న చర్చ కూడా టీడీపీ లో నడుస్తోంది. ఏది ఏమైనా పాతపట్నం టీడీపీ పదేళ్ల పాటు గెలుపునకు దూరంగా ఉంది. ఈసారి కూడా ఓడిపోతే ఇక ఈ నియోజకవర్గం వైసీపీకి రాసిచ్చేయవచ్చు అన్న మాట కూడా ఉంది. మరి ఈ వర్గ విభేదాలను ఎలా చక్కబెడతారో చూడాల్సి ఉంది.