పాస్టర్ ప్రవీణ్ కుమార్: ఆ 3 గంటలు ఎక్కడో తేలింది
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ మరణంపై పలు అనుమానాలు.. సందేహాలు వ్యక్తం కావటం తెలిసిందే.
By: Tupaki Desk | 31 March 2025 11:16 AM ISTరెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ మరణంపై పలు అనుమానాలు.. సందేహాలు వ్యక్తం కావటం తెలిసిందే. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వెళ్లే క్రమంలో విజయవాడలో మూడు గంటల పాటు ఉండటం.. ఎక్కడ ఉన్నారన్న విషయంపై స్పష్టత లోపించటం తెలిసిందే. హైదరాబాద్ లో మార్చి 24న బైక్ మీద బయలుదేరిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ విజయవాడ మీదుగా రాజమహేంద్రవరం వెళ్లారు. అనంతరం ఆయన మరణించటం తెలిసిందే. ఈ మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటికి తోడు ఆయన బైక్ దెబ్బ తిని ఉండటం.. కొన్ని గాయాలతో ఉండటం లాంటివి మరిన్ని సందేహాలకు గురయ్యేలా చేశాయి.
దీంతో అసలేం జరిగింది? ప్రవీణ్ మరణానికి కారణం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేస్తున్నారు ఏపీ పోలీసులు. అయితే.. విజయవాడకు చేరుకున్న ప్రవీణ్ కుమార్ దాదాపు మూడు గంటల పాటు ఎక్కడ ఉన్నారు? ఏం చేశారు? రాజమహేంద్రవరం వెళ్లటానికి ముందు జరిగిన పరిణామాల మీదనే ఫోకస్ చేశారు. ఈ క్రమంలో వందలాది సీసీ కెమేరాల్ని జల్లెడ వేశారు.
ఈ క్రమంలో పలు కీలక అంశాల్ని పోలీసులు గుర్తించారు. తన టూవీలర్ ను విజయవాడలోని రామవరప్పాడు రింగ్ కు 50 మీటర్ల ముందుగా నేషనల్ హైవేపై ఆపి.. పక్కన కూర్చున్న విషయాన్ని గుర్తించారు. విజయవాడకు సాయంత్రం ఐదు గంటలకే చేరుకున్న ఆయన రాత్రి 8.45 గంటలకు ఎనికేపాడు దాటినట్లుగా సీసీ కెమెరాల్లో నమోదైంది. ఈ క్రమంలో మూడు గంటలు ఎక్కడ? అన్న అంశాన్ని లెక్క తేల్చారు. అంతేకాదు.. విజయవాడలోకి ఎంట్రీ ఇవ్వటానికి ముందే గొల్లపూడి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన ఫుటేజ్ ప్రకారం బుల్లెట్ బైక్ పాక్షికంగా దెబ్బ తిన్న విషయాన్ని గుర్తించారు. అంతేకాదు.. 24 సాయంత్రం 4.45 గంటలకు విజయవాడ శివారు గొల్లపూడిలో పెట్రోల్ బంకుకు చేరుకొని.. అక్కడ పెట్రోల్ పోయించుకొని ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించిన విషయాన్ని గుర్తించారు.
పెట్రోల్ పోయించుకున్న అనంతరం కనకదుర్గ పై వంతెన.. వారధి మీదుగా బెంజ్ సర్కిల్ చేరుకున్నట్లుగా గుర్తించారు. సాయంత్రం 5.20 గంటల వేళలో రామవరప్పాడు రింగ్ కు కొద్ది దూరంలో బైక్ ఆపి కూర్చున్న ఆయనకు.. స్థానిక ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు తాగునీరు ఇచ్చి.. పక్కనున్న పార్కులో కూర్చోబెట్టారు. తాను హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వెళుతున్నానని ఎస్ఐకు ప్రవీణ్ చెప్పారు.
అయితే.. బైక్ హెడ్ లైట్ దెబ్బ తిని ఉండటంతో అప్పటికే బైక్ ఎక్కడో ప్రమాదానికి గురైనట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ ఫోటోను తీసుకున్నారు. సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు అక్కడి పార్కులోనే విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత ఎస్ఐ టీ తెప్పించి ఇచ్చారు. ఆ తర్వాత తన బైక్ మీద రామవరప్పాడు రింగ్ మీదుగా వెళ్లిపోయినట్లు గుర్తించారు. తాజాగా సేకరించిన సమాచారంతో విజయవాడలో మూడు గంటలు ఏం చేశారన్న మిస్టరీ వీడిపోయినట్లుగా చెప్పాలి.
