పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై రచ్చ వెనుక జాన్ బెన్ని లింగం?
ఇలాంటివేళే.. అసలు ఈ తరహా భావోద్వేగం వెనుక ఉన్నదెవరు? అన్న ప్రశ్న తలెత్తింది.
By: Tupaki Desk | 5 April 2025 5:00 PM ISTఅనూహ్య పరిణామం చోటు చేసుకోవటం.. దానికి సంబంధించి భిన్నమైన వాదన తెర మీదకు రావటం.. చూస్తుండగానే పెను సంచలనం అయిపోవటం.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యేలా చేయటం లాంటివి జరుగుతుంటాయి కొన్ని ప్రభుత్వాల్లో. చంద్రబాబు నేత్రత్వంలోని కూటమి సర్కారు ఏపీలో ఉన్న వేళ.. ఈ తరహాలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం రచ్చకు కారణమైంది. ఆయన మరణంపై నిజనిజాలు ఏమిటన్న విషయంలో పోలీసులు విచారించి..వివరాలు వెల్లడించటానికి ముందే కొన్ని వాదనలు.. సందేహాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో జెట్ స్పీడ్ తో వ్యాపించాయి.
దీంతో ఉక్కిరిబిక్కిరి అయిన ఏపీ పోలీసులు తేరుకొని.. అసలేం జరిగిందన్న దానిపై వేలాది సీసీ కెమేరాల్ని వడపోసి.. అసలు వాస్తవం ఇదన్న మాటను సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా చెప్పిన తర్వాతే విషయం ఒక కొలిక్కి వచ్చింది. ఆయన మరణం.. ఆయన చేతులారా చేసుకున్నదే తప్పించి.. కుట్ర కోణం అసలే లేదన్న విషయం స్పష్టమైంది. దీంతో అప్పటివరకు రగిలిన ఒక వర్గం ఆగ్రహం పాల పొంగులా చల్లారింది.
ఇలాంటివేళే.. అసలు ఈ తరహా భావోద్వేగం వెనుక ఉన్నదెవరు? అన్న ప్రశ్న తలెత్తింది. దీనికి సంబంధించి లోతుల్లోకి వెళితే వస్తున్న పేరు వైసీపీ నేత.. ఆ పార్టీ క్రైస్తవ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పని చేసిన జాన్ బెన్ని లింగం అన్న విషయం తెర మీదకు వచ్చింది. ప్రవీణ్ డెడ్ బాడీకి రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం జరుగుతున్న సమయంలో బెన్ని లింగం అక్కడకు చేరుకొని విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడిన వైనాన్ని గుర్తించారు.
పాస్టర్ ప్రవీణ్ మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నా.. ఆయనది హత్యేనని స్పష్టం చేస్తూ జాన్ బెన్ని లింగం.. అక్కడకు చేరుకున్న వారిని ఉద్దేశించి చేసిన ప్రసంగం మొత్తం రచ్చకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అక్కడ చేరిన సమూహాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడిన ఆయన.. హింసకు ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేసినట్లుగా గుర్తించారు. ఆయన నేపథ్యంలో.. ఆ రోజున చేసిన విద్వేషపూరిత ప్రసంగాన్ని చూస్తే.. కుట్ర కోణం ఖాయమన్న భావన పోలీసు వర్గాల్లో వ్యక్తమవుతోంది.
‘ఒక్క క్షణం బైబిల్ ను పక్కన పెడితే ఊచకోత కోస్తాం. మమ్మల్ని కెలకొద్దు. మేం మంచివాళ్లం కాదు. మూర్ఖులం.. మాతో పెట్టుకోవద్దు. ఖబడ్డార్.. మేం కన్నెర్ర చేస్తే మీరెక్కడ ఉంటారో ఆలోచించుకోండి. మా దగ్గర యుద్ధం చేసే గుంపులూ ఉన్నాయి. ఎంతకైనా తెగిస్తాం’ తరహా సంచలన వ్యాఖ్యలు.. రెచ్చగొట్టేలా మాట్లాడిన వైనంపై నిఘా వర్గాలు ఇప్పడు ఫోకస్ చేస్తున్నాయి. ఇంతకూ ఇతడు ఎక్కడి వాడు? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే క్రిష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని నెహ్రూ నగర్ కు చెందిన వాడిగా చెప్పొచ్చు. వైసీపీ కి అత్యంత సన్నిహితుడిగా చెబుతున్నారు. అంతేకాదు.. కొడాలి నానికి ప్రధాన అనుచరుడిగా గుర్తు చేస్తున్నారు.
టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి వ్యతిరేకంగా క్రైస్తవుల్ని రెచ్చగొట్టటం.. ప్రస్తుతం అధికారంలో ఉన్న వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హోం మంత్రి అనితలతో సహా అనేక మందిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారని గుర్తించారు. ఆయనకు చెందిన పలు సోషల్ మీడియా ఖాతాల్లోనూ ఈ విషయాలు ఇట్టే అర్థమవుతాయని చెబుతున్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అతడు చేసిన విద్వేష ప్రసంగంపై ఫోకస్ చేస్తే.. నేరపూరిత కుట్ర బయటకు వస్తుందని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీలో క్రైస్తవులకు భద్రత లేదంటూ తప్పుడు ప్రచారం చేయటంలో అతడు కీలక భూమిక పోషిస్తారన్న విషయాన్ని గుర్తించారు. మరి.. ఇలాంటి వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
