ఆ పనిచేస్తే.. ఏడేళ్ల జైలు-10 లక్షల జరిమానా.. ఎవరి కోసం?
కేసు తీవ్రతను బట్టి..ఈ రెండు శిక్షలు ఒకేసమయంలో అమలు చేసేవిధానాన్ని కూడాతీసుకువచ్చింది. వాస్తవానికి దేశంలో ఇప్పటికి నాలుగు చట్టాలు ఉన్నాయి.
By: Tupaki Desk | 2 Sept 2025 5:15 AM ISTకేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలోఅక్రమంగా ఉంటున్న విదేశీయులు, వారికి ఆశ్రయం కల్పిస్తున్నవారిపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు.. నకిలీ పాస్ పోర్టు, వీసాలతో దేశంలోకి ప్రవేశించే విధానానికి చెక్ పెట్టింది. ఇక నుంచి నకిలీ వీసాలు, పాస్ పోర్టులతో దేశంలోకి ప్రవేశించేవారిపై కఠినతరమైన నిఘాను పెట్టనున్నట్టు తెలిపింది. అదేసమయంలో వీరికి విధించే శిక్షలను మూడు రెట్లు పెంచింది. ఇప్పటి వరకు నకిలీ పాస్‌పోర్టు, వీసాలు కలిగి ఉన్నవారికి రెండేళ్ల జైలు, 2 లక్షల రూపాయల జరిమానా ఉండగా.. దీనిని ఏడేళ్ల జైలు, 10 లక్షల రూపాయల జరిమానాగా మార్చింది.
కేసు తీవ్రతను బట్టి..ఈ రెండు శిక్షలు ఒకేసమయంలో అమలు చేసేవిధానాన్ని కూడాతీసుకువచ్చింది. వాస్తవానికి దేశంలో ఇప్పటికి నాలుగు చట్టాలు ఉన్నాయి. వీటిని రద్దు చేసిన కేంద్రం ఇమ్మిగ్రేషన్, పాస్‌పోర్టు యాక్ట్-2025ను తీసుకువచ్చింది. దీనికి రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా వేశారు. దీంతో ఈ చట్టాన్ని సెప్టెంబరు 1(సోమవారం)నుంచి అమలు చేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. అంతేకాదు.. ప్రజలకు కూడా తెలియజేసింది. దేశంలో పౌరుల భద్రతకు ప్రధాన పీట వేస్తున్నామని..ఇతర దేశాలకు చెందిన వారిని ఉపేక్షించేది లేదని తెలిపింది. నకిలీ పాస్‌పోర్టులు, వీసాలతో దేశంలోకి వచ్చి ఉంటున్న వారిని ఏరేసే ప్రక్రియలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని కోరింది.
అదేసమయంలో నకిలీ వీసాలు ఇప్పించినా..తయారు చేసినా.. పాస్‌పోర్టులను నకిలీవి సమర్పించినా.. దీనికి దోహదపడినా కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. వీసాలు, పాస్‌పోర్టుల విషయంలో ప్రపంచ దేశాలు చాలా కఠినంగా వ్యవహరిస్తు న్నాయని గుర్తు చేసిన కేంద్ర ప్రభుత్వం మన దగ్గర కూడా అంతేకఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దేశంలో ఉగ్రకార్యకలాపాలకు ముకుతాడువేసేందుకు ఇది దోహద పడుతుందని పేర్కొంది. అదేసమయంలో దేశ సంపద మన ప్రజలకు మాత్రమే వినియోగించేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని.. ఎవరూ కూడా విదేశీయుల విషయంలో జోక్యం చేసుకోవద్దని తేల్చి చెప్పింది.
అంతేకాదు.. విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల్లో చదివే విదేశీయుల వివరాలను తక్షణమే కేంద్రానికి పంపాలని ఆదేశించింది. అలాగే.. విహారానికి.. వచ్చేవారి వివరాలను కూడా హోటళ్లు తమ లాభాపేక్షల కోసం దాచిపెట్టడానికి వీల్లేదని.. అదే జరిగితే.. హోటల్ అనుమతులు రద్దు చేయడంతోపాటు చట్టపరమైన చర్యలు కూడా తప్పవని హెచ్చరించింది. విమానాలు, నౌకల ద్వారా ప్రయాణించే విదేశీయుల వివరాలను.. కూడా ఎప్పటికప్పుడు అందించాలని స్పష్టం చేసింది. మొత్తంగా.. విదేశీయులు అక్రమంగా చొరబడకుండా.. చూసే బాధ్యత రాష్ట్రాలు, ప్రజలపై కూడా ఉందని తేల్చి చెప్పింది.
