Begin typing your search above and press return to search.

పైలట్ ‎ పై దాడి చేసిన ప్రయాణికుడు... తెరపైకి "నో ఫ్లై లిస్ట్"!

ఇందులో భాగంగా పైలెట్ పై దాడికి పాల్పడిన ప్రయాణికుడిని విమానం నుంచి కిందకు దించిన ఎయిర్‌ పోర్ట్ అథారిటీ.. అతడికి సీ.ఐ.ఎస్‌.ఎఫ్.కి అప్పగించింది.

By:  Tupaki Desk   |   15 Jan 2024 10:25 AM GMT
పైలట్ ‎ పై దాడి చేసిన ప్రయాణికుడు... తెరపైకి నో ఫ్లై లిస్ట్!
X

ఇటీవల కాలంలో విమానాల్లో జరుగుతున్న సంఘటనలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా విమానాలు గాల్లో ఉన్నప్పుడు పలువురు ప్రయాణికులు చేస్తున్న వింత చేష్టలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో... తాజాగా ఒక పైలెట్ పై ప్రయాణికుడు దాడిచేసిన సంఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ఇదే సమయంలో "నో ఫ్లై లిస్ట్ లో నిందితుడు" అనే చర్చ కూడా తెరపైకి వచ్చింది.

అవును... ఇండిగో విమానంలో ప్రయాణికుడికి, పైలట్ కి మధ్య గొడవ జరిగింది. పొగమంచు కారణంగా గోవా వెళ్తున్న ప్రయాణం ఆలస్యమైందని ఆరోపిస్తూ ఓ ప్రయాణికుడు పైలట్‌ పై దాడికి పాల్పడ్డాడు. ఢిల్లీ నుంచి గోవాకు బయలుదేరిన విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ గొడవకు పాల్పడిన వ్యక్తిని సాహిల్ కత్రియాగా గుర్తించారు పోలీసులు.

సదరు ప్రయాణికుడు దాడికి పాల్పడుతున్న సమయంలో విమానంలో ఉన్న మహిళా ఎయిర్ హోస్ట్స్ ‎లలో ఒకరు ఈ ఘర్షణ వాతావరణాన్ని నియంత్రించడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో దాడికి పాల్పడుతున్న వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ ‎ గా మారింది. ఈ సమయంలో ఈ వ్యవహారాన్ని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సీరియస్ గా పరిగణించినట్లు తెలుస్తుంది.

ఇందులో భాగంగా పైలెట్ పై దాడికి పాల్పడిన ప్రయాణికుడిని విమానం నుంచి కిందకు దించిన ఎయిర్‌ పోర్ట్ అథారిటీ.. అతడికి సీ.ఐ.ఎస్‌.ఎఫ్.కి అప్పగించింది. ఈ సమయంలో ఆ ఫ్లైట్ కో-పైలట్ అనూప్ కుమార్ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు నిందితులపై 290, 323, 341 ఐపీసీ సెక్షన్లతోపాటు ఎయిర్‌ క్రాఫ్ట్ రూల్స్‌ లోని సెక్షన్ 22 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మరోవైపు ఈ విషయాన్ని ఇండిగో సంస్థ తీవ్రంగా పరిగణించింది. ఇందులో భాగంగా సదరు ప్రయాణికుడి తీరును కౄరంగా భావిస్తూ... అతడిని "నో ఫ్లై లిస్ట్" లో చేర్చే విషయంపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో ఈ దాడి ఘటనపై అంతర్గత విచారణకు ఓ కమిటీని ఏర్పాటుచేయనున్నట్లు వెల్లడించారు. ఆ నిర్ణయం అమలైతే... ఇకపై అతడు విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధిస్తారు.

కాగా.. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో పొగమంచు విపరీతంగా పెరిగిపోయింది. దీంతో... పలు విమానాలు ఆలస్యంగా నడుస్తుంటే, మరికొన్నింటిని అధికారులు రద్దు చేశారు. ఈ కారణంగా... ఇప్పటి వరకూ సుమారు 100 విమానాలు ఆలస్యంగా ప్రయాణించగా.. 10 విమానాలు రద్దైనట్లు ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు.