పాశమైలారంలో దారుణం... ఉదయం నుంచి ఏమి జరిగిందంటే..!
అవును... తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని పాశమైలారంలో గల సీగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిన ఘటన ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
By: Tupaki Desk | 30 Jun 2025 1:22 PMరోజూలాగానే సోమవారం ఉదయం కూడా కార్మికులు ఫ్యాక్టరీకి వెళ్లారు.. రోజూలాగానే పనిలో నిమగ్నమైపోయారు.. అయితే వారికి తెలియదు.. ఈ రోజు ప్రతీ రోజులాగా ముగియదని.. సాయంత్రం పని అయిపోయిన తర్వాత ఇంటికి చేరుకోమని! ఈ రోజు ఉదయాన్నే పాశమైలారంలోని సిగాచీ కెమికల్స్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది.. కార్మికుల కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది.
అవును... తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని పాశమైలారంలో గల సీగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిన ఘటన ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ భారీ ప్రమాదంలో ఇప్పటి వరకు 13 మంది చనిపోగా.. మరో 35 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. మృతుల్లో ప్లాంట్ వైస్ ప్రెసిడెంట్ ఎల్.ఎన్. గోవన్ కూడా ఉన్నారు!
గోవన్ ఉదయం ప్లాంటులోకి వచ్చిన సమయంలోనే ఈ భారీ పేలుడు సంభవించగా.. పేలుడు ధాటికి సమీపంలోని ఆయన కారు నుజ్జునుజ్జు అయింది. పేలుడు ధాటికి అక్కడున్న కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం ఎగిరి పడ్డారని చెబుతున్నారు. ఉదయం ఈ ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 100 పైగా మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం.
ఆ సమయంలో... ప్రమాద స్థలంలో పలువురి కార్మికుల మృతదేహాలు గుర్తు పట్టలేనంత చెల్లాచెదురయ్యాయి. అనంతరం... ఆ ప్రాంతంలో కార్మికుల కుటుంబ సభ్యుల, బంధువుల రోదనలు మిన్నంటాయి. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుల్లో సుమారు 12 మంది పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు!
ప్రమాదం జరిగిన అనంతరం సుమారు 11 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. మరోవైపు.. మరికొంతమంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉండవచ్చని అధికారులు భావించారు. ఈ సమయంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు భారీ క్రేన్ లు, హైడ్రాలిక్ పరికరాలను రంగంలోకి దింపాయి!
ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత!:
పాశమైలారం కెమికల్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రియాక్టర్ పేలడంతో ఇప్పటి వరకు 13 మంది ప్రాణాలు కోల్పోగా.. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు పలువురు కార్మికులు ఇంకా పరిశ్రమలోనే చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో పరిశ్రమలోకి చొచ్చుకెళ్లేందుకు కార్మికుల కుటుంబాలు యత్నించాయి.
ఈ సందర్భంగా తమవారి ఆచూకీ చెప్పాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో వారిని పరిశ్రమలోకి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కార్మికుల కుటుంబ సభ్యులు, బంధువులకు.. పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన దామోదర్ రాజనర్సింహ!:
ప్రమాదం జరిగిన కాసేపటికే సంఘటనా స్థలాన్ని కార్మిక శాఖ మంత్రి వివేక్ తో కలిసి మంత్రి దామోదర రాజనర్సింహ పరిశీలించారు. ఈ సందర్భంగా... క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. జరిగిన ఘటన బాధాకరం, దురదృష్టకరమని అన్నారు.
ఘటన జరిగిన వెంటనే పోలీస్, ఫైర్ సహా అన్ని డిపార్ట్‌మెంట్లు వేగంగా స్పందించి సహాయక చర్యలు చేపట్టాయని తెలిపారు. ఇదే సమయంలో... పరిశ్రమల్లో భద్రతపై త్వరలోనే ఓ కమిటీ వేస్తామని మంత్రి వివేక్ తెలిపారు. అధిక పని గంటలపై కార్మికులు ఫిర్యాదు చేస్తే లేబర్ కమిషన్ దర్యాప్తు చేస్తుందని పేర్కొన్నారు.
ప్రధాని మోడీ దిగ్భ్రాంతి.. ఎక్స్ గ్రేషియా ప్రకటన!:
ఈ ఘటనపై ప్రధాని మోడీ స్పందించారు. కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని.. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా.. పీఎం ఎన్.ఆర్.ఎఫ్. నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 ఎక్స్ గ్రేషియా అందిస్తామని అన్నారు.
ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి!:
పాశమైలారం పారిశ్రామికవాడ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. పాశ మైలారం, పారిశ్రామిక వాడ, అగ్ని ప్రమాద ఘటనలో పలువురు మరణించడం దిగ్భ్రాంతి కలిగించిందని తెలిపారు. ఇదే సమయంలో... క్షతగాత్రులక మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని అన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి!:
పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో జరిగిన పేలుడు ఘటనపై మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిగాచి పరిశ్రమలోని కార్మికుల మృతిపట్ల సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. చనిపోయిన వారి కుటుంబాలని ఆదుకోవాలని అన్నారు.
తీవ్ర విచారం వ్యక్తం చేసిన గవర్నర్!:
పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో జరిగిన పేలుడు ఘటన పట్ల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ఆయన సంతాపాన్ని వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ను ఆదేశించారు.
సంగారెడ్డి కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్:
సిగాచి ప్రమాద బాధితుల కోసం సంగారెడ్డి కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రమాద బాధితుల వివరాల కోసం 08455276155ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.