Begin typing your search above and press return to search.

ఇండియా కూటమి పెద్దన్నగా కాంగ్రెస్... మండిపోతున్న పార్టనర్స్...!

అది అలా ఉంచితే ఇండియా కూటమిలో పెద్దన్నగా కాంగ్రెస్ వ్యవహరిస్తోంది అని మిగిలిన పార్టీలు గుస్సా అవుతున్నాయి. కాంగ్రెస్ కర్నాటకలో గెలవక ముందు ఇండియా కూటమి పేరుతో విపక్షాలు కలిశాయి.

By:  Tupaki Desk   |   19 Oct 2023 5:30 PM GMT
ఇండియా కూటమి పెద్దన్నగా కాంగ్రెస్... మండిపోతున్న పార్టనర్స్...!
X

ఇండియా కూటమి పుట్టి ఇంకా కొద్ది నెలలు మాత్రమే అయింది. మూడు మీటింగ్స్ జరిగాయి. వాటిని పాట్నా, బెంగళూరు, ముంబైలలో నిర్వహించారు. ఈ మూడు మీటింగ్స్ తరువాత మరింతగా కూటమి దూసుకుని పోతూందంటే అక్కడే అడ్డంకులు మొదలయ్యాయి. ఇండియా కూటమికి చైర్మన్ కన్వీనర్ లను ఎన్నుకోవడం దగ్గరే పేచీ స్టార్ట్ అయింది అన్న ప్రచరమూ సాగింది.

అది అలా ఉంచితే ఇండియా కూటమిలో పెద్దన్నగా కాంగ్రెస్ వ్యవహరిస్తోంది అని మిగిలిన పార్టీలు గుస్సా అవుతున్నాయి. కాంగ్రెస్ కర్నాటకలో గెలవక ముందు ఇండియా కూటమి పేరుతో విపక్షాలు కలిశాయి. కర్నాటకలో గెలిచిన తరువాత కాంగ్రెస్ తీరులో కొంత మార్పు వచ్చింది అని అంటున్నారు.

ఇపుడు చూస్తే అయిదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కి మెజారిటీ స్టేట్స్ వస్తాయని సర్వేలు ఘోషిస్తున్నాయి. లక్ కనుక ఇంకా ఫేవర్ చేస్తే మాత్రం టోటల్ అయిదుకు అయిదూ స్టేట్స్ కాంగ్రెస్ కొట్టేసినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఇక రాహుల్ గాంధీ కూడా ధీమాగా ఉంటున్నారు.

ఆయన ఇటీవల మిజోరాం టూర్ లో మాట్లాడుతూ తాము అయిదింటికి అయిదూ గెలుచుకుని తీరుతామని అన్నారు. బీజేపీని లేకుండా చేస్తామని చెప్పారు. మిజోరాం లో చూస్తే కాంగ్రెస్ కి ఈసారి ఆధిక్యత రావచ్చు అని సర్వేలు అంటున్నాయి. అక్కడ 2008 నుంచి 2018 వరకూ రెండు దఫాలుగా పదేళ్ల పాటు కాంగ్రెస్ పాలించింది. 2018 నుంచి మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉంది. ఈసారి ప్రభుత్వం మారుతుంది అని కాంగ్రెస్ ధీమాగా ఉంది.

అలాగే చత్తీస్ ఘడ్ లో రెండవ సారి వరసగా కాంగ్రెస్ గెలుపు సాధ్యమని సర్వేలు చెబుతున్నాయి. వాతావరణం అలాగే ఉంది. అదే విధంగా మధ్యప్రదేశ్ లో చూసినా అదే సీన్ ఉంది. అక్కడ బీజేపీ సుదీర్ఘకాలంగా అధికారంలో ఉంది. దాంతో కాంగ్రెస్ వైపు జనాల మొగ్గు స్పష్టంగా ఉంది. ఇక రాజస్థాన్ లో రెండవసారి వరసగా వచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. బీజేపీలో లుకలుకలు వర్గ పోరు కాంగ్రెస్ కి కలసి వస్తాయని అంటున్నారు. వీటితో పాటు తెలంగాణాలో చూస్తే కాంగ్రెస్ వేవ్ బలంగా ఈసారి ఉంటుంది అని అంటున్నారు.

ఇలా మొత్తంగా చూసుకుంటే అయిదింటికీ అయిదూ కాంగ్రెస్ గెలిచే సూచనలు అయితే ఉన్నాయి. ఒక వేళ కాదు అనుకుంటే రాజస్థాన్ బీజేపీకి వెళ్ళినా నాలుగింటిలో కాంగ్రెస్ గెలుపు ష్యూర్ అంటున్నారు. దాంతో ఇండియా కూటమిలో కాంగ్రెస్ పెద్దన్నగా మారుతోంది అన్న బాధ భయం అయితే ఇతర మిత్రులకు ఉన్నాయని అంటున్నారు. ఆ మధ్యన ఢిల్లీ సీఎం కూడా కాంగ్రెస్ ఒంటెద్దు పోకడల మీద మండిపడ్డారు.

ఇలాగైతే కాంగ్రెస్ తో ఇండియా కూటమితో కష్టమని అరవింద్ కేజ్రీవాల్ కూడా చెప్పేశారు. అయితే ఆ తరువాత సర్దుకున్నారు. అయినా సరే ఎన్నికల వేళ ఆప్ కాంగ్రెస్ బంధంలోని అసలైన అందం ఏంటో బయటపడతాయని అంటున్నారు. ఇక ఇపుడు సమాజ్ వాది పార్టీ వంతు. సమాజ్ వాదీ పార్టీ మధ్యప్రదేశ్ లో పోటీకి రెడీ అవుతోంది. 2018 ఎన్నికల్లో తమకు ఉన్న బలాన్ని చూపించి సీట్లు పొత్తుల విషయంలో కేటాయించాలని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కోరుతున్నారు.

అయితే పొత్తులు లేవు ఏమీ లేవు అన్నట్లుగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. కేవలం లోక్ సభ ఎన్నికలు జాతీయ స్థాయిలలోనే పొత్తులు అని కాంగ్రెస్ అంటోందని ఆయన మండిపడుతున్నారు. అదే కనుక అయితే ఇండియా కూటమి ఎందుకు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. తాము కూడా రేపటి రోజున లోక్ సభ ఎన్నికల వేళ తాము కూడా ఆలోచించుకోవాల్సి ఉంటుందని ఆయన అంటున్నారు

ఇక తాను మధ్యప్రదేశ్‌లో పోటీకి సంబంధించి తాను కమల్ నాథ్‌తో మాట్లాడానని, పార్టీ పనితీరు గురించి, గతంలో ఎస్పీ ఎమ్మెల్యేలు గెలిచిన స్థానాల గురించి, రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థుల గురించి చర్చించామన్నారు. ఆరు స్థానాల్లో అభ్యర్థులను ఉపసంహరించుకోవడానికి కాంగ్రెస్ అంగీకరించిందని, కానీ వాళ్లు అభ్యర్థులను ప్రకటించే ముందు తమను సంప్రదించలేదన్నారు. రాష్ట్రస్థాయిలోను కూటమి లేదనుకుంటే తాము జాతీయస్థాయిలో వారితో ఎలా కలుస్తామన్నారు. వాళ్లు ఎలా ఉంటే తాము అలాగే ఉంటామన్నారు. ఇలా ఇండియా కూటమిలో లుకలుకలు అయితే స్టార్ట్ అయ్యాయని అంటున్నారు.

వీటికంటే ముందు ఇండియా కూటమి గెలిస్తే రాహుల్ ప్రధాని అని కాంగ్రెస్ సీనియర్ నేత శశిధరూర్ చేసిన ప్రకటన కూడా కూటమి పెద్దలను కలవరపెడుతోంది. కాంగ్రెస్ మద్దతుతో ప్రధాని కావాలని అక్కడ చాలా మంది ఆశతో ఉన్నారు. ఇపుడు కాంగ్రెస్ బలం పెరిగి పీఎం ఆ పార్టీకే వెళ్తే మిత్రులు ఊరుకుంటాయా అన్నదే డౌట్. సో కాంగ్రెస్ పెద్దన్న పాత్ర విపక్షాలు సహించకపోతే కూటమికే ఎసరు వస్తుంది. బీజేపీ కూడా సరిగ్గా అదే కోరుకుంటోంది అని అంటున్నారు.