Begin typing your search above and press return to search.

ఆ దర్యాప్తు సంస్థను ఇక రాష్ట్రాలు అడ్డుకోలేవు...

సరిగ్గా ఐదేళ్ల కిందట కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని గట్టి గా ఢీకొట్టింది ఏపీలోని చంద్రబాబు సర్కారు

By:  Tupaki Desk   |   12 Dec 2023 11:20 AM GMT
ఆ దర్యాప్తు సంస్థను ఇక రాష్ట్రాలు అడ్డుకోలేవు...
X

సరిగ్గా ఐదేళ్ల కిందట కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని గట్టి గా ఢీకొట్టింది ఏపీలోని చంద్రబాబు సర్కారు. అప్పటివరకు కేంద్ర ప్రభుత్వంలో భాగమైన టీడీపీ.. అందులోంచి బయటకు వచ్చాక భారీగా విమర్శలు చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఏపీపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పనుందనే కథనాలు వచ్చాయి. ఈ విషయాన్ని పసిగట్టిన చంద్రబాబు సర్కారు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి జనరల్ కాన్సెంట్ (సాధారణ అనుమతి)ను ఉపసంహరించుకున్నారు. అంటే.. సీబీఐ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా రాకూడదని అర్థం.

సరిగ్గా ఆరు నెలల కిందట స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే సర్కారు కూడా సీబీఐకి జనరల్ కాన్సెంట్ ను వెనక్కుతీసుకుంది. విద్యుత్తు, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలియగానే ఈ పనిచేసింది. ఇవే కాదు.. ఈశాన్యాన ఉన్న మిజోరం కూడా ఇలానే చేసింది. 2015 నుంచి చూస్తే మిజోరం, 2018లో ఏపీ, పశ్చిమ బెంగాల్, 2020లో కేరళ రాష్ట్రాల ప్రభుత్వాలు సీబీఐని రావొద్దని స్పష్టం చేశాయి.

ప్రతిపక్ష ప్రభుత్వాలే టార్గెట్.. మూడేళ్లుగా చూస్తే

మిజోరం నుంచి ఏపీ వరకు.. తమిళనాడు నుంచి పంజాబ్ దాకా.. ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలు ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసి మరీ సీబీఐని వదులుతున్నదని ఆరోపణలు వెల్లువెత్తాయి. పంజాబ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ, జార్ఖండ్ లలో ఇలానే బీజేపీయేతర ప్రభుత్వాలు ఉండగా.. సీబీఐ రావొద్దంటూ అడ్డుకున్నాయి. మూడేళ్ల కిందట జార్ఖండ్ సైతం జనరల్ కాన్సెంట్ ను వెనక్కుతీసుకుంది. మొత్తమ్మీద చూస్తే 9 రాష్ట్రాలు ఇదే విధంగా తమ సాధారణ సమ్మతిని రద్దుచేశాయి.

ఇకమీదట అలా చేయలేవు..

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తేనున్న చట్టం ప్రకారం సీబీఐకి రాష్ట్రాల సమ్మతితో పనిలేదు. ఆ మేరకు రాష్ట్రాల సమ్మతి, జోక్యంతో పనిలేకుండా దర్యాప్తు చేసే అధికారాన్ని సీబీఐకి ఇస్తూ కొత్త చట్టం చేయాలని ఓ పార్లమెంటరీ స్థాయీ సంఘం సోమవారం సిఫార్సు చేసింది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు వివక్షకు గురవుతున్నామనే భావనకు లోనవకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఇది స్వాతంత్ర్య పూర్వ చట్టం..

సీబీఐ దర్యాప్తునకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కావాలి అని 1946 నాటి ఢిల్లీ ప్రత్యేక పోలీసు సంస్థ చట్టం నిర్దేశిస్తోంది. ప్రస్తుతం తొమ్మిది రాష్ట్రాలు సీబీఐ దర్యాప్తునకు అనుమతి నిరాకరించాయి. జాతీయ భద్రత, దేశ సమగ్రతకు ప్రమాదం వాటిల్లిందని భావించే కేసుల్లో రాష్ట్రాల సమ్మతితో పని లేకుండా కొత్త చట్టం చేయాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం 135వ నివేదిక సూచించింది. మరిప్పుడు కొత్త చట్టంతో ఏం జరుగుతుందో చూడాలి.