పార్లమెంటును కుదిపేసిన 'సోనియా-సుంకాలు'
రెండు కీలక విషయాలు.. శుక్రవారం పార్లమెంటు ఉభయ సభలనూ పెద్ద ఎత్తున కుదిపేశాయి.
By: Tupaki Desk | 4 April 2025 3:23 PM ISTరెండు కీలక విషయాలు.. శుక్రవారం పార్లమెంటు ఉభయ సభలనూ పెద్ద ఎత్తున కుదిపేశాయి. దీంతో పదే పదే సభలను వాయిదా వేస్తామని.. లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ నుంచి హెచ్చరికలు రావడం గమ నార్హం. చివరకు ఒకటికి పలుమార్లు వాయిదాల పర్వం తప్పలేదు. అధికార పక్ష ఎన్డీయే కూటమి సభ్యులు కాంగ్రెస్ మాజీ చీఫ్.. రాజ్యసభ సభ్యురాలు.. సోనియాగాంధీని టార్గెట్ చేశారు. సభలో ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక, కాంగ్రెస్ సభ్యులు.. అమెరికా విధిస్తున్న.. విధిస్తామని హెచ్చరిస్తున్న సుంకాల విషయంపై ఏం చేస్తున్నారని అధికార పక్షాన్ని రెండు సభల్లోనూ నిలదీయడం గమనార్హం.
సోనియా క్షమాపణలు ఎందుకు?
కాంగ్రెస్ అగ్రనేత, మాజీ చీఫ్.. సోనియాగాంధీ.. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు- 24పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లు లోక్‌సభలోను, రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. అయితే.. లోక్ సభకంటే కూడా.. రాజ్యసభలోనే ఈ బిల్లుపై ఎక్కువగా చర్చ జరిగింది. దీనిని పురస్కరించుకుని.. లోక్ సభలో పెద్దగా చర్చించకుండానే.. అధికారపక్షం.. తన బలంతో ఈ బిల్లును సాధించుకుందని సోనియా వ్యాఖ్యానించారు. ఒకరకంగా.. సభపై బీజేపీ ఆధిపత్యం చలాయించి.. బిల్లును పాస్ చేసుకుందన్నారు.
అంతేకాకుండా.. వక్ఫ్ బిల్లు ఆర్టికల్ 14కు వ్యతిరేకమని సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. సమానత్వ హ క్కుకు గొడ్డలి పెట్టని.. ఒకరకంగా రాజ్యాంగంపైనే దాడి అని, సమాజంలో హిందూవులు, హిందూయేతరు లు అనే విభజన ను తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నమని ఆమె సంచలన కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ నాయకులు తప్పుబట్టారు. రాజ్యాంగంపై దాడి అన్న వ్యాఖ్యను వెనక్కి తీసుకుని ఇరు సభలకు సోనియా క్షమాపణలు చెప్పాలని పెద్ద ఎత్తున రచ్చ చేశారు.
ఇక, కాంగ్రెస్ కూటమి పార్టీలకు చెందిన రాజకీయ పక్షాల నేతలు.. ఇరు సభల్లోనూ మోడీ సర్కారును ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించారు. అమెరికా హెచ్చరికలపై మోడీ సర్కారు స్పందనను ప్రశ్నించారు. ముఖ్యంగా సుంకాల విధింపుపైనా నిలదీశారు. మన పరిస్థితి ఏంటి. అంటూ.. కాంగ్రెస్ నాయకులు, ఎస్పీ నేతలు నిలదీశారు. దీంతో ఇరు సభల్లోనూ అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య నినాదాలు, అరుపులు, కేకలు.. మిన్నంటాయి. ఈ క్రమంలో అటు స్పీకర్, ఇటుచైర్మన్ సభను వాయిదా వేయాల్సి ఉంటుందని పదే పదే హెచ్చరించారు. చివరకు వాయిదా వేశారు.
