Begin typing your search above and press return to search.

పార్లమెంటులో చెట్టుంది.. ప్రధానమంత్రికి అడ్డయింది..!

మనం చెప్పుకొంటున్న ఆ చెట్టు పార్లమెంటు గజద్వారం వద్ద ఉంది. విపరీతంగా పెరిగిపోయిన ఈ పసుపు పూల చెట్టు వీవీఐపీల భద్రతకు సవాల్‌గా మారింది.

By:  Tupaki Desk   |   23 Aug 2025 8:06 PM IST
పార్లమెంటులో చెట్టుంది.. ప్రధానమంత్రికి అడ్డయింది..!
X

గోదారి గట్టుంది.. గట్టుమీద చెట్టుంది.. చెట్టుమీద పిట్టుంది.. పిట్ట మనసులో ఏముంది? అనేది తెలుగు సూపర్‌ హిట్‌ సినిమా మూగ మనసులులోని సూపర్‌ హిట్‌ సాంగ్‌... ఇప్పుడు ఇదే పాటను కాస్త మార్చి చెప్పుకొంటే.. పార్లమెంటులో చెట్టుంది.. ప్రధానమంత్రికి అడ్డయింది అని పాడుకోవాలి..! ఇదంతా ఎందుకంటే.. దాదాపు ఏడాదిన్నర కిందట భారత పార్లమెంటు కొత్త భవనం ప్రారంభమైంది..! మోదీ ప్రభుత్వం మూడో విడత కొలువుదీరిన అనంతరం పాత భవనానికి గుడ్‌బై చెప్పి కొత్త భవనంలోనే పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తున్నారు. భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్లుగా.. అంటే మున్ముందు నియోజకవర్గాల పునర్విభజన కారణంగా ఎంపీ సీట్లు పెరిగితే అందుకుతగ్గట్లు కొత్త పార్లమెంటును నిర్మించారు.

చెట్టే ముందు... పార్లమెంటు కాదు..

కొత్త పార్లమెంటులో ప్రస్తుతం సమావేశాలు జరుగుతున్నాయి. ఎప్పటిలాగే ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వంపై పలు అంశాల మీద నిప్పులు చెరుగుతున్నాయి. ఇదెప్పుడూ ఉండేదే అయినా.. కొత్తగా ఒక సవాల్‌ వచ్చింది. అదే ఓ చెట్టు. కోడిముందా? గుడ్డు ముందా? అనే సామెతను దీనికి అన్వయిస్తే.. పార్లమెంటు ముందా? ఈ చెట్టు ముందా? అని చెప్పుకోవాలి. దీనికి సమాధానం చెట్టే. దాని తర్వాతనే కొత్త పార్లమెంటును కట్టారు.

వీవీఐపీల భద్రతకు సవాల్‌గా..

మనం చెప్పుకొంటున్న ఆ చెట్టు పార్లమెంటు గజద్వారం వద్ద ఉంది. విపరీతంగా పెరిగిపోయిన ఈ పసుపు పూల చెట్టు వీవీఐపీల భద్రతకు సవాల్‌గా మారింది. అలాగని అడ్డంగా కొట్టేస్తే పర్యావరణ పరిరక్షణ ఇదేనా? అనే విమర్శలు వస్తాయి. దీంతో భారీ వృక్షాన్ని వేరే చోటకు మార్చుతున్నారు.

ఆరు ప్రవేశ మార్గాల్లో...

కొత్త పార్లమెంటు భవనంలోకి వెళ్లేందుకు ఆరు ప్రవేశ మార్గాలున్నాయి. ఇందులో గజద్వారం నుంచే ప్రధాని మోదీ తరచూ సభకు వెళ్తుంటారు. సరిగ్గా అక్కడే ఉంది పసుపు పూల చెట్టు. బహుశా గజ ద్వారం వద్ద ఉన్నందునే ఏమో..? దీనిని నంబర్‌ వన్‌ ట్రీగానూ పేర్కొంటున్నారు. కానీ, వీవీఐపీలు వెళ్లే మార్గంలో ఉండడంతో తొలగించక తప్పదని ప్రధాని భద్రతను పర్యవేక్షించే స్పెషల్‌ ప్రొటెక‌్షన్‌ గ్రూప్‌ (ఎస్పీజీ) నిర్ణయించి సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌ మెంట్‌కు సమాచారం ఇచ్చింది.

ఒక చెట్టుకు పది మొక్కలు...

గజ ద్వారం వద్ద ఉన్న నంబర్‌ వన్‌ట్రీని ప్రేరణ స్థల్‌కు మార్చనున్నారు. అటవీ శాఖకు ఇచి‍్చన హామీ మేరకు ఇందుకు పరిహారంగా పార్లమెంటు క్యాంపస్‌లో సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌ మెంట్‌ పది మొక్కలు నాటాల్సి ఉంటుంది. అంతేకాదు.. నంబర్‌ వన్‌ ట్రీ తరలింపునకు అటవీ శాఖకు రూ.57 వేలు డిపాజిట్‌ చేశారు.