ఆపరేషన్ సిందూర్.. పార్లమెంట్ ను షేక్ చేయబోతోందా?
By: Tupaki Desk | 24 July 2025 1:00 AM ISTదేశ రాజకీయాల్లో 'ఆపరేషన్ సిందూర్' ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ అంశంపై పార్లమెంట్‌లో ప్రత్యేక చర్చకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. జూలై 28న లోక్‌సభలో, జూలై 29న రాజ్యసభలో మొత్తం 16 గంటల పాటు ఈ చర్చ జరగనుంది. ఈ పరిణామం దేశ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోంది.
-ఆపరేషన్ సిందూర్ చుట్టూ ప్రతిపక్షాల పట్టు
భారత్ పై పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన పీచమణిచేందుకు పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై భారత్ చేసిన దాడినే ‘ఆపరేషన్ సిందూర్’గా నామకరణం చేశారు. అయితే యుద్ధం సడెన్ గా ఆపడంపైనే ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. పాకిస్తాన్ ను దెబ్బతీసే చాన్స్ వచ్చినా అమెరికా ఒత్తిడితో భారత్ వదిలేసిందని ప్రతిపక్షాలు, ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవలి కాలంలో రాజకీయ వర్గాలను తీవ్రంగా ప్రభావితం చేసిన ఆపరేషన్ సిందూర్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. ఇది ఏదైనా దేశ ప్రతిష్ట రక్షణరంగంలో కీలకమైన ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారంలో ఉన్నాయి. అయితే, దీనిపై అధికారికంగా పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈ అనిశ్చితి, గోప్యత ఈ అంశంపై ప్రజల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
-విపక్షాల ఒత్తిడి: తక్షణ చర్చకు డిమాండ్
ప్రతిపక్షాలు ఈ విషయంలో కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. "రేపటి నుంచే చర్చ మొదలుపెట్టండి" అని డిమాండ్ చేస్తూ, తక్షణమే డిబేట్ నిర్వహించాలని కోరాయి. అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో ఉన్నందున చర్చను జూలై 28, 29 తేదీలకు వాయిదా వేసినట్లు కేంద్రం ప్రకటించింది. ఈ వాయిదా ప్రతిపక్షాలకు మరింత ఆందోళన కలిగించింది.
-హాజరుకానున్న అగ్రశ్రేణి నాయకులు
ఈ కీలక చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ పరిణామం ఆపరేషన్ సిందూర్ అంశం ఎంతటి ప్రాముఖ్యతను సంతరించుకుందో స్పష్టం చేస్తోంది. దేశంలోని అత్యున్నత నాయకులు ఈ చర్చలో పాల్గొనడం వల్ల దీనికి జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభిస్తుంది.
- పార్లమెంట్‌ను కుదిపేస్తుందా?
ఈ చర్చతో పార్లమెంట్‌లో రాజకీయ ఉద్రిక్తత మళ్లీ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రతిపక్షాలు ఎలాంటి నిబంధనలు లేకుండా ఆందోళనకు దిగుతుండటంతో అధికార పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఆపరేషన్ సిందూర్ వెనుక ఉన్న నిజాలు ఏమిటి? దాని ప్రభావం ఏ పార్టీపై పడుతుంది? ఇది ప్రజల నమ్మకాన్ని చూరగొంటుందా, లేక తిరగబడే ప్రమాదం ఉందా? అన్న ప్రశ్నలకు ఈ చర్చలోనే సమాధానం లభించే అవకాశం ఉంది. ఈ చర్చ భారతదేశ రాజకీయ భవిష్యత్తును ఏ విధంగా మారుస్తుందో చూడాలి.
