Begin typing your search above and press return to search.

ఇరాన్ ఎఫెక్ట్‌: అక్క‌డ క్షిప‌ణులు.. ఇక్క‌డ మాట‌ల మంట‌లు!

పశ్చిమాసియాలో నెల‌కొన్న ప‌రిస్థితులు.. ఎలా ఉన్నా.. ఆ ప‌రిస్థితుల ప్ర‌భావం భార‌త దేశ పార్ల‌మెంటులో స్ప‌ష్టంగా క‌నిపించింది.

By:  Garuda Media   |   9 March 2026 4:04 PM IST
ఇరాన్ ఎఫెక్ట్‌: అక్క‌డ క్షిప‌ణులు.. ఇక్క‌డ మాట‌ల మంట‌లు!
X

పశ్చిమాసియాలో నెల‌కొన్న ప‌రిస్థితులు.. ఎలా ఉన్నా.. ఆ ప‌రిస్థితుల ప్ర‌భావం భార‌త దేశ పార్ల‌మెంటులో స్ప‌ష్టంగా క‌నిపించింది. తాజాగా సోమ‌వారం ఉద‌యం పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాల‌లో భాగంగా రెండో ద‌శ స‌మావేశాలు ప్రారంభమయ్యాయి. వ‌చ్చే నెల 2వ తేదీ వ‌ర‌కు ఈ స‌మావేశాలు సాగ‌నున్నాయి. అయితే.. తొలిరోజే ఉభ‌య స‌భ‌ల్లోనూ ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై భార‌త ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న చేయాల‌ని.. చ‌మురు విష‌యంపై అమెరికా చేసిన ప్ర‌క‌ట‌న‌పై స‌మాధానం చెప్పాల‌ని విప‌క్ష కాంగ్రెస్ స‌భ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఇటు లోక్‌స‌భ‌లోను.. అటు రాజ్య‌స‌భ‌లోనూ.. విప‌క్ష స‌భ్యులు ఆది నుంచి గంద‌ర‌గోళం సృష్టించారు. దీంతో స‌భ‌లు ప‌దే ప‌దే వాయిదా ప‌డ్డాయి. మ‌రోవైపు.. లోక్‌స‌భ‌లో స్పీక‌ర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టిన నేప‌థ్యంలో దీనిపైనే చ‌ర్చ చేప‌ట్టాల‌ని కాంగ్రెస్ స‌భ్యులు నినాదాలు చేశారు. అయితే.. ప్ర‌శ్నోత్తరాల స‌మ‌యం తర్వాత‌.. దీనిపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ప్యాన‌ల్ స్పీక‌ర్ రాజేంద్ర‌న్ ప్ర‌క‌టించారు. దీనికి నిర‌స‌న‌గా.. కాంగ్రెస్ స‌భ్యులు ఆందోళ‌న చేప‌ట్ట‌డంతో స‌భ వాయిదా ప‌డింది.

నిశితంగా గ‌మ‌నిస్తున్నాం..

ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై భార‌త విదేశాంగ మంత్రి ఎస్ . జైశంక‌ర్ రాజ్య‌స‌భ‌లో ప్ర‌క‌ట‌న చేశారు. ఆ ప్రాంతంలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్నామ‌న్నారు. అక్క‌డి భార‌తీయులను సుర‌క్షితంగా తీసుకురావ‌డంపైనే దృష్టి పెట్టామ‌ని చెప్పారు. ప్ర‌స్తుతం కొంద‌రిని తీసుకు వ‌చ్చేందుకు 50కి పైగా విమానాల‌ను ఏర్పాటు చేశామ‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌తి విష‌యంలోనూ.. జాగ్ర‌త్త‌గానే వ్య‌వ‌హ‌రి స్తున్నామ‌న్నారు. ప్ర‌ధాని మోడీ నేతృత్వంలోని భ‌ద్ర‌త‌పై ఏర్పాటైన కేంద్ర కేబినెట్ క‌మిటీ కూడా.. ప్ర‌తి క్షణం ప‌ర్య‌వేక్షిస్తోంద‌ని చెప్పారు.

అయితే.. జైశంక‌ర్ ప్ర‌క‌ట‌న చేస్తున్న స‌మ‌యంలో కాంగ్రెస్ స‌హా విప‌క్షాలు రాజ్య‌స‌భ‌లో తీవ్ర ఆందోళ‌న‌కు దిగాయి. అంతేకాదు.. నినాదాల‌తో హోరెత్తించారు. దీనిపై పార్ల‌మెంటరీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి కిరెణ్ రిజుజు తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ స‌భ్యుల‌కు స‌భ ప‌ట్ల గౌర‌వం కానీ, మ‌ర్యాద కానీ లేద‌న్నారు. అంతేకాదు..అస‌లు.. వారికి ఏ వ్య‌వ‌స్థ‌పైనా గౌర‌వం లేద‌న్నారు. న్యాయ‌వ్య‌వ‌స్థ‌, కేంద్ర ఎన్నిక‌ల సంఘం స‌హా అన్నింటినీ విమ‌ర్శించ‌డం.. వారికి అల‌వాటుగా మారింద‌ని దుయ్య‌బ‌ట్టారు. మొత్తంగా ఉభ‌య స‌భ‌లు ప‌దే ప‌దే వాయిదా ప‌డ‌డం గ‌మ‌నార్హం.