Begin typing your search above and press return to search.

ఆ రెండు సీట్లలో చక్రం తిప్పిన ‘పరిటాల’!

కాగా రాయలసీమలో కీలకమైన జిల్లా.. అనంతపురం. ఈ జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   30 March 2024 6:12 AM GMT
ఆ రెండు సీట్లలో చక్రం తిప్పిన ‘పరిటాల’!
X

ఆంధ్రప్రదేశ్‌ లో ఆయా పార్టీల పోటీ చేసే సీట్లు ఎట్టకేలకు లెక్కతేలాయి. వైసీపీ 175 అసెంబ్లీ, టీడీపీ 144 అసెంబ్లీ, జనసేన 21 అసెంబ్లీ, బీజేపీ 10 అసెంబ్లీ సీట్లకు పోటీ చేస్తున్నాయి. ఒక్క జనసేన పార్టీ తప్ప అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఇంకా మూడు అసెంబ్లీ స్థానాలకు, ఒక పార్లమెంటు స్థానానికి జనసేన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

కాగా రాయలసీమలో కీలకమైన జిల్లా.. అనంతపురం. ఈ జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. కాగా టీడీపీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎన్టీఆర్‌ హయాంలో, చంద్రబాబు హయాంలో అనంతపురం జిల్లాను పరిటాల రవీంద్ర శాసించేవారు. ఆయన దారుణ హత్య అనంతరం ఆయన భార్య సునీత, కుమారుడు శ్రీరామ్‌ రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిటాల సునీత ఐదేళ్లపాటు ఆయన మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు.

ప్రస్తుతం టీడీపీ తరఫున రాప్తాడు నుంచి పరిటాల సునీత పోటీ చేస్తున్నారు. ఇక ధర్మవరం నియోజకవర్గంలో 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గోనుగుంట్ల సూర్యనారాయణ (వరదాపురం సూరి) 2019 ఎన్నికల్లో ఓడిపోయాక బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ధర్మవరంలో గత ఐదేళ్లుగా టీడీపీ కార్యక్రమాలను పరిటాల శ్రీరామ్‌ నిర్వహిస్తూ వచ్చారు.

ఈ నేపథ్యంలో ధర్మవరం సీటును పరిటాల శ్రీరామ్‌ ఆశించారు. అయితే ధర్మవరంలో బీజేపీ పోటీ చేస్తుండటంతో ఈ సీటుపై వరదాపురం సూరి కన్నేశారు. ఒకవేళ టీడీపీ పోటీ చేసినా ఆ పార్టీలోకి వచ్చి సీటు దక్కించుకోవాలని సూరి చూశారు. అయితే ధర్మవరం సీటు పొత్తులో భాగంగా బీజేపీకి దక్కింది. అయితే సీటు మాత్రం వరదాపురం సూరికి దక్కలేదు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ కు దక్కడం విశేషం.

ఈ సీటు వెనకాల పరిటాల కుటుంబమే చక్రం తిప్పిందని టాక్‌ నడుస్తోంది. ఈ మేరకు బీజేపీ, టీడీపీ పెద్దలను మేనేజ్‌ చేసిందని గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. తమకు సీటు దక్కని నేపథ్యంలో వరదాపురం సూరికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సీటు దక్కకూడదనే పట్టుదలతో పరిటాల కుటుంబం వ్యవహరించిందని ప్రచారం జరుగుతోంది.

ఇక అలాగే అనంతపురం అర్బన్‌ లో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరికి టీడీపీ సీటు ఇవ్వలేదు. కొత్త అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్‌ కు సీటిచ్చారు. ఈ మేరకు తాజా జాబితాలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన పేరును ప్రకటించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత అనంతపురం అర్బన్‌ ఇంచార్జి ప్రభాకర్‌ చౌదరికి నిరాశే ఎదురైంది.

అనంతపురం అర్బన్‌ సీటు విషయంలోనూ పరిటాల కుటుంబమే చక్రం తిప్పిందని టాక్‌ నడుస్తోంది. ఎందుకంటే ఈ సీటును దక్కించుకున్న వెంకటేశ్వర ప్రసాద్‌.. పరిటాల సునీత నియోజకవర్గమైన రాప్తాడుకు మాజీ ఎంపీపీ. గతంలో ఆయన రాప్తాడు మండల ఎంపీపీగా పనిచేశారు. ఇప్పుడు ఆయనకు అనంతపురం అర్బన్‌ సీటు దక్కడం వెనుక పరిటాల కుటుంబమే చక్రం తిప్పిందని అంటున్నారు.

అనంతపురం జిల్లా రాజకీయాల్లో తమ కుటుంబ ఆధిపత్యాన్ని ప్రశ్నించేలా ప్రభాకర్‌ చౌదరి వ్యవహరిస్తుండటం వల్లే పరిటాల కుటుంబం ఆయనకు సీటు దక్కకుండా చెక్‌ పెట్టిందని ప్రచారం జరుగుతోంది.