పారిస్‌లో ఫుట్‌బాల్ చిచ్చు.. అల్లర్లలో ఇద్దరు మృతి.. 192 మందికి గాయాలు!
ఫుట్‌బాల్ ప్రపంచంలో సంతోషంగా మొదలైన ఒక వేడుక పారిస్ వీధుల్లో తీవ్రమైన హింసకు దారితీసింది.
By: Tupaki Desk | 2 Jun 2025 1:45 AM ISTఫుట్‌బాల్ ప్రపంచంలో సంతోషంగా మొదలైన ఒక వేడుక పారిస్ వీధుల్లో తీవ్రమైన హింసకు దారితీసింది. ఫ్రెంచ్ ఛాంపియన్స్ లీగ్‌లో పారిస్ సెయింట్-జర్మైన్ (PSG) జట్టు ఇంటర్ మిలాన్‌పై విజయం సాధించడంతో వేలాది మంది అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే, ప్రత్యర్థి అభిమానులకు, PSG అభిమానులకు మధ్య ఘర్షణలు చెలరేగడంతో పరిస్థితి అదుపు తప్పింది. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. ఈ హింసాత్మక ఘర్షణల ఫలితంగా ఇద్దరు వ్యక్తులు మరణించగా, 192 మంది గాయపడ్డారు.
వీధుల్లో హింస, ఆస్తి నష్టం
పారిస్ వీధుల్లో ప్రారంభమైన ఈ సంబరాలు క్రమంగా తీవ్రమైన అల్లర్ల రూపం తీసుకున్నాయి. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు భాష్ప వాయువును ప్రయోగించాల్సి వచ్చింది. అల్లర్లలో పాల్గొన్నవారు అనేక వాహనాలకు నిప్పుపెట్టారని, బస్ స్టాప్‌లను ధ్వంసం చేశారని అధికారులు తెలిపారు. వేలాది మంది ప్రజలు దుకాణాలను, గిడ్డంగులను దోచుకున్నారని, వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన భద్రతా సిబ్బందిపై కూడా దాడి చేశారని అధికారులు వెల్లడించారు.
559 మంది అరెస్ట్
ఈ దాడులకు ఫుట్‌బాల్ అభిమానుల్లోని అసాంఘిక శక్తులే కారణమని అధికారులు ఆరోపించారు. అల్లర్లను అదుపులోకి తెచ్చే ప్రయత్నంలో పోలీసులు మొత్తం 559 మంది ఆందోళనకారులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా ఫుట్‌బాల్ విజయాలు పండుగ వాతావరణాన్ని సృష్టిస్తాయి. కానీ, పారిస్‌లో జరిగిన ఈ సంఘటన అభిమానం హద్దులు దాటితే ఎలాంటి తీవ్ర పరిణామాలు జరుగుతాయో చూపించింది. నగరంలో శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
