Begin typing your search above and press return to search.

'గురు'తర బాధ్యత.. పరీక్షల్లో పేరెంట్స్ మాస్ కాపీయింగ్ బీభత్సం!

విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పించాల్సింది పోయి వారే స్వయంగా అక్రమాలకు తెరలేపారు.

By:  A.N.Kumar   |   11 Feb 2026 10:53 PM IST
గురుతర బాధ్యత.. పరీక్షల్లో పేరెంట్స్ మాస్ కాపీయింగ్ బీభత్సం!
X

విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పించాల్సింది పోయి వారే స్వయంగా అక్రమాలకు తెరలేపారు. తమ పిల్లలు ఎలాగైనా పాస్ కావాలనే తాపత్రయంతో ప్రాణాలకు తెగించి గోడలు ఎక్కారు. కిటికీల గుండా చిట్టీలు అందిస్తూ 'మాస్ కాపీయింగ్'కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

అసలేం జరిగిందంటే?

మహారాష్ట్రలోని బీడ్ జిల్లా చౌసాలాలో ఉన్న ఒక జూనియర్ కాలేజీలో మంగళవారం ఇంటర్ సెకండియర్ ఇంగ్లీష్ పరీక్ష జరిగింది. పరీక్ష మొదలైన కాసేపటికే కేంద్రం బయట భారీగా జనం గుమికూడారు. కాలేజీ చుట్టూ ఖాళీ ప్రదేశం ఉండటంతో, విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు ఒక్కసారిగా కాలేజీ గోడలపైకి ఎగబడ్డారు. సినిమా సీన్లను తలపిస్తూ.. కిటికీల వద్దకు చేరుకుని లోపల పరీక్ష రాస్తున్న విద్యార్థులకు చిట్టీలు అందించారు. భయం, భక్తి లేకుండా సాగిన ఈ భాగోతం చూసి స్థానికులు విస్తుపోయారు.

డ్రోన్ కెమెరాకు చిక్కిన బాగోతం

కాపీయింగ్ నివారణకు విద్యాశాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఈసారి డ్రోన్ కెమెరాల పర్యవేక్షణను ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు గోడలు ఎక్కి చిట్టీలు ఇస్తున్న దృశ్యాలను డ్రోన్ స్పష్టంగా రికార్డు చేసింది. ఆకాశంలో డ్రోన్ శబ్దం వినిపించగానే, కిటికీల వద్ద ఉన్న తల్లిదండ్రులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. కెమెరా తమను షూట్ చేస్తోందని గ్రహించి, గబగబా కిందకు దిగి పరుగులు తీశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నిమిషాల్లో వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. "తల్లిదండ్రులే ఇలా చేస్తే, రేపు ఆ పిల్లలు సమాజానికి ఏం సందేశం ఇస్తారు?" అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

అధికారుల సీరియస్ యాక్షన్

ఈ ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షా కేంద్రం వద్ద భద్రతలో వైఫల్యంపై విచారణకు ఆదేశించారు. "విద్యార్థుల భవిష్యత్తును తల్లిదండ్రులే నాశనం చేస్తున్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. పరీక్షా కేంద్రం సిబ్బంది పాత్రపై కూడా దర్యాప్తు జరుగుతోంది" అని విద్యాశాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.

- పరీక్షల వ్యవస్థపై ప్రశ్నార్థకం

గతంలో బీహార్‌లో ఇలాంటి దృశ్యాలు కనిపించేవి. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఇవే పరిస్థితులు పునరావృతం కావడం పరీక్షల వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతోంది. మార్కుల వేటలో పడి నైతిక విలువలను విస్మరిస్తున్న తల్లిదండ్రుల తీరుపై మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.