Begin typing your search above and press return to search.

ప‌రుచూరులో హైటెన్ష‌న్‌.. ఏం జ‌రుగుతోంది?

ప్ర‌స్తుతం ఏపీ వ్యాప్తంగా ఓట‌ర్ల ముసాయిదా జాబితాల్లో స‌వ‌ర‌ణ‌ల ప్ర‌క్రియ జోరుగా సాగుతోంది. డిసెంబ‌రు 15 నాటికి తుదిజాబితా వెలువ‌డ‌నుంది

By:  Tupaki Desk   |   27 Nov 2023 3:30 AM GMT
ప‌రుచూరులో హైటెన్ష‌న్‌.. ఏం జ‌రుగుతోంది?
X

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గంలో హైటెన్ష‌న్ నెల‌కొంది. వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న ఆమంచి కృష్ణ‌మోహ‌న్ దూకుడుతో అధికారులు బెంబేలెత్తుతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఏపీ వ్యాప్తంగా ఓట‌ర్ల ముసాయిదా జాబితాల్లో స‌వ‌ర‌ణ‌ల ప్ర‌క్రియ జోరుగా సాగుతోంది. డిసెంబ‌రు 15 నాటికి తుదిజాబితా వెలువ‌డ‌నుంది. దీనిని ఇక‌, ఖ‌రారు చేయ‌నున్నారు. దీంతో స‌ద‌రు జాబితాలో త‌న మ‌న అనుకున్న‌వారి ఓట్ల‌పై అధికార పార్టీ నాయ‌కులు క‌స‌ర‌త్తు ముమ్మరం చేయ‌డం.. వివాదాల‌కు దారితీస్తోంది.

ఈ క్ర‌మంలో ప‌రుచూరు నుంచి తొలిసారి పోటీ చేయ‌నున్న ఆమంచి(ఆయ‌న పార్టీ మార‌క‌పోతే) ఇప్పుడు ఓట్ల‌పై గురి పెట్టార‌ని టీడీపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు సంధిస్తున్నారు. నిజానికి చీరాల అస‌లు నియోజ‌క‌వ‌ర్గ‌మే అయిన‌ప్ప‌టికీ.. పార్టీ అధిష్టానం ఈ టికెట్‌ను టీడీపీలో గెలిచి.. వైసీపీలోకి వ‌చ్చిన క‌ర‌ణం బ‌ల‌రాంకు కేటాయించేసింది. దీంతో ఆమంచిని ప‌రుచూరుకు పంపించింది. ఈ నియోజ‌క‌వ‌ర్గం టీడీపీకి కంచుకోట‌గా ఉంది.

ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గంలో రెండు ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. ఒక‌టి వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకుంటు న్న క‌మ్మ వ‌ర్గానికి చెందిన ఏలూరి సాంబ‌శివ‌రావు, రెండు టీడీపీ రాష్ట్ర చీఫ్ పురందేశ్వ‌రిది ఇదే నియోజ క‌వ‌ర్గం. ఆమె ఇక్క‌డ నుంచి పోటీ చేయ‌క‌పోయినా.. ఇక్క‌డ వైసీపీ పాగా వేయ‌డం ద్వారా.. ఆమె దూకుడు కు చెక్ పెట్టాల‌నేది వైసీపీ నేత‌ల భావ‌న‌. ఇక‌, టీడీపీలో వ‌ర‌స‌గా గెలుస్తున్న ఏలూరిని పార్టీ మారాలంటూ ఒత్తిడి చేశారు. కానీ, ఆయ‌న ఒప్పుకోలేదు. దీంతో ఆయ‌న‌ను కూడా ఓడించాల‌నేది ఇప్పుడు పెట్టుకున్న ల‌క్ష్యం.

ఈ క్ర‌మంలోనే ఆమంచికి అన్ని విధాలా అధిష్టానం స‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తోంద‌ని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఓట‌ర్ల జాబితాల‌ను తాము చెప్పిన‌ట్టు తీర్చ‌దిద్దాల‌ని ఆమంచి మండ‌ల‌స్థాయి అధికారుల‌పై ఒత్తిడి తెస్తున్నార‌ని చెబుతున్నారు. అయితే.. కొంద‌రు అధికారులు ఆమంచి చెప్పిన‌ట్టు విన‌క‌పోవ‌డంతో వారిపై ఫిర్యాదులు చేసి.. మ‌రీ బ‌దిలీలు చేయిస్తున్నారు.

ఇప్ప‌టికి త‌మ మాట విన‌ని ఇద్ద‌రు త‌హ‌సీల్దార్ల‌ను స‌స్పెన్ష‌న్ కూడా చేయించారని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. దీంతో ఇప్పుడు ప‌రుచూరు త‌హ‌సీల్దార్‌గా వెళ్లాలంటేనే అధికారులు బెంబేలెత్తుతున్నారు. ఇక్క‌డ టీడీపీ నాయకుల‌పైనా కేసుల ప‌రంప‌ర ప్రారంభ‌మైంద‌ని చెబుతున్నారు. మొత్తానికి ఎన్నిక‌ల‌కు 100 రోజుల ముందుగానే.. ప‌రుచూరులో హైటెన్ష‌న్ నెల‌కొంది. మ‌రి ఎన్నిక‌ల నాటికి ఏం జ‌రుగుతుందో చూడాలి.