Begin typing your search above and press return to search.

భార్య పుట్టింటికి.. భర్త మిస్సింగ్.. కట్ చేస్తే పరకాలలో షాకింగ్ సీన్

మరో వివాహేతర సంబంధం.. ఇంకో భర్తను బలి తీసుకుంది. ఇటీవల కాలంలో అంతకంతకూ పెరిగిపోతున్న ఈ తరహా హత్యలకు కొనసాగింపుగా ఈ దారుణ ఉదంతాన్ని చూడాలి.

By:  Garuda Media   |   16 April 2026 10:13 AM IST
భార్య పుట్టింటికి.. భర్త మిస్సింగ్.. కట్ చేస్తే పరకాలలో షాకింగ్ సీన్
X

మరో వివాహేతర సంబంధం.. ఇంకో భర్తను బలి తీసుకుంది. ఇటీవల కాలంలో అంతకంతకూ పెరిగిపోతున్న ఈ తరహా హత్యలకు కొనసాగింపుగా ఈ దారుణ ఉదంతాన్ని చూడాలి. పుట్టింటికి వెళుతున్నట్లుగా చెప్పి.. దారిలో ప్రియుడితో కలిసి భర్తను కాటికి పంపిన వైనం హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో చోటు చేసుకుంది. కోడలు పుట్టింటికి వెళ్లిపోవటం.. ఆ తర్వాత నుంచి కొడుకు కనిపించకుండా పోవటంతో బాధితుడి తండ్రి పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులకు దిమ్మ తిరిగిపోయే హత్యోదంతాన్ని గుర్తించారు.

పరకాల పట్టణానికి చెందిన సుమన్ (35) స్థానిక రెస్టారెంట్ లో పని చేస్తుంటాడు. అతనికి భార్య లావణ్య.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉండగా కమలాపూర్ మండల పరిధిలోని వంగపల్లికి చెందిన ఒక వ్యక్తితో లావణ్యకు వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో.. వీరింట్లో పలుమార్లు గొడవలు జరిగాయి. ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితం లావణ్య తన పుట్టింటికి (జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రావులపల్లి) వెళ్లింది. ఆ తర్వాత కొద్దిరోజులకు సుమన్ ఆచూకీ లేకుండాపోవటం.. నాలుగైదు రోజులు ఎదురు చూసిన అతడి తండ్రి సాంబయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రాథమిక వివరాలు సేకరించారు. చివరకు భార్య లావణ్యపై అనుమానం రావటంతో ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో.. ఆమె అసలు నిజాన్ని ఒప్పేసుకుంది. ఈ నెల నాలుగున కొందరితో కలిసి భర్త సుమన్ పై పెట్రోల్ పోసి తగలబెట్టినట్లుగా ఒప్పుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. లావణ్య ఇచ్చిన సమాచారానికి అనుగుణంగా మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం లావణ్య ప్రియుడు.. మరో ఇద్దరు వ్యక్తులు కలిసి సుమన్ ను హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలను సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ఉదంతం స్థానికంగా పెను సంచలనంగా మారింది.