Begin typing your search above and press return to search.

''పురుష నేత‌ల‌తో గ‌డ‌ప‌కుండా.. మ‌హిళా నేత‌లు ఎద‌గ‌లేరు''

ఇప్ప‌టికే ఆల‌స్య మైన ఈ వ్య‌వ‌హారాన్ని మ‌రింత వేగంగాముందుకు తీసుకువెళ్లే దిశ‌గా పార్టీలు కూడా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నాయి. మ‌హిళ‌ల‌కు అవ‌కాశం క‌ల్పించి.. వారిని కూడా రాజ‌కీయంగా డెవ‌ల‌ప్ చేయాల‌ని భావిస్తున్నారు.

By:  Garuda Media   |   22 April 2026 8:34 AM IST
పురుష నేత‌ల‌తో గ‌డ‌ప‌కుండా.. మ‌హిళా నేత‌లు ఎద‌గ‌లేరు
X

మ‌హిళా రిజ‌ర్వేష‌న్ వ్య‌వ‌హారం.. ఒక‌వైపు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. మ‌హిళ‌ల‌కు పార్ల‌మెంటు స‌హా రాష్ట్రాల అసెంబ్లీల‌లో 33 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌న్న దిశగా.. అడుగులు వేస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఆల‌స్య మైన ఈ వ్య‌వ‌హారాన్ని మ‌రింత వేగంగాముందుకు తీసుకువెళ్లే దిశ‌గా పార్టీలు కూడా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నాయి. మ‌హిళ‌ల‌కు అవ‌కాశం క‌ల్పించి.. వారిని కూడా రాజ‌కీయంగా డెవ‌ల‌ప్ చేయాల‌ని భావిస్తున్నారు.

ఇలాంటి స‌మ‌యంలో అనూహ్యంగా బీహార్‌కు చెందిన సిట్టింగ్ ఎంపీ.. రాజేష్ రంజన్ అలియాస్‌ ప‌ప్పు యాద‌వ్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ''పార్ల‌మెంటులో అయినా.. అసెంబ్లీల‌లో అయినా.. మ‌హిళ‌లు ఎద‌గాలంటే.. పురుష నేత‌ల గ‌దుల్లో గ‌డ‌ప‌కుండా వారు ఎద‌గ‌లేరు'' అని తీవ్ర‌వ్యాఖ్య‌లు చేశారు. ''90 శాతం మంది మహిళలు పురుష నాయకుల గదుల్లో గడపకుండా తమ రాజకీయ జీవితంలో ఎద‌గ‌లేరు'' అని అన్నారు. పురుష నాయ‌కుల క‌బంద హ‌స్తాల్లో మ‌హిళ‌లు న‌లిగితేనే.. రాజ‌కీయ ఉనికి ఉంటుంద‌ని వ్యాఖ్యానించారు.

సుదీర్ఘ‌రాజ‌కీయ ప్ర‌స్థానం ఉన్న ప‌ప్పు యాద‌వ్‌.. ఆది నుంచి విమ‌ర్శ‌ల‌కు కేంద్రంగా ఉన్నారు. లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ పార్టీ ఆర్జేడీలో కీల‌క నాయ‌కుడిగా ఎదిగిన ప‌ప్పు యాద‌వ్‌.. ఎక్క‌డ పోటీ చేసినా..విజ‌యం సొంతం చేసుకున్న నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు. 1991, 1996, 1999, 2004, 2014, 2019, 2024లో ఆయ‌న విజ‌యం ద‌క్కించుకున్నారు. ప్ర‌స్తుతం పూర్నియా నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. అయితే.. నేరాలు, ఘోరాలు చేయ‌డంలో ఆయ‌న సుప్ర‌శిద్ధుడ‌నే పేరుంది. అనేక క్రిమిన‌ల్ కేసులు కూడా ఉన్నాయి.

స‌భ్య‌త్వం ర‌ద్దు చేయాలి!

మ‌హిళా నాయ‌కుల‌ను ఉద్దేశించి ఎంపీ ప‌ప్పు యాదవ్ చేసిన తీవ్ర వ్యాఖ్య‌ల‌పై దేశ‌వ్యాప్తంగా పెను దుమారం రేగింది. ఆయ‌న స‌భ్య‌త్వాన్ని త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేయాల‌ని మ‌హిళా ఎంపీలు ముక్త‌కంఠంతో డిమాండ్ చేశారు. బీహార్‌కు చెందిన మ‌హిళా నాయ‌కులు కూడా ఇదే మాట చెప్పారు. మ‌రోవైపు బీజేపీ స్పందిస్తూ.. ప‌ప్పు యాద‌వ్ వ్యాఖ్య‌లు దారుణ‌మ‌ని.. ఆయ‌న మ‌హిళా లోకానికి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేసింది. ప‌ప్పు యాద‌వ్‌కు కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తు ఉంద‌ని బీజేపీ నాయ‌కులు విమ‌ర్శించారు. ఇదిలావుంటే, బీహార్ మహిళా కమిషన్.. ఈ వ్యాఖ్య‌ల‌పై తీవ్రంగా రియాక్ట్ అయింది. పప్పు యాదవ్‌కు నోటీసులు జారీ చేసింది.