Begin typing your search above and press return to search.

పంజాగుట్ట పీఎస్ ఖాళీ... ఒకేసారి 85 మంది బదిలీ!

ఈ అరుదైన సంఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో జరిగింది!

By:  Tupaki Desk   |   31 Jan 2024 10:38 AM GMT
పంజాగుట్ట పీఎస్  ఖాళీ... ఒకేసారి 85 మంది బదిలీ!
X

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా విభాగాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయని.. భారీ స్థాయిలో ప్రక్షాళనలు జరుగుతున్నాయని కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అయ్యిందని అంటున్నారు! ఈ నేపథ్యంలో తాజాగా గతంలో ఎన్నడూ లేదు అన్నట్లుగా ఒక పోలీస్ స్టేషన్ లోని స్టాఫ్ మొత్తాన్ని ఒకేసారి ట్రాన్స్ ఫర్ చేశారు. ఈ అరుదైన సంఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో జరిగింది!

అవును... హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హైప్రొఫైల్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ లోని పోలీసుల విషయంలో... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... స్టేషన్ లోని మొత్తం పోలీసులందరినీ ఒకేసారి ట్రాన్స్ ఫర్ చేసింది. ఈ మేరకు హైదరాబాద్‌ సీపీ శ్రీనివాస్‌ రెడ్డి సంచలన నిర్ణయం ప్రకటించారు!

ఇందులో భాగంగా... పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో... స్టేషన్‌ లో పనిచేస్తున్న సీఐ, ఎస్సైల నుంచి హోంగార్డుల వరకు అందర్నీ ఒకేసారి బదిలీ చేస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు. ఇలా మొత్తం 85 మందిని బదిలీ చేస్తున్నట్లు పేర్కొన్నారు! వీరిని సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వు (ఏఆర్) ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.

గత కొంతకాలంగా ఈ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కేసుల విషయంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. బోధన్ మాజీ ఎమ్మెల్యే తనయుడి వ్యవహారంతో పాటు పలు కీలక విషయాలు బయటకి పొక్కడంపై సీఎం, సీపీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది! ఈ సమయంలో... పంజాగుట్ట పీఎస్‌ కు కొత్తగా 82 మంది సిబ్బందిని నియమించారు.

అధికారం కోల్పోయిన తర్వాత కూడా మాజీ సీఎం కేసీఅర్ నేతృత్వంలోని బీఆరెస్స్ నేతల సూచనలను పంజాగుట్ట స్టేషన్‌ సిబ్బంది తీసుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సమాచారం అందినట్లు తెలుస్తోంది. ప్రగతి భవన్‌ ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోకే వస్తుండటంతో... గతంలో తన అభిమాన పోలీసు అధికారులందరినీ కేసీఆర్ అక్కడ నియమించుకున్నారని ఆరోపణలు వచ్చాయని సమాచారం. దీంతో రేవంత్ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకుందని అంటున్నారు.

ఇదే సమయంలో... కొద్దిరోజుల క్రితం ప్రజాభవన్ గేట్లను ఢీకొన్న ఘటనలో ఆ కారు బీఆరెస్స్ మాజీ ఎమ్మెల్యే మహ్మద్‌ షకీల్‌ కుమారుడిదని, ప్రమాదం జరిగిన సమయంలో ఆయనే కారు నడుపుతున్నట్లు గుర్తించినప్పటికీ... పంజాగుట్ట పోలీసులు అతడిని తప్పించుకోవడానికి సహకరించారని, మరో డ్రైవర్‌ ను ఈ కేసులో ఇరికించారని వస్తున్న ఆరోపణలు కూడా ఇందుకు ఒక కారణం అని అంటున్నారు.

ఈ క్రమంలోనే షకీల్ కుమారుడిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ కు తీసుకొచ్చి అక్కడి నుంచి తప్పించారని.. ఫలితంగా అతడు ప్రస్తుతం గల్ఫ్ దేశాలకు పారిపోయాడని.. ఇందులో పలువురు పోలీసు ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉందని ప్రభుత్వం అనుమానించిందని తెలుస్తుంది. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.