Begin typing your search above and press return to search.

ఇది పాన్ హైవే.. 30 వేల కిలోమీటర్ల.. 14 దేశాలను కలిపే ప్రపంచంలోనే అతి పొడవైన రహదారి!

అందుకే దీన్ని పాన్ అమెరికా హైవే అని పిలుస్తారు. ఈ స్పెషల్ రోడ్డు గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

By:  Tupaki Desk   |   26 April 2025 12:00 AM IST
ఇది పాన్ హైవే..  30 వేల కిలోమీటర్ల.. 14 దేశాలను కలిపే ప్రపంచంలోనే అతి పొడవైన రహదారి!
X

ప్రస్తుతం అంతా పాన్ ఇండియా సినిమాలు, పాన్ వరల్డ్ సినిమాలంటూ ఇప్పటి వరకు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందిగా.. అయితే వీటన్నింటికంటే డిఫరెంటుగా ఎప్పుడైనా పాన్ హైవే గురించి విన్నారా? లేకపోతే ఈ కథనాన్ని పూర్తిగా చదవండి. ఈ హైవే అమెరికాలో ఉంది. ఈ రోడ్డు మార్గం ఎంత పొడవుందో తెలుసా? ఏకంగా 30 వేల 600 కిలోమీటర్లు. అంటే దాదాపు 19 వేల మైళ్ళు. ఇది 14 దేశాలను కలుపుకుంటూ పోతుంది. అందుకే దీన్ని పాన్ అమెరికా హైవే అని పిలుస్తారు. ఈ స్పెషల్ రోడ్డు గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

ప్రపంచవ్యాప్తంగా రోడ్లు, హైవేలు మనుషులను, ఊర్లని, సంస్కృతులను కలుపుతూ ఉంటాయి. ఒక దేశం బాగా డెవలప్ అవ్వాలంటే అక్కడి రోడ్డు వ్యవస్థ బాగుండాలి. అందుకే అమెరికాలో ప్రపంచంలోనే అతి పొడవైన రోడ్డు మార్గాన్నిఏర్పాటు చేశారు. దీంతో ఈ పాన్ అమెరికా హైవే రికార్డుల్లోకి ఎక్కింది.

30 వేల 600 కిలోమీటర్ల పొడవు

పాన్ అమెరికన్ హైవే అలాస్కాలో మొదలై అర్జెంటీనాలో ఎండ్ అవుతుంది. ఇది ఉత్తర అమెరికాను, దక్షిణ అమెరికాను కలుపుతుంది. ఈ రోడ్డు మార్గం దాదాపు 30,600 కిలోమీటర్ల దాకా ఉంది. ప్రపంచంలోనే అతి పొడవైన డ్రైవింగ్ చేసే రోడ్డుగా ఇది రికార్డు నెలకొల్పింది. కానీ ఒక చిన్న సమస్య ఏంటంటే.. పనామాకి, కొలంబియాకి మధ్యలో ఒక 100 కిలోమీటర్ల దట్టమైన అడవి ఉంది. దాని వల్ల ఈ రోడ్డు మొత్తం కనెక్ట్ కాలేదు. ఆ ప్లేస్‌లో వెళ్లాలంటే పడవలోనో, ఫ్లైట్‌లోనో వెళ్లాలి.

పాన్-అమెరికన్ హైవే ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికా ఖండాల్లో ఒకదానికొకటి కనెక్ట్ అయిన చాలా రోడ్ల సిస్టమ్. ఇది ప్రపంచంలోనే చాలా స్ట్రెయిట్‌గా ఉండే రోడ్లలో ఒకటి. పెద్దగా టర్నింగులు లేకుండా సూటిగా పోతుంది. ఈ రోడ్డు ఒక చివర నుంచి ఇంకో చివరకు వెళ్లాలంటే దాదాపు 60 రోజులు పడుతుంది. రోజుకు కనీసం 500 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తే గమ్యానికి చేరుకోవచ్చు.

14 దేశాలను కలుపుతూ

పాన్ అమెరికా రోడ్డు ఏకంగా 14 దేశాలను కలుపుకుంటూ పోతుంది. అవేంటంటే కెనడా, అమెరికా, మెక్సికో, గ్వాటెమాల, ఎల్ సాల్వడార్, హోండురాస్, నికరాగ్వా, కోస్టా రికా, పనామా, కొలంబియా, ఈక్వెడార్, పెరూ, చిలీ, అర్జెంటీనా. ఇది జస్ట్ ఒక రోడ్డు మాత్రమే కాదు. ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే చాలా వింతలు, మంచి మంచి ప్రకృతి దృశ్యాలు, వేర్వేరు సంస్కృతులు, పాత చరిత్రలు తెలుసుకోవచ్చు. ఈ హైవే ఎడారులు, కొండలు, పెద్ద అడవులు, సముద్ర తీరాల లాంటి చాలా రకాల వాతావరణాలు ఉన్న ప్లేసుల గుండా వెళ్తుంది.

ఈ రోడ్డు కట్టడం గురించి 1920లో మొదటిసారి చర్చలు జరిగాయి. తర్వాత 1937లో 14 దేశాలు పాన్ అమెరికన్ హైవే కన్వెన్షన్‌పై సంతకాలు చేశాయి. మొత్తానికి 1960లో ఈ రోడ్డు రెడీ అయి, వెహికల్స్ తిరగడానికి ఓపెన్ చేశారు. ఇప్పుడు ఈ రోడ్డు మీద ట్రాఫిక్ గట్రా ఏమీ లేకుండా హాయిగా వెళ్లొచ్చు. లాంగ్ డ్రైవ్‌లు అంటే ఇష్టం ఉన్నవాళ్లు ఈ రూట్‌లో వెళ్లడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు.