Begin typing your search above and press return to search.

డిసెంబర్ 31కే దీనికి చివరి గడువు.. ఆ తర్వాత ఉండబోదన్న కేంద్రం..

డిసెంబర్ 31 కొత్త సంవత్సరం ఎంట్రీ కోసం ఇయర్ ఎండ్ ప్లాన్స్ చేసుకునే సమయం కాదు.. ఆర్థిక శాఖ పెట్టిన గడువు.

By:  Tupaki Desk   |   18 Nov 2025 10:00 PM IST
డిసెంబర్ 31కే దీనికి చివరి గడువు.. ఆ తర్వాత ఉండబోదన్న కేంద్రం..
X

డిసెంబర్ 31 కొత్త సంవత్సరం ఎంట్రీ కోసం ఇయర్ ఎండ్ ప్లాన్స్ చేసుకునే సమయం కాదు.. ఆర్థిక శాఖ పెట్టిన గడువు. ఇది చేయకపోయారో.. ఇక జనవరి 1, 2026 నుంచి ఆర్థిక లావాదేవీల్లో చుక్కలు చూస్తారని కేంద్ర ఆర్థిక శాఖ హెచ్చరిస్తోంది. డిసెంబర్ 31 పాన్–ఆధార్ లింక్ చేయని ప్రతి వ్యక్తికి ఈ తేదీ ఇప్పుడు అత్యంత కీలక గడువుగా మారింది. కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టంగా చెప్పింది ఈ సారి ఎటువంటి పొడిగింపులు ఉండకపోవచ్చు, లింకింగ్ తప్పనిసరి. సంవత్సరాలుగా వాయిదాలు వేస్తూ వచ్చిన ఈ ప్రక్రియ ఇప్పుడు చివరి దశకు చేరడంతో, పాన్ ఆధార్‌తో లింక్ కాకపోతే ఆర్థిక వ్యవహారాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కాదని, నేరుగా వ్యవస్థే నిలిచిపోతుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

రెండింటినీ కలుపుతున్న కేంద్రం..

పాన్ అనేది మన ఆర్థిక గుర్తింపు. ఆధార్ మన వ్యక్తిగత గుర్తింపు. ఈ రెండు డేటాబేస్‌లు ఒకేచోట చేరాలనేది కేంద్ర ఆలోచన. కారణం స్పష్టం ట్యాక్స్ మోసాలు తగ్గాలి, డూప్లికేట్ పాన్ కార్డులు క్లోజ్ కావాలి. లావాదేవీలు పారదర్శకంగా ఉండాలి. ఇప్పటి వరకు కోట్ల మంది ఈ లింక్ పూర్తి చేశారు. కానీ ఇంకా లక్షలాది పాన్‌లు ఆధార్‌తో మ్యాప్ కాలేదన్నదే ఆందోళన కేంద్ర ప్రభుత్వంలో ఉంది.

లింక్ చేయనివారికి సమస్యలు తీవ్రంగా ఉంటాయని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. బ్యాంకు ఖాతాల్లో పెద్ద మొత్తాల లావాదేవీలు, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్లు, స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్, డీమ్యాట్ సర్వీసులు.. ఇలా అనేక ముఖ్యమైన సేవలన్నీ అడ్డంకులు ఎదుర్కొంటాయి. వెంటనే పాన్ ‘ఇనాక్టివ్’ గా మారుతుంది. పాన్ నంబర్ ఉండి ఉపయోగించలేని పరిస్థితి వస్తుంది. ఈ విపరీతమైన ప్రభావం ఎందుకు? ఎందుకంటే ఆర్థిక శాఖ స్పష్టం చేస్తోంది లింక్ చేయని పాన్ అనేది వ్యవస్థకు ప్రమాదకరం.

భవిష్యత్ లావాదేవీలకు ఇదే ప్రధాన ఆధారం..

ఇది కేవలం ఆర్థిక నియంత్రణ సమస్య మాత్రమే కాదు. ఇది భవిష్యత్తులో డిజిటల్ లావాదేవీల్లో విశ్వసనీయతను నిలబెట్టుకునే అంశం కూడా. ప్రపంచం కంటే వేగంగా మన దేశం డిజిటల్ బ్యాంకింగ్ వైపు పరుగులు పెడుతుంది. కానీ వ్యక్తిగత డేటాను ఒకేచోట సమన్వయం చేయకపోతే, పాత వ్యవస్థలతో ముందుకు సాగడం అసాధ్యం. అందుకే కేంద్రం ఈ ఆదేశం విషయంలో ఈ సారి మరింత కఠినంగా వ్యవహరిస్తున్నదన్న సందేశం స్పష్టంగా కనిపిస్తోంది.

ఎంతో మంది చివరి రోజునే చేసుకుంటామంటూ నిర్లక్ష్యంగా ఉన్నా, ఈసారి ఆ అవకాశం ఉండకపోవచ్చు. సర్వర్లు నెమ్మదిగా ఉండడం, OTP సమస్యలు, ఆధార్ వివరాల్లో తప్పులు.. ఇవన్నీ చివరి నిమిషంలో మరింత కష్టాలు తెచ్చే అవకాశం ఉంది. అదీ కాకుండా, ఎన్నిసార్లు పొడిగించారన్న భావనతో కేంద్రం కూడా ఈసారి మరొక వాయిదా ఇవ్వబోదన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడీ గడువు కేవలం ఒక అధికారిక తేదీ కాదు. మన ఆర్థిక జీవన రేఖ నిలిచిపోకుండా చూసుకోవాల్సిన చివరి మలుపు. ‘తర్వాత చూద్దాం’ అనే అలవాటు ఇక పని చేయదు. పాన్–ఆధార్ లింక్ చేయడం ఇప్పుడు ఒక తప్పనిసరి బాధ్యత. దాన్ని పూర్తి చేయడం ప్రతి పన్ను చెల్లింపుదారుడి భద్రతకే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థ సక్రమంగా సాగేందుకు కూడా అవసరం.