Begin typing your search above and press return to search.

దేవుడికి మానవత్వం లేదు... బిడ్డకు జన్మనిచ్చిన ఆస్పత్రికే భర్త మృతదేహం!

పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన ఒక మహిళకు పురిటి నొప్పులు రావడంతో.. శుక్రవారం రాత్రి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు.

By:  Tupaki Desk   |   21 Oct 2023 8:15 AM GMT
దేవుడికి మానవత్వం లేదు... బిడ్డకు జన్మనిచ్చిన ఆస్పత్రికే భర్త మృతదేహం!
X

కొన్ని సంఘటనల గురించి విన్నప్పుడు దేవుడి అసలు మనవత్వమే లేదు అని అనాలనిపిస్తుంటుందని అంటారు. దైవత్వం సంగతి దేవుడెరుగు, కనీసం ఆ దేవుడికి మానవత్వమైనా ఉండాలిగా అని ఫైరవుతుంటారు. కానీ... దేవుడా, విధా, ప్రకృతా అనే సంగతి కాసేపు పక్కనపెడితే తాజాగా జరిగిన ఒక సంఘటన మాత్రం.. విన్న ప్రతి ఒక్కరితోనూ కంటతడి పెట్టిస్తుందని మాత్రం చెప్పొచ్చు. అంత దారుణమైన సంఘటన తాజాగా పల్నాడు జిల్లాలో జరిగింది.

అవును... గర్భిణిగా ఉన్న ఒక మహిళకు పురిటి నొప్పులు రావడంతో సమీప ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు.. అక్కడ సరైన సదుపాయాలు లేవని మరో ఆసుపత్రికి తోడుకుని వెళ్లారు. అక్కడ కూడా సరైన సదుపాయాలు లేక టౌన్ లోని మరో హాస్పటల్ కు తరలించారు. ఈ సమయంలో ఆ మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అంతలోనే ప్రమాదంలో మృతి చెందిన అమె భర్త మృతదేహం అదే హాస్పటల్ లో ప్రత్యక్షమైంది!

వివరాళ్లోకి వెళ్తే... బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా... అని దేవుడిని నిలదీయాలనిపించే సంఘటన తాజాగా పల్నాడు జిల్లాలో జరిగింది. పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన ఒక మహిళకు పురిటి నొప్పులు రావడంతో.. శుక్రవారం రాత్రి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అయితే... పీహెచ్సీ లో డెలివరీ చేయడం కంటే... గురజాల ప్రభుత్వాస్పత్రికి వెళ్తే మరిన్ని సౌకర్యాలు ఉంటాయని వైద్యులు సూచించారట.

దీంతో... ఆమెను గురజాల ఆస్పత్రికి వెళ్లారు. అనంతరం మరిన్ని వైద్య సదుపాయాలకోసం నరసారావుపేట ప్రభుత్వాస్పత్రికి వెళ్లమని వైద్యులు సిఫార్సు చేశారు. దీంతో... ఆ మహిళను నరసరావుపేట ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆ మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారని అంటున్నారు.

ఈ సమయంలో కారంపూడి నుంచి గురజాల వరకు తోడుగా వచ్చిన ఆమె భర్త.. కాస్త పెద్ద ఆస్పత్రికి వెళ్తుండటం వల్ల ఇంటికి వెళ్లి డబ్బులు తెస్తానని బయలుదేరాడు. దీంతో... బైక్‌ పై ఇంటికి వెళ్లి డబ్బులు తీసుకుని నరసరావూపేట ఆస్పత్రికి బయలుదేరాడంట. ఈ సమయంలోనే దారుణం జరిగిపోయింది. మార్గమధ్యంలో జోలకల్లు వద్ద రహదారిపై ఉన్న పెద్ద గుంతలో పడిపోయాడు.

దీంతో... తీవ్రంగా గాయపడిన అతడిని గమనించిన స్థానికులు నరసారావుపేటకు తరలించారు. ఈ క్రమంలో... ఆస్పత్రి వద్దకు చేరగానే.. బిడ్డను చూడకముందే అతను కన్నుమూశారు. దీంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులో కన్నీరూ మున్నీరవుతున్నారు. ఇంత ఘోరామా దేవుడా అని ఆవేదన చెందుతున్నారు.