Begin typing your search above and press return to search.

రంగంలోకి దిగిన పల్లా

జనగామ నియోజకవర్గంపై ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కన్నేశారు. టికెట్ కోసం ప్రయత్నాలు గట్టిగానే మొదలెట్టారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే నుంచి తీవ్రమైన పోటీ

By:  Tupaki Desk   |   28 Sep 2023 8:45 AM GMT
రంగంలోకి దిగిన పల్లా
X

జనగామ నియోజకవర్గంపై ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కన్నేశారు. టికెట్ కోసం ప్రయత్నాలు గట్టిగానే మొదలెట్టారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే నుంచి తీవ్రమైన పోటీ. దీంతో ఇన్ని రోజులూ టికెట్ దక్కుతుందో లేదోననే ఆందోళన. కానీ పార్టీ అధినేత తన వైపే మొగ్గుచూపడంతో ఇప్పుడు ఆ నాయకుడు ప్రచారానికి తెరతీశారు. ఆయనే.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. జనగామ టికెట్ తనకే ఖాయమవడంతో నియోజకవర్గంలో ప్రచారంపై పల్లా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, పార్టీ ప్రజాప్రతినిధులతో పల్లా వరుసగా భేటీ అవుతున్నారు.

జనగామలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి టికెట్ వస్తుందని ఆయన ఆశపడ్డారు. కానీ పల్లా రాజేశ్వర్ రెడ్డి రంగంలోకి దిగడంతో కథ మలుపు తిరిగింది. పల్లాకే టికెట్ వస్తుందనే అంచనాతో ముత్తిరెడ్డి బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. కానీ పల్లానే నిలబెట్టాలని భావించిన కేసీఆర్.. ముత్తిరెడ్డిని బుజ్జగించారు. కేసీఆర్, కేటీఆర్ నచ్చజెప్పడంతో ముత్తిరెడ్డి శాంతించారు.

ఇప్పుడు జనగామ టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికే ఖరారైందని చెప్పాలి. దీనిపై మంగళవారం (సెప్టెంబర్ 26న) కేసీఆర్ అధికారిక ప్రకటన చేస్తారని అనుకున్నారు. కానీ జ్వరం కారణంగా కేసీఆర్ అస్వస్థతకు గురి కావడంతో ఇది వాయిదా పడింది. కానీ పల్లాకు మాత్రం టికెట్ విషయంపై సమాచారం అందిందని తెలిసింది. నియోజకవర్గంలో ప్రచారం కోసం ఏర్పాట్లు చేసుకోవాలని పల్లాకు బీఆర్ఎస్ అధిష్ఠానం నుంచి ఆదేశాలు వచ్చాయని సమాచారం. దీంతో నియోజకవర్గంలోని కీలక నేతలను పల్లా కలుస్తున్నారు. జనగామ జడ్పీ ఛైర్మన్ సంపత్ రెడ్డి, మున్సిపల్ ఛైర్ పర్సన్ జమునతో పాటు కౌన్సిలర్లు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు తదితర నాయకులను పల్లా కలుస్తున్నారు. టికెట్ పై అధికారిక ప్రకటన రాగానే జనగామలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పల్లా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.