పల్లాకు ఇది చాలునా... ఇంకా కావాలా ?
ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు పుట్టిన రోజు మే 12. దాంతో పార్టీ క్యాడర్ అంతా ఆనందంగా ఆయన జన్మ దిన వేడుకలను జరుపుతున్నారు.
By: Tupaki Desk | 12 May 2025 12:30 PMఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు పుట్టిన రోజు మే 12. దాంతో పార్టీ క్యాడర్ అంతా ఆనందంగా ఆయన జన్మ దిన వేడుకలను జరుపుతున్నారు. పల్లా టీడీపీలో సీనియర్ నేత, రెండు సార్లు గాజువాక నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. ఇక ఈసారి గెలిస్తే మంత్రి పదవి కచ్చితంగా దక్కుతుందని అంతా భావించారు.
ఆయనకు వచ్చిన భారీ మెజారిటీ అలాంటిది మరి. ఏపీలోనే అత్యధిక మెజారిటీ గాజువాకలో తెచ్చుకున్నారు. అయితే ఆయనకు మంత్రి పదవి కాకుండా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవిని ఇచ్చారు. నిజానికి పార్టీ పదవి మంచిదే. కానీ ప్రాంతీయ పార్టీలలో స్టేట్ ప్రెసిడెంట్ అయినా ఆరవ వేలు లాంటిదే అని అంటారు.
ఇక జాతీయ పార్టీలలో అయితే స్టేట్ ప్రెసిడెంట్ అంటే సొంతంగా చక్రం తిప్పే చాన్స్ ఉంటుంది. అది కూడా పార్టీ విపక్షంలో ఉన్నపుడు విలువ ఎక్కువ. అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రికే ఆ గౌరవం. దాంతో టీడీపీలో పల్లాకు ముందు కిమిడి కళా వెంకట్రావు అచ్చెన్నాయుడు వంటి వారు ఈ పదవులు చేసినా పెద్దగా వారికి పని లేదని అంటున్నారు. ఏదో పేరుకు మాత్రమే ఈ పదవి అని అంటున్న వారూ ఉన్నారు.
అన్ని విషయాలూ చంద్రబాబు లోకేష్ చూసుకుంటారు అని అంటారు. అందుకే మంత్రి పదవి తమ నాయకుడికి కావాలని క్యాడర్ గట్టిగా కోరుకుంటోంది. విశాఖ జిల్లాలో యాదవ సామాజిక వర్గం బలంగా ఉంది. ఇటీవలనే వైసీపీకి చెందిన మేయర్ ని దించేసీ కూటమి మేయర్ ని గద్దెనెక్కించారు. దాంతో యాదవ సామాజిక వర్గానికి చెందిన వారిని తప్పించారు అని ఆ సామాజిక వర్గం నేతలు గుస్సా మీద ఉన్నారు.
దానిని పరిహారంగా పల్లాకు మంత్రి పదవి ఇస్తే వారిలో అసంతృప్తి లేకుండా పోతుందని అంటున్నారు. ఆ మధ్య మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయని చర్చ వచ్చింది. అపుడు పల్లా పేరు బాగా నలిగింది. ఇక చూస్తే కూటమి పాలన ఏడాది పూర్తి అయిన సందర్భంగా స్వల్ప స్థాయిలో అయినా మార్పులు ఉంటాయని అంతా భావిస్తున్నారు. అలా చూస్తే పల్లాకు గ్యారంటీగా మంత్రి పదవి అని అంటున్నారు.
విశాఖ జిల్లాలో మంత్రి పదవి ఎవరికీ ఇవ్వలేదు. మొత్తం ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటే కూటమి నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీ నుంచి నలుగురు ఉన్నారు. దాంతో ఈసారి విశాఖకు చోటు కల్పిస్తారు అని అది పల్లాకే ఇస్తారని అంటున్నారు.
పార్టీ పట్ల విధేయతతో ఉంటూ చంద్రబాబు లోకేష్ ల దగ్గర మంచి మార్కులు సాధిచిన పల్లాకు ఎపుడు విస్తరణ జరిగినా కేబినెట్ బెర్త్ ఖాయమని అంటున్నారు. అందుకే ఆయన పుట్టిన రోజున అభిమానులు అంతా ఒక్కటే అంటున్నారు. మా నాయకుడు ఉన్నత పదవులు సమీప భవిష్యత్తులో అధిరోహిస్తారు అని. మరి ఈ ఏడాదికి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా ఉన్న పల్లా వచ్చే ఏడాదికి మినిస్టర్ గా తన బర్త్ డేని ధూం ధాం గా చేసుకుంటారా అంటే వెయిట్ అండ్ సీ.