అన్న గారు మెచ్చిన నేత ఆయన !
విశాఖ జిల్లా రాజకీయాలలో ఆయన ఒక దిగ్గజ నేత. వ్యక్తిగతంగా చూస్తే సంపూర్ణమైన జీవితాన్ని ఆయన చూశారు.
By: Tupaki Desk | 8 Jun 2025 11:57 PM ISTవిశాఖ జిల్లా రాజకీయాలలో ఆయన ఒక దిగ్గజ నేత. వ్యక్తిగతంగా చూస్తే సంపూర్ణమైన జీవితాన్ని ఆయన చూశారు. ఆయనే మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం. ఆయన తొంబై మూడేళ్ళ వయసులో శనివారం విశాఖలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆదివారం ఆయన అంత్యక్రియలు అధికార లాంచనాలతో జరిగాయి. పల్లా భౌతిక కాయం వెంట వేలాదిగా జనం తరలి రావడంతో ఆయన సాధించిన అభిమాన సంపద ఏంటి అన్నది కళ్ళకు కట్టింది.
పల్లా సిం హాచలం ఏపీ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కి తండ్రి. ఇక ఆయన రాజకీయ ప్రస్థానం చూసుకుంటే కాంగ్రెస్ నుంచి ఆరంభమైంది. విశాఖ జిల్లాలో ఆయన పాత తరం నాయకుడు, దివంగత కాంగ్రెస్ నేత ద్రోణంరాజు సత్యనారాయణ సహచరుడిగా ఉంటూ వచ్చారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో బలమైన యాదవ సామాజిక వర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఆయన 1983లో కాంగ్రెస్ నుంచి అప్పటి విశాఖ టూ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. అలా టీడీపీ అభ్యర్ధిని ఢీ కొట్టి స్వల్ప తేడాతో ఓటమి పాలు అయ్యారు.
ఆనాడు టీడీపీ ప్రభంజనాన్ని సైతం తట్టుకుని తనకంటూ ఉన్న బలాన్ని చూపించిన పల్లా 1984లో టీడీపీలో చేరారు. ఆయన బలాన్ని చూసి అన్న గారు సైతం ముచ్చట పట్టారు. ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పించారు. అదే టీడీపీ నుంచి తర్వాత కాలంలో పల్లా సింహాచలం గెలిచారు.
టీడీపీలో ఎన్టీఆర్ చంద్రబాబు ఇద్దరి మెప్పు మన్ననలు అందుకున్న పల్లా వివాదరహితుడిగా జీవితాన్ని కొనసాగించారు. ప్రత్యేకించి ఆయన కార్మిక నాయకుడిగా విశాఖలో గుర్తింపు పొందారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలలో కార్మిక సంఘాల పక్షాన నాయకత్వం వహించి ఎన్నో సమస్యలకు పరిష్కారం కనుగొన్నారు.
ఇక తెలుగుదేశం పార్టీకి అతి పెద్ద సామాజిక వర్గాన్ని ఓటు బ్యాంక్ గా శాశ్వతంగా చేయడంలో పల్లా పోషించిన పాత్ర ఎనలేనిది అని అంతా గుర్తు చేసుకుంటున్నారు. పల్లా సింహాచలం స్థానిక నాయకుడు. విశాఖ మూల వాసి.
ఆయన మరణంతో ఒక తరం ఒక శకం అంతరించింది అని అంతా అంటున్నారు. సాధారణ సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా నిలిచి గెలిచిన పల్లా సింహాచలం వర్తమాన రాజకీయ నేతలకు ఆదర్శప్రాయంగా ఉంటుందని అంటున్నారు. ఆయన వారసుడిగా పల్లా శ్రీనివాస్ సైతం అదే విధానం కొనసాగిస్తున్నారు. పల్లా సింహాచలం మరణంతో విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా తీరని లోటు అని అంటున్నారు. ఆయనకు అధికార లాంచనలతో అంత్యక్రియలు జరిపించడం ద్వారా తెలుగుదేశం రుణం తీర్చుకుంది.
