Begin typing your search above and press return to search.

ఆహార పొట్లాల కోసం ఎదురు చూస్తున్నవారిపై ఘోరం.. 112 మంది కాల్చివేత!

మృత్యువాత పడినవారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉండటం అందరిని కలవరపరుస్తోంది

By:  Tupaki Desk   |   1 March 2024 6:11 AM GMT
ఆహార పొట్లాల కోసం ఎదురు చూస్తున్నవారిపై ఘోరం.. 112 మంది కాల్చివేత!
X

ఇజ్రాయెల్‌ – హమాస్‌ యుద్ధంలో ఏ పాపం ఎరుగని అమాయకులు బలవుతున్నారు. తమ పౌరులను హమాస్‌ ఉగ్రవాద సంస్థ చంపినందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ .. పాలస్తీనియన్లపై చేస్తున్న దాడిలో ఇప్పటికే 30 వేల మందికి పైగా మరణించారు. ఎంతోమంది తీవ్ర గాయాలపాలయ్యారు. మృత్యువాత పడినవారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉండటం అందరిని కలవరపరుస్తోంది. హమాస్‌ లో చివరి ఉగ్రవాదిని చంపేవరకు ఈ యుద్ధాన్ని ఆపేది లేదని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతనాహ్యూ భీష్మించుకు కూర్చొన్నారు. యుద్ధాన్ని ఆపాలని అమెరికా సహా పలు దేశాలు కోరుతున్నా ఆయన పట్టించుకోవడం లేదు.

కాగా పాలస్తీనా భూభాగంలో ఉన్న గాజాలో తాజాగా దారుణం చోటు చేసుకుంది. యుద్ధంలో సర్వం కోల్పోయి ఉండటానికి ఇల్లు, తింటానికి తిండి లేక అంతర్జాతీయ సాయం కోసం పొట్టచేతబట్టుకుని అర్ధిస్తున్న అభాగ్యులపైకి ఇజ్రాయెల్‌ తుపాకీ గుళ్లతో విరుచుకుపడింది. తాజాగా పశ్చిమ గాజాలో ఇజ్రాయెల్‌ జరిపిన ఈ అమానవీయ దారుణ దాడి ఘటనలో 112 మందికిపైగా పాలస్తీనియన్లు మృత్యువాత పడ్డారు. వీరిలో 66 మంది మహిళలు, చిన్నారులే ఉండటం అందరిలో విషాదాన్ని నింపింది. మరో 760కిపైగా గాయపడ్డారు.

కాగా మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మానవత్వాన్ని కాలరాస్తూ ఇజ్రాయెల్‌ చేసిన పనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పశ్చిమ గాజాలోని షేక్‌ అజ్లీన్‌ ప్రాంతంలోని హరౌన్‌ అల్‌ రషీద్‌ వీధి ఈ రక్తపుటేళ్లకు సాక్షీభూతమైంది. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం.. రోజుల తరబడి సరైన తిండిలేక అలమటించిపోతున్న పాలస్తీనియన్లకు పంచేందుకు ఆహార పొట్లాలు, సరుకు నిండిన ట్రక్కులు అల్‌ రషీద్‌ వీధికొచ్చాయి. అప్పటికే వందలాదిగా అక్కడ వేచి ఉన్న పాలస్తీనియన్లు ఆకలితో ట్రక్కుల చుట్టూ గుమికూడారు. ఇజ్రాయెల్‌ సైన్యం పర్యవేక్షణలో ట్రక్కుల నుంచి ఆహార పంపిణీ జరగాల్సి ఉంది.

అయితే క్యూ వరసల్లో నిల్చున్న వ్యక్తులను కాదని చాలా మంది ట్రక్కులపైకి ఎగబడ్డారు. గోధుమ పిండి, క్యాన్లలో ప్యాక్‌ చేసిన ఆహారాన్ని స్వాహా చేశారు. దీంతో పరిస్థితి అదుపు తప్పి గందరగోళం నెలకొంది. తోపులాట, తొక్కిసలాట చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇజ్రాయెల్‌ బలగాలు పాలస్తీనియన్లపైకి తుపాకీలతో కాల్పులు జరిపాయి.

తుపాకీ కాల్పుల్లో 112 మంది ఇజ్రాయెల్‌ తుపాకి గుళ్లకు బలయ్యారు. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. ప్రజల లూటీ నుంచి తప్పించుకునేందుకు ట్రక్కులు ముందుకు కదలడంతో వాటి కింద పడి కొందరు మరణించారని వార్తలొచ్చాయి.

తాజా దాడితో ఇప్పటివరకు ఇజ్రాయెల్‌ భూతల, గగనతల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పాలస్తీనియన్ల సంఖ్య 30,000 దాటింది. క్షతగాత్రుల సంఖ్య 70,457 దాటింది.