Begin typing your search above and press return to search.

చుక్కులు చూపించిన పాలమూరులోని ఆ డివిజన్ రీకౌంటింగ్

మున్సిపాల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం నుంచే వెలువడటం తెలిసిందే.

By:  Garuda Media   |   15 Feb 2026 12:11 PM IST
చుక్కులు చూపించిన పాలమూరులోని ఆ డివిజన్ రీకౌంటింగ్
X

మున్సిపాల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం నుంచే వెలువడటం తెలిసిందే. అయితే.. ఒక వార్డుకు సంబంధించిన ఓట్ల లెక్కింపు అధికారులకు చుక్కలు కనిపించేలా చేశాయి. ఆ వార్డు ఓట్ల లెక్కింపులో చోటు చేసుకున్న పరిణామాలతో శనివారం తెల్లవారుజాము మూడు గంటల వరకూ సాగుతూనే ఉంది. చివరకు ఫలితం ఒక కొలిక్కి వచ్చినా.. ఓట్ల లెక్కింపు వేళ అధికారుల సహనానికి పరీక్షగా మారటమే కాదు.. బరిలో నిలిచిన అభ్యర్థులు ఆశ..నిరాశ మధ్య కొట్టుమిట్టాడే పరిస్థితి. చివరకు విజయం బీజేపీ అభ్యర్థికి వరించింది. ఇంతకూ ఆ వార్డు ఏంటి? ఇంతలా టెన్షన్ పుట్టించిన వైనం ఎందుకు చోటు చేసుకుంది? అన్న విషయంలోకి వెళితే..

పాలమూరు కార్పొరేషన్ పరిధిలో 53వ డివిజన్ కు సంబంధించిన ఓట్ల లెక్కింపు అధికారులకు.. రాజకీయ నేతలకు పరీక్షగా మారింది. విజయం కాంగ్రెస్.. బీజేపీ మధ్య దోబూచులాడటం.. పరిస్థితి సున్నితంగా మారటంతో.. ప్రతి ఓటు ఎంతో విలువైనదిగా మారింది.ఇరువురు అభ్యర్థుల మధ్య ఒకే ఒక్క ఓటు తేడా రావటంతో విజయాన్ని తమ ఖాతాలోవేసుకునేందుకు ఇరువురు అభ్యర్థులు ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా చూసే పరిస్థితి.

తొలిసారి ఓట్ల లెక్కింపు పూర్తైన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి రాఘవేందర్ ఒక్క ఓటు మెజార్టీతో బీజేపీ అభ్యర్థి రమేశ్ కుమార్ పై విజయం సాధించినట్లుగా తేల్చారు. రాఘవేందర్ కు 816 ఓట్లు రాగా.. రమేశ్ కుమార్ కు 815 ఓట్లు వచ్చినట్లుగా లెక్క కట్టారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ అభ్యర్థి రీకౌంటింగ్ కు డిమాండ్ చేయగా.. అధికారులు చేయలేదు. దీంతో.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం కాంగ్రెస్.. బీజేపీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లను మాత్రమే లెక్కించారు. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థికి 2 ఓట్లు పెరిగాయి. దీంతో మొత్తంఓట్ల సంఖ్య 818కి చేరగా.. అనూహ్యంగా బీజేపీ అభ్యర్థికి నాలుగు ఓట్లు పెరిగాయి. దీంతో ఆయనకు వచ్చిన ఓట్ల సంఖ్య 819కి పెరిగింది.

అంటే.. రెండోసారి ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థికి ఒక ఓటు అధిక్యత వచ్చింది. దీంతో ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి రీకౌంటింగ్ కు డిమాండ్ చేశారు. కేవలం తమ ఇద్దరి ఓట్లే కాకుండా 53వ డివిజన్ లో పోటీలో ఉన్న అందరి అభ్యర్థుల ఓట్లను లెక్కించాలనిడిమాండ్ చేశారు. దీంతో అధికారులు నిబంధనలకు అనుగుణంగా ఇదే చివరి అవకాశమని.. ఫలితం ఎలా వచ్చినా అంగీకరించాలని స్పష్టం చేశారు. అందుకు ఇద్దరు అభ్యర్థులు ఒప్పుకున్నారు

దీంతో మూడోసారి కౌంటింగ్లో బీజేపీ అభ్యర్థికి 819 ఓట్లు.. కాంగ్రెస్ అభ్యర్థికి 818 ఓట్లు వచ్చాయి. చివరకు ఒక్క ఓటు తేడాతో బీజేపీ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మీద విజయం సాధించారు. ఈ నాటకీయ పరిణామాలతో శుక్రవారం ఉదయం మొదలైన ఓట్ల లెక్కింపు శనివారం తెల్లవారుజామున మూడు గంటల వరకు సాగింది. ఎట్టకేలకు ఓట్ల లెక్కింపు ముగించి.. బీజేపీ అభ్యర్థి రమేశ్ కుమార్ ఒక్క ఓటు మెజార్టీతో విజయం సాధించినట్లుగా అధికారులు ధ్రువీకరణ పత్రాన్ని అందజేయటం గంటల పాటు సాగిన టెన్షన్ తీరినట్లైంది.