Begin typing your search above and press return to search.

విశాఖ తీరంలో పాక్‌ జలాంతర్గామి కలకలం!

ఈ నేపథ్యంలో «ఘాజీ లక్ష్యం ఏంటో ముందు తెలుసుకున్న భారత్‌ ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ ను అండమాన్‌ నికోబార్‌ దీవులకు పంపింది. విశాఖ తీరంలో దీని స్థానంలో ఐఎన్‌ఎస్‌ రాజ్‌ పుత్‌ ను దింపింది.

By:  Tupaki Desk   |   23 Feb 2024 10:34 AM GMT
విశాఖ తీరంలో పాక్‌ జలాంతర్గామి కలకలం!
X

విశాఖపట్నం సముద్ర తీరంలో తాజాగా పాకిస్థాన్‌ జలాంతర్గామికి చెందిన శకలాలు కనిపించడం హాట్‌ టాపిక్‌ గా మారింది. భారత నౌకాదళం తాజాగా వీటిని గుర్తించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భారత నౌకాదళం వీటిని గుర్తించింది. ఈ జలాంతర్గామి శకలాలు 1971లో జరిగిన ఇండియా–పాకిస్థాన్‌ యుద్ధం నాటివని తెలుస్తోంది.

1971లో మనకు, పాకిస్థాన్‌ కు జరిగిన యుద్ధంలో బంగాళాఖాతంలోకి పాకిస్థాన్‌ కు చెందిన పీఎన్‌ఎస్‌ ఘాజీ జలాంతర్గామి ప్రవేశించింది. డీజిల్‌ ఎలక్ట్రిక్‌ సబ్‌ మెరైన్‌ అయిన పీఎన్‌ఎస్‌ ఘాజీ అమెరికా నౌకాదళానికి చెందినది. అమెరికా 1963లో దీన్ని పాకిస్థాన్‌ కు లీజుకు ఇచ్చింది.

ఈ క్రమంలో 1971లో భారత్‌–పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు రగిలిన వెంటనే.. నవంబర్‌ 14న కరాచీ పోర్టు నుంచి బయల్దేరి దాదాపు 3,000 కి.మీ. పైగా ప్రయాణించి శ్రీలంక మీదుగా పీఎన్‌ఎస్‌ ఘాజీ వైజాగ్‌ తీరానికి చేరింది. ఆ సమయంలో భారత్‌ వద్ద ఉన్న ఏకైక విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ ను ధ్వంసం చేయాలన్నదే ఘాజీ లక్ష్యం.

ఈ నేపథ్యంలో «ఘాజీ లక్ష్యం ఏంటో ముందు తెలుసుకున్న భారత్‌ ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ ను అండమాన్‌ నికోబార్‌ దీవులకు పంపింది. విశాఖ తీరంలో దీని స్థానంలో ఐఎన్‌ఎస్‌ రాజ్‌ పుత్‌ ను దింపింది. అది విమానవాహక నౌక వలే భారీ సిగ్నల్స్‌ వదలడం మొదలుపెట్టింది. వీటిని గుర్తించిన ఘాజీ.. రాజ్‌ పుత్‌ నే విక్రాంత్‌ గా భావించి దాడి చేయడానికి సిద్ధమైంది.

ఈ క్రమంలో డిసెంబర్‌ 3–4 తేదీల అర్ధరాత్రి సముద్రంలో రేగిన అలజడిని రాజ్‌ పుత్‌ గుర్తించింది. పాక్‌ సబ్‌ మెరైన్‌ ఘాజీయే ఇందుకు కారణమని ధ్రువీకరించుకుంది. అనంతరం అక్కడ రెండు ఛార్జెస్‌ను నీటిలోకి వదిలింది. అదే సమయంలో జలాల్లో భారీ పేలుడు జరిగి ఘాజీ నీట మునిగిపోయింది. దీంతో అందులో 92 మంది పాక్‌ సిబ్బంది హతమయ్యారు. ఆ జలాంతర్గామి శకలాలు ఇప్పటికీ వైజాగ్‌ సమీపంలోని సముద్రం అడుగున కూరుకుపోయి ఉన్నాయి. పాక్‌ మాత్రం అంతర్గత పేలుడు వల్లే ఇది మునిగిపోయిందని చెబుతోంది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు లభించిన శకలాలు ఘాజీకి చెందినవేనని నౌకాదళంలోని జలాంతర్గామి రక్షణ విభాగానికి చెందిన సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. భారత నౌకాదళం అమ్ములపొదిలోకి సరికొత్తగా చేరిన ‘ది డీప్‌ సబ్‌ మెర్జెన్స్‌ రెస్క్యూ వెహికల్‌ (డీఎస్‌ఆర్‌వీ) సాయంతో ఘాజీ శకలాలను కనుగొన్నామని ఆయన వెల్లడించారు. తాము డీఎస్‌ఆర్‌వీ సాయంతో ఘాజీ శకలాలను గుర్తించామని తెలిపారు. విశాఖ తీరానికి కేవలం కొన్ని నాటికల్‌ మైళ్ల దూరంలోనే సముద్ర గర్భాన ఘాజీ శకలాలు ఉన్నాయన్నారు. యుద్ధంలో చనిపోయిన వారిని గౌరవించడం మన నౌకాదళ ఆచారమని వెల్లడించారు. అందుకే ఇన్నాళ్లూ ఆ శకలాలను తాకలేదని వివరించారు. విశాఖ తీరానికి 2 నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలోని సముద్ర జలాల్లో 100 మీటర్ల లోతున ఘాజీ శకలాలు ఉన్నాయంటున్నారు.

ఇక డీఎస్‌ఆర్‌వీ టెక్నాలజీ విషయానికొస్తే.. సముద్ర గర్భంలో ప్రయాణించే జలాంతర్గాములకు అనువైన మార్గాలను దీని ద్వారా గుర్తిస్తారని అంటున్నారు. సముద్ర గర్భంలో పరిస్థితిని అంచనా వేసి.. ఉపరితలంపై పరిస్థితులను పరిశీలించి జలాంతర్గాములను మ్యాపింగ్‌ చేస్తారని చెబుతున్నారు. సముద్ర గర్భంలో లోతుకు వెళ్లే కొద్దీ తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని.. 650 మీటర్ల దిగువకు వెళ్లి డీఎస్‌ఆర్‌వీ టెక్నాలజీ పనిచేస్తుందని అంటున్నారు.

2013లో ఇండియన్‌ నేవీకి చెందిన ఐఎన్‌ఎస్‌ సింధ్‌ రక్షక్‌ ప్రమాదానికి గురై 13 మంది మరణించడంతో భారత్‌ నౌకాదళం డీఎస్‌ఆర్‌వీ టెక్నాలజీని ప్రవేశపెట్టింది. 2018లో తొలిసారిగా దీన్ని వాడుకలోకి తెచ్చింది. దీని ద్వారా ప్రమాదానికి గురైన నౌకలు, జలాంతర్గాములను గుర్తిస్తోంది. తద్వారా చర్యలు చేపడుతుంది. డీఎస్‌ఆర్‌వీ టెక్నాలజీని భారతదేశ తూర్పు, పశ్చిమ తీరాల్లో వాడుతున్నారు. ఈ టెక్నాలజీని నౌకలు లేదా విమానాల్లో తరలించవచ్చని చెబుతున్నారు. ఇటువంటి సాంకేతికత ప్రపంచంలో ప్రస్తుతం భారత్‌ సహా 12 దేశాల వద్ద మాత్రమే ఉండటం గమనార్హం.

ఈ నేపథ్యంలో విశాఖలోని హిందూస్థాన్‌ షిప్‌ యార్డ్‌ లో ఇలాంటివి మరో రెండింటిని దేశీయంగా తయారు చేయడంపై భారత్‌ దృష్టి సారించింది.