Begin typing your search above and press return to search.

దాయాది దేశంలో ఇందులోనూ ఇంకా అనిశ్చితే!

క్రికెట్‌ లో అనిశ్చితికి మారుపేరుగా పాకిస్థాన్‌ ను చెబుతుంటారు. ఆ దేశం ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికీ తెలియదు కాబట్టి.

By:  Tupaki Desk   |   19 Feb 2024 8:47 AM GMT
దాయాది దేశంలో ఇందులోనూ ఇంకా అనిశ్చితే!
X

క్రికెట్‌ లో అనిశ్చితికి మారుపేరుగా పాకిస్థాన్‌ ను చెబుతుంటారు. ఆ దేశం ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికీ తెలియదు కాబట్టి. ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటులోనూ ఇలాగే అనిశ్చిత కొనసాగుతుండటం విశేషం. భారత్‌ దాయాది దేశం పాకిస్థాన్‌ లో ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పడలేదు. ఆ దేశ పార్లమెంటుకు ఎన్నికలు ముగిసి.. ఫలితాలు వెలువడ్డా ప్రభుత్వ ఏర్పాటులో ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది.

మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌ మద్దతుదారులు అత్యధికంగా 93 స్థానాల్లో గెలుపొందారు. మరో 75 స్థానాలను మాజీ ప్రధాని నవాజ్‌ షరీప్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌ – నవాజ్‌ గెలుచుకుంది. అలాగే మరో 54 స్థానాలను పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ దక్కించుకుంది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటులో అనిశ్చిత కొనసాగుతోంది. పాక్‌ జాతీయ అసెంబ్లీలో మొత్తం 265 స్థానాలున్నాయి. ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తిస్థాయి మెజారిటీ రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌ – నవాజ్‌ (పీఎంల్‌–ఎన్‌), పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) ముందుకు వచ్చాయి. అధికార పంపిణీపై ఈ రెండు పార్టీల మధ్య ఇప్పటికే మూడు విడతలు చర్చలు జరిగాయి. అయితే ఇంకా స్పష్టత రాలేదు. ఇరు పార్టీల నాయకులు మాత్రం తమ చర్చల్లో గణనీయమైన పురోగతి ఉందని ప్రకటించినట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 19న జరిగే మరో విడత చర్చల్లో అధికార పంపిణీపై ఒక నిర్ణయానికి వస్తామని ముస్లింలీగ్, పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీలు ప్రకటించాయి. బలమైన ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించాయి.

కాగా పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌ తమ పార్టీ తరఫున మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సోదరుడు షెహబాజ్‌ షరీఫ్‌ పేరును ప్రతిపాదించింది. మరోవైపు 54 స్థానాలు గెలిచిన పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ, 17 సీట్లు కైవసం చేసుకున్న ముత్తహిదా ఖ్వామి మూవ్‌ మెంట్‌ పాకిస్థాన్‌.. పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌ తో జతకట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి.

ప్రస్తుతం ఇమ్రాన్‌ ఖాన్‌ జైలులో ఉండటం, ఎన్నికల్లో ఆయన పార్టీ అభ్యర్థులకు ఒకటే గుర్తు అయిన ఎన్నికల బ్యాట్‌ ను ఇవ్వకపోవడంతో ఆ పార్టీ అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగాల్సి వచ్చింది. అయినప్పటికీ వీరే అత్యధికంగా 93 స్థానాల్లో విజయం సాధించారు.

కాగా ప్రభుత్వంలో చేరకుండా బయటినుంచి మద్దతు ఇస్తామని బిలావల్‌ భుట్టో సారథ్యంలోని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ చెబుతోంది. ఇందుకు ప్రతిఫలంగా దేశాధ్యక్ష స్థానం, స్పీకర్‌ వంటి రాజ్యాంగ పదవులను ఆశిస్తోంది. అయితే బయట నుంచి మద్దతు కాకుండా ప్రభుత్వంలో చేరాలని పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌.. ఆ పార్టీని కోరుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ లో ప్రభుత్వ ఏర్పాటులో ఇంకా అనిశ్చిత కొనసాగుతోంది.