Begin typing your search above and press return to search.

పాక్‌ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్... ఇమ్రాన్ టీం కొత్త ప్రయత్నం!

"సున్నీ ఇత్తేహద్‌ కౌన్సిల్‌ (ఎస్‌.ఐ.సీ )" పార్టీలో చేరేందుకు ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులంతా సిద్దం అయ్యారు.

By:  Tupaki Desk   |   20 Feb 2024 7:15 AM GMT
పాక్‌  రాజకీయాల్లో బిగ్  ట్విస్ట్... ఇమ్రాన్  టీం కొత్త ప్రయత్నం!
X

తుపాకీ చప్పుళ్లు, బాంబుల మోతలు, పేళుల్ల శబ్ధాల నడుమ ముగిసిన పాకిస్థాన్ ఎన్నికల ఫలితాల అనంతరం అక్కడి జాతీయ రాజకీయాల్లో సరికొత్త ట్విస్ట్లు, జలక్కులు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా... పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీకి కాబోయే ప్రధాని ఎవరనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అస్పష్టతతో కూడిన ఫలితాలే ఇందుకు కారణం అనేది తెల్లిసిన విషయమే కాగా... ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఎంట్రీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

అవును... అస్పష్టతతో కూడిన ఫలితాలతో ఏర్పడిన అనిశ్చితి.. ఇప్పుడు పాక్ పాలిటిక్స్ లో ఆసక్తికరమైన మలుపుకు కారణం అవుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్‌ - నవాజ్‌ (పి.ఎం.ఎల్- ఎన్) పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు తీవ్రంగా యత్నిస్తున్న నేపథ్యంలో... ఇమ్రాన్ ఖాన్ మద్ధతు దారులు రంగంలోకి దిగారు. నిన్నటివరకూ ప్రతిపక్ష పాత్రకైనా సిద్ధం అంటూ ప్రకటించివారు కాస్తా... ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లోకి దిగడం గమనార్హం.

సింగిల్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రానప్పటికీ... మిత్రపక్షం పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ)తో పాటు మరికొన్ని చిన్నా చితకా పార్టీలతోనూ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చింది నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పార్టీ. ఇదే సమయంలో తన సోదరుడు షెహబాజ్‌ ను ఎలాగైనా ఇంకోసారి ప్రధానమంత్రిని చేయాలని ఆయన తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇమ్రాన్‌ ఖాన్‌ మద్దతుదారులు రంగంలోకి దిగారు.

ఇందులో భాగంగా... పాక్‌ లోని "ఇస్లామిక్‌ పొలిటికల్‌ అండ్‌ రెలిజియస్‌ పార్టీస్‌ గ్రూప్‌" లోని ఓ చిన్న పార్టీ అయిన "సున్నీ ఇత్తేహద్‌ కౌన్సిల్‌ (ఎస్‌.ఐ.సీ )" పార్టీలో చేరేందుకు ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులంతా సిద్దం అయ్యారు. ఎస్‌.ఐ.సీ తరఫున ఆ పార్టీ చైర్మన్‌ సయ్యద్‌ మహ్‌ ఫూజ్‌ ఒక్కరే మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించగా... ఈ కూటమిలో చేరడం ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నది ఇమ్రాన్ బ్యాచ్ ప్లాన్‌ గా చెబుతున్నారు.

కాగా... పాకిస్థాన్‌ నేషనల్‌ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లుండగా... వీటిలో 266 స్థానాలకు ఎన్నికలు జరిగాల్సి ఉండగా.. ఓ సీటులో అభ్యర్థి చనిపోవడంతో 265 స్థానాలకే ఎన్నికలు జరిగాయి. ఇక... మిగిలిన 70 స్థానాల్లో 10 మైనారిటీలకు, 60 మహిళలకు రిజర్వ్‌ చేస్తారు. వీటిని గెలిచిన స్థానాలను బట్టి దామాషా ప్రకారం ఆయా పార్టీలకు కేటాయిస్తారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పాటుకు కనీసం 135 సీట్లలో గెలుపొందాల్సి ఉంది.

అయితే.. ఇమ్రాన్‌ ఖాన్‌ పీటీఐ పార్టీని పాక్‌ ఎన్నికల సంఘం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించింది. దీంతో ఆ పార్టీ అభ్యర్థులంతా ఇండిపెండెంట్లుగా పోటీ చేసి గెలిచారు. అయితే ఇండిపెండెట్లు అంతా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు కాబట్టి... ఎస్‌.ఐ.సీ పార్టీలో చేరిపోయి అక్కడ నుంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు షురూ చేసింది ఇమ్రాన్ ఖాన్ టీం! దీంతో... ఇమ్రాన్ ఖాన్ ప్రధాని అయ్యే అవకాశాలను కూడా కొట్టిపారేయలేమని అంటున్నారు పరిశీలకులు!