Begin typing your search above and press return to search.

భార‌త్‌కు బ‌ద్ధ శ‌త్రువే పాకిస్థాన్ ప్ర‌ధాని!

పాకిస్థాన్‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగి దాదాపు 20 రోజుల‌కు పైగానే అవుతోంది. అయితే.. ఇక్క‌డ ప్ర‌జ‌లు ఏపార్టీకీ సంపూర్ణ మెజారిటీ ఇవ్వ‌లేదు

By:  Tupaki Desk   |   3 March 2024 7:58 AM GMT
భార‌త్‌కు బ‌ద్ధ శ‌త్రువే పాకిస్థాన్ ప్ర‌ధాని!
X

పాకిస్థాన్‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగి దాదాపు 20 రోజుల‌కు పైగానే అవుతోంది. అయితే.. ఇక్క‌డ ప్ర‌జ‌లు ఏపార్టీకీ సంపూర్ణ మెజారిటీ ఇవ్వ‌లేదు. దీంతో సంకీర్ణ స‌ర్కారే ఏర్ప‌డ‌డం ఖాయ‌మైంది. అయితే.. ఏ పార్టీకీ మెజారిటీ రానందున ప్ర‌ధానిని గెలిచిన ఎంపీలు ఎన్నుకునే సంప్ర‌దాయం ఉంది. ఈ నేప‌థ్యంలో ఆదివారం సాయంత్రం నిర్వ‌హించే జ‌న‌ర‌ల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌ధానిని ఎన్నుకోనున్నారు. అయితే.. ఈ సారి కూడా భార‌త్‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న మాజీ ప్ర‌ధాని న‌వాష్ ష‌రీఫ్ సోద‌రుడు, మాజీ ప్ర‌ధాని షెహ‌బాజ్ మ‌రోసారి ఎన్నిక కావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

పాక్‌ ముస్లింలీగ్‌ - నవాజ్‌ పార్టీ అగ్రనేత, 72 ఏళ్ల‌ షెహబాజ్‌ షరీఫ్ దేశ 33వ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయంగా క‌నిపిస్తోంది. సంకీర్ణ పార్టీల‌ ప్రధాని పదవికి ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న షెహబాజ్‌ ఇప్పటికే తన నామినేషను పత్రాలను సమర్పించారు. షెహబాజ్‌కు పోటీగా మాజీ ప్రధాని, ప్ర‌ముఖ క్రికెట‌ర్‌ ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ పార్టీ నుంచి ఒమర్‌ అయూబ్‌ఖాన్‌ నామినేషను వేశారు. ప్రధాని ఎన్నికకు జాతీయ అసెంబ్లీలో ఆదివారం ఓటింగు జరగనుంది. విజేతగా నిలిచిన అభ్యర్థి ప్రధానమంత్రిగా సోమవారం అధ్యక్ష భవనంలో ప్రమాణస్వీకారం చేస్తారు.

ఎన్నిక‌ల్లో ఏం జ‌రిగింది?

గ‌త నెల ఫిబ్ర‌వ‌రిలో జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ ‘పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ ’ బలపర్చిన అభ్యర్థులు అత్యధికంగా 101 స్థానాల్లో గెలిచారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చెందిన ‘పీఎంఎల్‌-ఎన్‌’ పార్టీ 75 సీట్లు దక్కించుకుంది. బిలావల్ జర్దారీ భుట్టోకు చెందిన ‘పీపీపీ’కి 54 సీట్లు లభించగా, ఎంక్యూఎం-పీ పార్టీకి 17 సీట్లు వచ్చాయి. మిగిలిన స్థానాలను ఇతర పార్టీలు గెలుచుకున్నాయి.

పాక్ పార్ల‌మెంటులో మొత్తం 336 సీట్లు ఉన్నాయి. ఇందులో 266 స్థానాలకు నేరుగా ఎన్నికలు జరుగుతాయి. మిగతా 70 స్థానాలను మైనారిటీలకు, మహిళలకు కేటాయిస్తారు. మొత్తంగా చూస్తే.. ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ ద‌క్క‌ని నేప‌థ్యంలో ‘పీఎంఎల్‌-ఎన్‌’ పార్టీ, బిలావల్ జర్దారీ భుట్టోకు చెందిన ‘పీపీపీ’, ఎంక్యూఎం-పీ పార్టీలు సంయుక్తంగా అధికారాన్ని ద‌క్కించుకునే ప్ర‌య‌త్నాలు చేశారు. వీటి క‌ల‌యిక‌తో మేజిక్ ఫిగ‌ర్ 75+54+17 = 145 స్థానాలు ద‌క్కిన‌ట్ట‌యింది.