Begin typing your search above and press return to search.

పీవోకేలో ఉద్రిక్త వాతావరణం... పాకిస్థాన్ లో చీలిక తప్పదా?

పీవోకే... పాక్ ఆక్రమిత కశ్మీర్ వ్యవహారం భారత్ లో ఎంత హాట్ టాపిక్ అనేది తెలిసిన విషయమే

By:  Tupaki Desk   |   16 May 2024 6:28 PM GMT
పీవోకేలో ఉద్రిక్త వాతావరణం... పాకిస్థాన్ లో చీలిక తప్పదా?
X

పీవోకే... పాక్ ఆక్రమిత కశ్మీర్ వ్యవహారం భారత్ లో ఎంత హాట్ టాపిక్ అనేది తెలిసిన విషయమే. ఈ అంశంపై రకరకాల భావోద్వేగ రాజకీయాలు జరుగుతుంటాయి! ఆ సంగతి కాసేపు పక్కనపెడితే.. నిత్యం భారత్ పై పడి ఏడ్చే పాకిస్థాన్ దేశంలో ఇప్పుడు చీలిక తప్పదా అనే స్థాయి అంశం తెరపైకి వచ్చింది. అందుకు కారణం... పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త వాతావరణమే!

అవును... గతకొన్ని రోజులుగా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ లో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. అయితే ప్రతీ సమస్యకూ తుపాకీయే సమాధానం అని భావించడం వల్లో ఏమో కానీ.. ఈ ఆందోళనలపై పాక్ సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. దీంతో సమస్య మరింత జఠిలంగా మారుతుందని అంటున్నారు!

ఈ క్రమంలో... ముజఫరాబాద్‌ లో గోధుమ పిండి ధరలు, కరెంట్ ఛార్జీలపై ఆందోళన చేస్తున్న ప్రజలపై పాక్ సైన్యం కాల్పులు జరిపింది. ఇందులో సుమారు ముగ్గురి ప్రాణాలను బలిగొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటివరకు జరిగిన ఘర్షణల్లో సుమారు 100కి పైగా ఆందోళనకారులు, పోలీసులు గాయపడ్డారని అంటున్నారు.

అయితే... పీవోకే సంపదను ఇస్లామాబాద్ ప్రభుత్వం దోపిడీ చేస్తోందనేది ఇక్కడ ఆందొళనకారుల సింగిల్ లైన్ ఆరోపణ అని తెలుస్తుంది. ఇదే సమయంలో... స్థానికంగా ఉన్న 2,600 మెగావాట్ల నీలం జీలం హైడ్రో పవర్ ప్రాజెక్టులో తమకు వాటా ఇవ్వాలని పీవోకే ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక మంగ్లా డ్యామ్‌ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును తమకు ఉచితంగా ఇవ్వాలని కోరుతున్నారు.

వాస్తవానికి పాకిస్థాన్ లో నాలుగు ప్రావిన్సులైన పంజాబ్, సింధ్, బలూచిస్థాన్, ఖైబర్ ఫంఖ్తుంఖ్వా తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ముజఫరాబాద్, గిల్గిట్ బాల్టిస్థాన్ లు ఉన్నాయి. అయితే పాక్ లో పంజాబ్ ప్రజల ఆధిక్యం ఎక్కువగా ఉంటుంది. పాలన, సైన్యం లోనూ వీరే ఎక్కువగా ఉంటారని అంటుంటారు.

ఇదే సమయంలో దేశంలోని ఎక్కువ వనరులను వీరే అనుభవిస్తున్నారంటూ ఇతర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో... స్వాతంత్రం కోసం బలూచిస్థాన్ పోరాడుతుండగా.. దేశ విభజన జరగాలంటూ సింధ్ ప్రజలు.. అధికారంలో వాటా దక్కాలని ఖైబర్ వాసులు ఆందోళన చేస్తున్నారు.

ఇలా నిన్నటివరకూ రాజకీయ సంక్షోభం, రోజు రోజుకీ తీవ్రమవుతున్న తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ కు ఇప్పుడు ఈ సమస్య మరింత జఠిల పరిస్థితులను కల్పించబోతుందని అంటున్నారు పరిశీలకులు. ఫలితంగా దేశ విభజనకు దారితీసే పరిస్థితులు నెలకొన్నాయని చెబుతున్నారు!

ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే... పీవోకేలోని ఉద్యమకారుడు అంజాద్‌ అయూబ్‌ మిర్జా మాట్లాడుతూ... నిరాయుధులైన ప్రజలపై సైన్యం కాల్పులు జరుపుతున్నాయని ఆరోపించారు. అనంతరం... ఇక్కడ పరిస్థితి పూర్తిగా చేజారిపోయింది.. ఈ విషయంలో భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి.. ఈ ప్రాంతానికి స్వాతంత్య్రం కల్పించాలని డిమాండ్‌ చేశారు!