Begin typing your search above and press return to search.

ఉగ్రవాదం ఉప్పుపై రాజేసిన నిప్పు కార్చిచ్చు కానుందా?

ప్రాణ నష్టం పెరుగుతుండడంతో మొత్తానికి ఈ నిప్పు కార్చిచ్చుగా మారుతుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

By:  Tupaki Desk   |   18 Jan 2024 9:52 AM GMT
ఉగ్రవాదం ఉప్పుపై రాజేసిన నిప్పు కార్చిచ్చు కానుందా?
X

సంప్రదాయకంగా రెండూ ముస్లిం దేశాలే.. రెండూ అణ్వస్త్ర దేశాలే.. అయితే సంబంధాలు మాత్రం అంతంతే..? అలాంటి వాటి మధ్య ఇప్పుడు పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఉగ్రవాదం పేరిట జరుగుతున్న పరస్పర దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. హెచ్చరికలు శ్రుతిమించుతున్నాయి. మా భూభాగం మీద మీ పెత్తనమేంటనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ప్రాణ నష్టం పెరుగుతుండడంతో మొత్తానికి ఈ నిప్పు కార్చిచ్చుగా మారుతుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఊహించని పరిణామమే..?

పశ్చిమాసియాలో బలమైన దేశం ఇరాన్. ఎంత బలమైనది అంటే.. అమెరికాను ఎదిరించేంతగా. అత్యంత ఖరీదైన పంట.. కుంకుమపువ్వు 90 శాతం ఇరాన్ లోనే పండుతుంది. ఒకప్పుడు స్వేచ్ఛాయుత దేశమే అయినా.. 40 ఏళ్ల కిందట వచ్చిన విప్లవంతో మత రాజ్యంగా మారింది. ఇరాన్ ను లొంగదీసుకోవాలని అమెరికా ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇక ఇరాన్ తోటి ముస్లిం దేశమైన పాకిస్థాన్ పై రెండు రోజుల కిందట అనూహ్యంగా బలూచిస్థాన్ లోని 'జైష్‌ అల్‌ అదిల్‌' మిలిటెం గ్రూపు రెండు స్థావరాలపై దాడి చేసింది.. దీంతో పాములాంటి పాకిస్థాన్ తోక తొక్కింది. ఈ దాడులకు తీవ్ర పరిణామాలుంటాయంటూ పాక్ అప్పుడే మండిపడింది. 24 గంటల్లోనే ప్రతి దాడులకు దిగింది. ఇరాన్ లోని సియెస్థాన్‌-ఒ-బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌ లోని కొన్ని ప్రదేశాలు లక్ష్యంగా వైమానిక దాడులకు దిగింది. ప్రభుత్వం తరఫున ఎటువంటి ప్రకటనా చేయకున్నా.. 'బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌', 'బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ' కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. ఇరాన్‌ సియెస్థాన్‌-ఒ-బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని ఉగ్ర స్థావరాలపై జరిగిన ఈ దాడులకు 'మార్గ్‌ బర్‌ సర్మచార్‌' అనే పేరు పెట్టింది.

9 ప్రాణాలు బలి

పాకిస్థాన్ దాడుల్లోల ఇరాన్ లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిని ఉగ్రవాదులుగా పాక్ చెబుతోంది. తమ దేశానికి చెందిన ఉగ్రవాదులు ఇరాన్ లో ఉంటూ కార్యకలాపాలు సాగిస్తున్నారని కొన్నేళ్లుగా హెచ్చరిస్తున్నట్లు తెలిపింది. ఇరాన్‌ వాటిని పట్టించుకోలేదని ఆరోపించింది. అక్కడివారే తమ దేశంలో రక్తపాతానికి కారణమవుతున్నారని ఆరోపించింది. కాగా, పాక్‌ దాడిలో నలుగురు పిల్లలు, ముగ్గురు మహిళలు మరణించినట్లు సియెస్థాన్‌-ఒ-బలూచిస్థాన్ ప్రావిన్స్‌ డిప్యూటీ గవర్నర్‌ తెలిపారు. వీరు ఇరాన్‌ పౌరులు కాదని చెప్పారు. వెల్లడించారు. పాక్‌ దాడికి సంబంధించినవిగా పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో పలు ఫొటోలు, వీడియోలు వైరలవుతున్నాయి. వాటిని ధ్రువీకరించడానికి ఎలాంటి ఆధారాలు లేవు.

ఈ ఘర్షణ ఎటుపోతుందో?

అమెరికా మద్దతున్న పాకిస్థాన్ అసలే ఉగ్ర కేంద్రం.. ఇరాన్ మాత్రం కరుడుగట్టిన అమెరికా వ్యతిరేకి. అలాంటి రెండు దేశాల మధ్య ఉగ్రవాదం ఆరోపణలతో దాడులు పరస్పర జరగడం అనూహ్యమే. ఇది చివరకు ఎక్కడకు దారితీస్తుందోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పశ్చిమాసియాలో ఇజ్రాయిల్-పాలస్తీనా మధ్య యుద్ధం తీవ్రంగా ఉంది. ఉక్రెయిన్-రష్యా రెండేళ్ల నుంచి యుద్ధంలోనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇరాన్-పాక్ మధ్య సమస్య తలెత్తడం గమనార్హం.