భార్యను కలవడానికి వచ్చి.. హైదరాబాద్ లో పాకిస్తానీ అరెస్ట్
హైదరాబాద్లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ కు చెందిన మహమ్మద్ ఫయాజ్ అనే వ్యక్తి తన భార్యను కలవడానికి నగరానికి వచ్చి అరెస్ట్ అయ్యాడు.
By: Tupaki Desk | 26 April 2025 11:36 AM ISTహైదరాబాద్లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ కు చెందిన మహమ్మద్ ఫయాజ్ అనే వ్యక్తి తన భార్యను కలవడానికి నగరానికి వచ్చి అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుత ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉన్న సున్నితమైన పరిస్థితుల నేపథ్యంలో ఈ సంఘటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
తాజా నివేదికల ప్రకారం.., మహమ్మద్ ఫయాజ్ దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నాడు. అతడి భార్య హైదరాబాద్ లో ఆమె తన తల్లిదండ్రుల వద్ద ఉంది. ఆ యువతికి ప్రెగ్నెన్సీ కావడంతో ఆమెను కలవడానికి ఫయాజ్ చట్టవిరుద్ధంగా నేపాల్ మీదుగా భారతదేశంలోకి ప్రవేశించాడు. అతడి వద్ద ఎటువంటి సరైన వీసా లేదా పత్రాలు లేవు. హైదరాబాద్ కు వచ్చిన ఫయాజ్ ఇక్కడి మహిళను వివాహం చేసుకున్నట్లు సమాచారం. అయితే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ , తెలంగాణ డీజీపీ ఆదేశాల మేరకు భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను గుర్తించి, వారిని వెనక్కి పంపే ప్రక్రియ కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు మహమ్మద్ ఫయాజ్ ను అదుపులోకి తీసుకున్నారు. వీసా లేకుండా చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించినందుకు అతడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫయాజ్ దుబాయ్ లో పని చేస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
కాగా హైదరాబాద్ లో దాదాపు 208 మంది పాకిస్తానీయులు ఉన్నట్లు గతంలోనే గుర్తించారు. సరైన పత్రాలు లేని వారందరూ వెంటనే దేశం విడిచి వెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల నేపథ్యంలోనే మహమ్మద్ ఫయాజ్ అరెస్ట్ ప్రాధాన్యతను సంతరించుకుంది.
దేశంలో భద్రతాపరమైన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అక్రమ వలసలపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.ఈ సంఘటన రెండు దేశాల మధ్య సంబంధాల ప్రస్తుత స్థితిని, భద్రతాపరమైన ఆందోళనలను మరోసారి హైలైట్ చేసింది. హైదరాబాద్ లో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులపై నిఘా కొనసాగుతుందని అధికారులు తెలిపారు.