Begin typing your search above and press return to search.

పాకిస్థాన్‌ ఎన్నికలు.. అసలు ఏం జరుగుతోంది?

ఇటీవల ఇమ్రాన్‌ ఖాన్‌ కు వివిధ కేసుల్లో వరుసగా భారీ జైలుశిక్షలు పడటంతో ఆయన ప్రస్తుతం జైలులో ఉన్నారు.

By:  Tupaki Desk   |   9 Feb 2024 5:17 AM GMT
పాకిస్థాన్‌ ఎన్నికలు.. అసలు ఏం జరుగుతోంది?
X

భారత్‌ దాయాది దేశం.. పాకిస్థాన్‌ లో తాజాగా సార్వత్రిక ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇంతవరకు ఫలితాలను వెల్లడించలేదు. ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతోంది. వాస్తవానికి ఫిబ్రవరి 8న ఎన్నికలు ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపును చేపట్టారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 9న శుక్రవారం తెల్లవారుజామున తొలి ఫలితాన్ని వెల్లడించారు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఫలితాల వెల్లడిని నిలిపేశారు.

మరోవైపు పాక్‌ ఎన్నికల్లో గెలుపొందింది తామేనని పాకిస్థాన్‌ తెహ్రీక్‌ – ఇ–ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ అధినేత, మాజీ స్టార్‌ క్రికెటర్, మాజీ ప్రధాని అయిన ఇమ్రాన్‌ ఖాన్‌ అంటున్నారు. ఇటీవల ఇమ్రాన్‌ ఖాన్‌ కు వివిధ కేసుల్లో వరుసగా భారీ జైలుశిక్షలు పడటంతో ఆయన ప్రస్తుతం జైలులో ఉన్నారు.

ఈ నేపథ్యంలో తమ పార్టీ 150 నేషనల్‌ అసెంబ్లీ స్థానాలకు పైగా తాము గెలుపొందినట్లు పీటీఐ ౖచైర్మన్‌ గోహర్‌ ఖాన్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఎన్నికల ఫలితాలను ప్రకటించాలని ఎన్నికల సంఘానికి విన్నవించారు.

కాగా జైల్లో ఉన్న ఇమ్రాన్‌ ఖాన్‌ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. చివరకు ఆయన పార్టీ.. పీటీఐ ఎన్నికల గుర్తు అయిన క్రికెట్‌ బ్యాట్‌ ను కూడా ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో పీటీఐ అభ్యర్థులంతా ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగారు.

కాగా ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీ ఆధిక్యంలో ఉందనేది కానీ, ఏ పార్టీ అత్యధిక సీట్లు గెలిచిందనేది కానీ తెలియడం లేదు. ఎన్నికల సంఘం కావాలనే ఫలితాల వెల్లడిని జాప్యం చేస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కాగా ఎన్నికల సంఘం ప్రకటించిన తొలి ఫలితంలో పీటీఐ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థి సమియుల్లా ఖాన్‌ విజయం సాధించారు. ఆయన కైబర్‌ పంఖ్తుంక్వా ప్రావిన్సియల్‌ అసెంబ్లీకి చెందిన పీకే–76 స్థానంలో గెలుపొందారు. అలాగే పీకే–6లోనూ పీటీఐ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి ఫజల్‌ హకీమ్‌ ఖాన్‌ విజయం గెలిచారు. అదేవిధంగా స్వాట్‌ లోని పీకే–4 నియోజకవర్గంలోనూ పీటీఐ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థి అలీ షా గెలుపొందడం గమనార్హం.

ఈ నేపథ్యంలో ఫలితాల వెల్లడిని పాక్‌ ఎన్నికల సంఘం ఆపేయడం హాట్‌ టాపిక్‌ గా మారింది. తమ గెలుపును ఆపేందుకు ఎన్నికల సంఘం కుట్ర చేస్తోందని ఇమ్రాన్‌ ఖాన్‌ సారధ్యంలోని పీటీఐ ఆరోపించింది. ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది.

ఓట్ల లెక్కింపులో ఆలస్యం వల్లే ఫలితాలు వెల్లడిలో జాప్యం జరుగుతోందని ఎన్నికల సంఘం తెలిపింది. తమను తప్పుపడుతూ మీడియాలో వస్తున్న వార్తలను తోసిపుచ్చింది. ఫలితాలను తప్పుకుండా వెల్లడిస్తామని పేర్కొంది.

ఓటింగ్‌ ప్రారంభానికి ముందు ఫిబ్రవరి 8న ఉదయం 8 గంటల నుంచే పాక్‌ ప్రభుత్వం దేశవ్యాప్తంగా సెల్‌ఫోన్, మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపేసింది. ఇప్పటివరకు వాటిని ఇంకా పునరుద్ధరించలేదు.

కాగా సైన్యం మద్దతు ఇస్తున్న పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌ (పీఎంఎల్‌)–ఎన్‌ అధినేత నవాజ్‌ షరీఫ్‌ ఓడిపోయినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి.

పాకిస్థాన్‌ నేషనల్‌ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లున్నాయి. వీటిలో 266 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. మిగతా 70 స్థానాల్లో 10 మైనారిటీలకు, 60 మహిళలకు రిజర్వ్‌ చే శారు. వీటిని ఆయా పార్టీలకు అవి గెలిచిన స్థానాలను బట్టి దామాషా ప్రకారం కేటాయిస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీసం 135 సీట్లలో గెలుపొందడం అవసరం.