Begin typing your search above and press return to search.

అత్యంత పేద ప్రాంతం కోసం పంట సాగు... రంగంలోకి పాక్ ఆర్మీ!

ఈ సమయంలో వ్యవసాయం చేస్తామని పాక్ ఆర్మీ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కార్యరూపం దాల్చబోతుందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   4 Nov 2023 3:30 PM GMT
అత్యంత పేద ప్రాంతం కోసం పంట సాగు... రంగంలోకి పాక్  ఆర్మీ!
X

ఎవరు ఏ పని చేయాలో వారు ఆ పనిచేస్తే అంతా సవ్యంగా ఉంటుంది.. అలా కానిపక్షంలో గాడిద పని గుర్రం, గుర్రం పని గాడిదా చేస్తే పరిస్థితితులు తలకిందులు అయిపోతాయని పెద్దలు చెబుతుంటారు. ఆ సంగతి అలా ఉంటే... స్వాతంత్ర్యం పొందిన తర్వాత సుమారు సగం కాలం సైనిక పాలనలోనే కొనసాగిన పాకిస్థాన్‌ లో.. ఇప్పటికీ అన్నీ తానే అయి వ్యహరిస్తుంటుంది! ఆ ప్రభావమో ఏమో కానీ ప్రస్తుతం ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుంది!

ఈ సమయంలో వ్యవసాయం చేస్తామని పాక్ ఆర్మీ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కార్యరూపం దాల్చబోతుందని అంటున్నారు. అవును... పాకిస్థాన్‌ లో అన్నీ తానే అయి వ్యవహరించే సైన్యం దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు అంటూ వ్యవసాయ రంగంలోకి దిగుతుంది. ఈ క్రమంలో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులో వేల ఎకరాలను సాగు చేసేందుకు పాక్‌ సైన్యం సిద్ధమైంది.

ఈ ప్రాంతం ఆహార స్వయం సమృద్ధిని సాధించేందుకు కార్పొరేట్‌ అగ్రికల్చర్‌ ప్రాజెక్టును చేపడుతున్నట్లు సైన్యం వెల్లడించింది. ఫలితంగా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సు ఎదుర్కొంటున్న ఆహార సంక్షోభం, అశాంతి నుంచి బయటపడేందుకు ఇది సహకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ కారణంతోనే తమ సైన్యం తొలిసారిగా వ్యవసాయంలోకి అడుగుపెడుతోందని చెబుతుంది.

ఇక దీనికి సంబంధించి "కార్పొరేట్‌ అగ్రికల్చర్‌ ఫార్మింగ్" ప్రాజెక్టు కింద పంజాబ్‌ ప్రభుత్వం 45వేల ఎకరాలను సైన్యానికి కేటాయించినట్లు అక్కడి జియో న్యూస్‌ వెల్లడించింది. ఇదే సమయంలో... ఈ భూమిపై యాజమాన్య హక్కులు స్థానిక ప్రభుత్వానికే ఉంటాయని.. దీని ద్వారా వచ్చే ఆదాయంలో సైన్యం ఏమీ తీసుకోదని తెలిపింది.

ఇదే సమయంలో... వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంలో భాగంగా తొలుత దక్షిణ వజిరిస్థాన్‌ ప్రాంతంలో 1000 ఎకరాల భూమిలో సాగు మొదలుపెట్టి.. తర్వాత దాన్ని 41వేల ఎకరాలకు విస్తరించనుందని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ విషయాలపై స్పందించిన పెషావర్‌ కోర్ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ సర్దార్‌ హసన్‌ అజహర్‌ హయత్‌... వ్యవసాయ ఉత్పత్తులను పెంచడంతోపాటు స్వయం సమృద్ధిని సాధించే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు చెప్పుకొచ్చారు.


ఇక ఈ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సు అఫ్గానిస్థాన్‌ కు సరిహద్దులో ఉంటుంది. కొన్నేళ్లుగా బలోచిస్థాన్‌, ఖైబర్ పఖ్తుంఖ్వాలో భద్రతా సిబ్బంది, పౌరులపై ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఇలా ఈ సంఘర్షణలు సుదీర్ఘకాలంగా కొనసాగుతుండటం వల్ల... స్థానిక ప్రజల వలసలు వెళ్లిపోయారు. దీంతో... వ్యవసాయ భూమి, నీటిపారుదల నిర్మాణాలు, పశుపోషణ వసతులు దెబ్బతిన్నాయి. ఈ సమయంలో ఈ ప్రాంతాన్ని అత్యంత పేద ప్రాంతాల్లో ఒకటిగా ఐరాసకు చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ పేర్కొంది.



కాగా... పాకిస్థాన్‌ లోని పంజాబ్‌ ప్రావిన్స్‌ లో ఉన్న దాదాపు 10 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని సైన్యం కౌలుకు తీసుకోబోతున్నదని.. ఇందులో గోధుమలు, పత్తి, చెరకు, కూరగాయలు, పండ్లను సాగు చేస్తుందని గతంలో కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. వీటిని అమ్మడం ద్వారా వచ్చే లాభాల్లో 20 శాతం సొమ్మును వ్యవసాయ పరిశోధన, అభివృద్ధికి కేటాయిస్తుందని స్థానిక మీడియా వెల్లడించింది.



ఇక మిగిలిన సొమ్మును సైన్యం, రాష్ట్ర ప్రభుత్వం సమానంగా పంచుకుంటాయని.. పేదలకు ఆహార భద్రత కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సైన్యం చెప్తున్నదని వార్తలొచ్చాయి. ఇదే సమయంలో... గ్రామీణ పేదల హక్కులను సైన్యం మరింత ఉల్లంఘించబోతున్నదనే విమర్శలు కూడా తదనుగుణంగా వచ్చాయి!