Begin typing your search above and press return to search.

వ్యవసాయం చేయనున్న పాక్‌ సైన్యం... కారణం క్లియర్!

పాకిస్థాన్ లో ఆర్మీ అత్యంత కీలకంగా వ్యవహరిస్తుందనేది తెలిసిన విషయమే. పాక్ ఆర్మీ దేశ భద్రతతోపాటు రాజకీయంగా కూడా కీలక భూమిక పోషిస్తుంటుంది

By:  Tupaki Desk   |   26 Sep 2023 4:59 AM GMT
వ్యవసాయం చేయనున్న పాక్‌ సైన్యం... కారణం క్లియర్!
X

పాకిస్థాన్ లో ఆర్మీ అత్యంత కీలకంగా వ్యవహరిస్తుందనేది తెలిసిన విషయమే. పాక్ ఆర్మీ దేశ భద్రతతోపాటు రాజకీయంగా కూడా కీలక భూమిక పోషిస్తుంటుంది. ఆ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటినుంచీ పలుమార్లు రాజకీయాల్లో తలదూర్చి పరోక్షంగా దేశాన్ని శాసించేది. ఈ సమయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది.

అవును... ఇప్పటివరకూ సైనిక వ్యవహారాలతో పాటు పాలనపైనా పట్టు కొనసాగిస్తున్న పాకిస్థాన్ ఆర్మీ.. ఇప్పుడు సరికొత్త పాత్రను పోషించబోతోంది. ఇందులో భాగంగా వ్యవసాయం చేయాలని నిర్ణయించుకుంది. ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న వేళ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికోసం లక్షల ఎకరాల భూసేకరణ చేపడుతుంది!

పాక్ మీడియా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం... ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ లో పెరుగుతున్న పేదల సంఖ్యతో పాటు దేశంలో ఆహారం లేక పస్తులుంటున్న వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతుందని అంటున్నారు. ఈ సమయంలో పాకిస్థాన్ ఆర్మీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికోసం 10 లక్షల ఎకరాలకు పైగా వ్యవసాయ భూమిని సేకరిస్తోంది.

పాక్ లో ఆర్ధిక సంక్షోభం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఆహార భద్రత కోసం ఆర్మీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా... పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో సుమారు 10 లక్షల ఎకరాల భూమిని ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ భూమిలో గోధుమలు, చెరుకు, పత్తి వంటి వాణిజ్య పంటలతోపాటు కూరగాయలు, పండ్ల చెట్ల పెంపకం కూడా చేపట్టాలని భావిస్తోంది.

వీటిని అమ్మడం ద్వారా వచ్చే లాభాల్లో 20 శాతం సొమ్మును వ్యవసాయ పరిశోధన, అభివృద్ధికి కేటాయించాలని నిర్ణయించగా.. మిగిలిన 80శాతం సొమ్మును సైన్యం, రాష్ట్ర ప్రభుత్వం సమానంగా పంచుకుంటాయని అంటున్నారు. ఈ విషయాలపై స్పందించిన ఆర్మీ... పేదలకు ఆహార భద్రత కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పూకుంటుంది. అయితే గ్రామీణ పేదల హక్కులను పాక్ ఆర్మీ మరింత ఉల్లంఘించబోతున్నదనే విమర్శలు కూడా మరోవైపు వస్తున్నాయి.

కాగా... పాకిస్తాన్ దేశంలో దిగుమతులు, ఎగుమతుల కంటే ఎక్కువగా ఉండటంతోపాటు గత 40 సంవత్సరాలుగా, దాని లోటును తీర్చడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదని... పూర్తిగా ప్రపంచంపై ఆధారపడిందని.. ఫలితంగా పాక్ ఆర్థిక వ్యవస్థ క్షీణించిందనేది తెలిసిన విషయమే. దిగుమతులకు ప్రత్యామ్నాయంగా తగినంత సామర్థ్యాన్ని పెంచుకోలేకపోవడమే మాంద్యానికి బలమైన కారణంగా ఆర్థికవేత్తలు చెబుతున్నారు.