పాక్ గొంతు ఎండుతోంది... షాకింగ్ గా ఐఆర్ఎస్ఏ లెక్కలు!
పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సిందూర్ సైనిక చర్యకంటే ముందు భారత్ పలు దౌత్యపరమైన సంచలన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 3 Jun 2025 3:00 AM ISTపహల్గాం ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సిందూర్ సైనిక చర్యకంటే ముందు భారత్ పలు దౌత్యపరమైన సంచలన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... భారత్ - పాక్ మధ్య అత్యంత కీలకమైన సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఈ క్రమంలో తాజాగా పెరుగుతోన్న వేడి నేపథ్యంలో పాక్ గొంతు ఎండుతోందని అంటున్నారు.
అవును... సింధు, జీలం, చీనాబ్ లతో కూడిన సింధు నదీ వ్యవస్థలో నీటి కొరత తీవ్రంగా ఉన్నందున పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ కఠినమైన ఖరీఫ్ సీజన్ ఎదుర్కొంటోందని అంటున్నారు! ఇప్పటికే ఇస్లామాబాద్ తన రెండు ముఖ్య ప్రాంతాలైన సింధు నదిపై తర్బెలా, జీలం నదిపై మంగ్లాలో నీరు తగ్గిపోతోందని అంటున్నారు.
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారతదేశం సరఫరాలో స్వల్ప తగ్గుదల తర్వాత చీనాబ్ నది ఇన్ ఫ్లో లో ఆకస్మిక తగ్గుదల కలిగిందని చెబుతున్నారు. తాజాగా పాకిస్థాన్ ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం.. పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్ లోపల సింధూ నదీ వ్యవస్థలో నీటి లభ్యత 2025 జూన్ 2 నాటికి.. 2024తో పోలిస్తే 10.3 శాతం తగ్గింది.
పైగా ఇంకా నైరుతి రుతుపవనాల ప్రారంభానికి ఇంకా కనీసం నాలుగు వారాల సమయం ఉన్నందున రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మరింత దిగజారొచ్చని చెబుతున్నారు. ఇదే సమయంలో.. పాక్ లోపల సింధు నదీ వ్యవస్థలో నీటి పంపిణీని నిర్వహించడానికి నియంత్రణ సంస్థగా ఉన్న ఇస్లామాబాద్ లోని ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ (ఐఆర్ఎస్ఏ) స్పందించింది.
దాని లెక్కల ప్రకారం.. పంజాబ్ ప్రావిన్స్ లో 2024 జూన్ నాటికి నీటి లభ్యత 1,43,600 క్యూసెక్కులు కాగా.. ఈ ఏడాది జూన్ 2 నాటికి దక్కిన మొత్తం నీటి లభ్యత 1,28,800 క్యూసెక్కులు మాత్రమే. అంటే.. గత ఏడాది ఇదే నెలలో అందుబాటులో ఉన్న నీటికంటే ఇది 14,800 క్యూసెక్కులు తక్కువన్నమాట.
ఈ నేపథ్యంలో ఖరీఫ్ లో విత్తనాలు వేసే సీజన్ ప్రారంభమైనందున, జూన్ చివరి వరకూ నైరుతి రుతుపవనాలు పంజాబ్ ప్రావిన్స్ కు చేరుకునే అవకాశం లేనందున.. తీవ్రమైన వేది వాతావరణం మధ్య నీటిపారుదల సమస్యలు తీవ్రంగా తలెత్తుతున్నాయని అంటున్నారు. దీంతో.. పాక్ రైతు గొంతు ఎండుతుందని అంటున్నారు.
